బీకేయూలో చీలిక!

ABN , First Publish Date - 2022-05-16T08:41:42+05:30 IST

భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిఽధిగా ఉన్న రాకేశ్‌ తికాయత్‌ రాజకీయ పార్టీలతో అంటకాగడం సంఘంలో చర్చోపచర్చలు, విమర్శలకు దారితీసి..

బీకేయూలో చీలిక!

తికాయత్‌ సోదరుల పట్ల ఓ వర్గం గుస్సా 

రాజేశ్‌ సింగ్‌ సారథ్యంలో బీకేయూ (ఎ) పేరుతో వేరు కుంపటి 

న్యూఢిల్లీ, మే 15: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిఽధిగా ఉన్న రాకేశ్‌ తికాయత్‌ రాజకీయ పార్టీలతో అంటకాగడం సంఘంలో చర్చోపచర్చలు, విమర్శలకు దారితీసి.. చివరికి రైతు నేతలను రెండు వర్గాలుగా విడగొట్టింది. ఫలితంగా రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని పేరున్న బీకేయూ రెండుగా చీలిపోయింది. బీకేయూలో కీలక నేతలుగా ఉన్న తికాయత్‌ సోదరులు రాకేశ్‌, నరేశ్‌ తీరును వ్యతిరేకిస్తూ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ సింగ్‌ చౌహాన్‌ వేరు కుంపటి పెడుతున్నట్లు ప్రకటించారు. బీకేయూలో తికాయత్‌ సోదరులు ఉంటారని, తమది ఇక కొత్త సంస్థ అని, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఎ-అపొలిటికల్‌) పేరుతో అది కార్యకలాపాలు సాగిస్తుందని ప్రకటించారు. అపొలిటికల్‌ అంటే రాజకీయాలతో సంబంధం లేనిది అని అర్థం. ‘బీకేయూ-ఎ’కు రాజేశ్‌ సింగ్‌ చౌహాన్‌ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. రైతు సంఘమైన బీకేయూ ఏ రాజకీయ పార్టీ కోసం పని చేయరాదనేది సిద్ధాంతం అని, అయితే రాకేశ్‌ తికాయత్‌ ‘రాజకీయ క్షేత్రం’లోకి మారిపోయారని, రైతుల సమస్యలపై దృష్టిపెట్టడం లేదని.. ఫలితంగానే వేరుగా సంఘం పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘ఎన్నికలు రాగానే మహేంద్ర సింగ్‌ తికాయత్‌ సిద్ధాంతాల మార్గాన్ని వీడి దారి తప్పారు. ఆ రకంగా మమల్ని అవమానించారు’’ అని రాజేశ్‌ సింగ్‌ చౌహాన్‌ మండిపడ్డారు. తికాయత్‌ సోదరులు (రాకేశ్‌, నరేశ్‌) ఉన్న బీకేయూతో ఇక తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 


చీలికకు కారణం? 

బీకేయూలో తికాయత్‌ సోదరులదే హవా. ఢిల్లీ శివార్లలో ఆందోళనల సమయంలో రాకేశ్‌ తికాయత్‌ బీజేపీయేతర పార్టీలకు దగ్గరవడం విమర్శలకు దారి తీసింది. 2021 మార్చిలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో భాగంగా మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు రాకేశ్‌ తికాయత్‌ వచ్చారు. ఆయన సోదరుడు, నరేశ్‌ తికాయత్‌ యూపీ ఎన్నికల్లో ఎస్‌పీ, ఆర్‌ఎల్డీ కూటమికి బహిరంగంగా మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. కేవలం రైతు ప్రయోజనాల కోసం పనిచేసే బీకేయూలో ఇలాంటి రాజకీయ వాసనలు తగవంటూ అందులోని ఓ వర్గం తీవ్రంగా నిరసిస్తూ వస్తోంది. చివరికి ఇది చిలికి చిలికి గాలివానగా మారి వేరు కుంపటికి దారితీసింది.

Updated Date - 2022-05-16T08:41:42+05:30 IST