యాదాద్రీశుడి సన్నిధిలో ఘనంగా ఆధ్యాత్మిక పర్వాలు

ABN , First Publish Date - 2021-05-09T06:10:51+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం ఆధ్యాత్మిక పర్వాలు వైభవంగా కొనసాగాయి. బాలాలయంలో స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం, నిజాభిషేకం, నిత్యార్చనలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు.

యాదాద్రీశుడి సన్నిధిలో ఘనంగా ఆధ్యాత్మిక పర్వాలు
బాలాలయంలో లక్ష్మీనారసింహుల నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

15వరకు ఆలయ వేళల మార్పు


యాదాద్రి టౌన్‌, మే 8: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం ఆధ్యాత్మిక పర్వాలు వైభవంగా కొనసాగాయి. బాలాలయంలో స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం, నిజాభిషేకం, నిత్యార్చనలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు బిందే తీర్థం, బాలభోగం, నిత్య కైంకర్యాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు ఆశీస్సులు అందజేశారు. కొండపైన అనుబంధ రామలింగేశ్వరస్వామిని ఆస్థానపరంగా కొలిచిన పూజారులు ఉపాలయంలో చరమూర్తులను పంచామృతాలతో అభిషేకించి బిల్వపత్రాలతో అర్చించారు. సాయంత్రం బాలాలయంలో అలంకార సేవోత్సవాలు, సహస్రనామార్చనలు కొనసాగాయి. స్వామికి శనివారం రూ.1,50,297 ఆదాయం సమకూరింది. కాగా, యాదాద్రీశుడిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, బాలాలయ కవచమూర్తుల దర్శనం, సువర్ణ పుష్పార్చన పూజల అనంతరం ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వీరివెంట ఆలయ పేష్కార్‌ గజ్వేల్‌ రమేశ్‌బాబు, పర్యవేక్షకుడు నరేశ్‌, సిబ్బంది దినేశ్‌ ఉన్నారు.


ఆలయ వేళల మార్పు కొనసాగింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వేళల్లో మార్పు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుందని దేవస్థాన అధికారులు తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో స్వామివారి నిత్య కైంకర్యాలు ఉదయం 5.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. అదేవిధంగా భక్తులకు బాలాలయ కవచమూర్తుల దర్శన వేళల్లో సైతం మార్పులు కొనసాగుతాయన్నారు.

Updated Date - 2021-05-09T06:10:51+05:30 IST