ఘనంగా భోగి సంబురాలు

Jan 14 2022 @ 23:52PM
తాండూరు : వేంకటేశ్వర కాలనీలో ముగ్గు వేస్తున్న యువతి

  • ఇంటి ముంగిళ్లలో ముగ్గులు వేసిన మహిళలు 
  • గాలిపటాలతో యువకులు, చిన్నారుల సందడి 
  • భోగి మంటలు వేసిన ప్రజలు

వికారాబాద్‌/నవాబుపేట/బంట్వారం/మర్పల్లి/మోమిన్‌పేట/తాండూరు/కీసర రూరల్‌/ మేడ్చల్‌/ ఘట్‌కేసర్‌ రూరల్‌/ పరిగి/దోమ/కులకచర్లచ/ దోమ /పెద్దేముల్‌/ యాలాల/పూడూరు: భోగి పండుగను వికారాబాద్‌ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతికి ముందు రోజైన భోగి పండుగను శుక్రవారం వికారాబాద్‌ నియోజకవర్గంలోని వికారాబాద్‌, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, మోమిన్‌పేట మండలాలు, గ్రామాల్లో ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. ప్రతి ఇంటా నవధాన్యాలు, సిరిసంపదలు ఏడాదిపాటు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటూ పాత వస్తువులతో భోగి మంటలు వేశారు. మహిళలు తెల్లవారుజాము నుంచే చలిని లెక్కచేయకుండా మంగళస్నానాలు ఆచరించి ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. పలు గ్రామాల్లో ఇళ్ల ముందు పాలు పొంగించి భోగిని జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి సమీపంలోని దేవాలయాలు దర్శించుకొని భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాదంతా సుఖసంతోషాలతో ఉండాలని ఇష్టదైవాలను కోరుకున్నారు. గ్రామాల్లో ఏ వీధి చూసినా రంగులమయంగా కనబడింది. చిన్నారులు గాలిపటాలు వేస్తూ కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపారు. పిండివంటలు చేసుకుని కుటుంబసభ్యులతో తిని ఆనందంగా గడిపారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రజలు ఘనంగా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణంలో మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి, పిండి వంటలతో కుటుంబసమేతంగా సంబురాలు చేసుకున్నారు.  కాగా, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొవ్వల్లి గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, అక్కడి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాలతో కలిసి పాల్గొన్నారు. బోగీ మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. పిండి వంటలతో సహపంక్తి భోజనం చేశారు. అలాగే పరిగి, దోమ, కులకచర్లచ దోమ, పూడూరు మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సంక్రాంతి సందడి కనిపించింది.  యువకులు, విద్యార్థులు గాలిపటాలు ఎగరవేశారు. 

  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో..

మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రజలు సూర్యోదయానికి ముందే భోగి మంటలు వెలిగించారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. మహిళలు ఉదయాన్నే తమ ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేసారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను ఉంచి, నవధాన్యాలతో అలంకరించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా గాలి పటాలను ఎగరేసేందుకు ఆసక్తి చూపారు. బంధువులు రావడంతో ఇళ్లలో సందడి వాతవరణం నెలకొంది. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, కోడి పందేలను తిలకించేందుకు ఘట్‌కేసర్‌ మండలంలోని కొర్రెముల, ప్రతా్‌పసింగారం, మర్రిపల్లిగూడ, అవుశాపూర్‌, వెంకటాద్రిటౌన్‌షిప్‌ తదితర గ్రామాలకు చెందిన పలువురు నాయకులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్ళారు. సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు వెంకటే్‌షగౌడ్‌, ప్రతా్‌పసింగారం సర్పంచ్‌ శివశంకర్‌, మర్రిపల్లిగూడ ఉపసర్పంచ్‌ నరేష్‌, తదితరులు వెళ్లారు. 

  •  ముగ్గుల పోటీలు

వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలోని కందనెల్లి గ్రామంలో శుక్రవారం అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌ శ్రీలత, పెద్దేముల్‌ వైస్‌ఎంపీపీ మధులతలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. యువజన సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌, కార్యనిర్వాహణాధికారి నర్సింహులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు ఆసక్తిగా పాల్గొని ముగ్గువేశారు. ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు పెద్దోళ్ల ఆనంద్‌కుమార్‌, మండల ఇన్‌చార్జి ఎం.నర్సింహులు పాల్గొని మాట్లాడుతూ కులమతాలకతీతంగా మహిళలు, విద్యార్థినులు ముగ్గుల పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కావలి సురేఖ, వైస్‌ఎంపీపీ రమేష్‌, ఉపసర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి, ఎంఎ్‌సఎఫ్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం.ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు అజయ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.