Advertisement

ప్రతి బెడ్డుకు ఆక్సిజన..!

May 4 2021 @ 00:15AM
ప్రస్తుతం రిమ్స్‌లో ఉన్న 13 కిలో లీటర్ల ఆక్సిజన ట్యాంక్‌

కొవిడ్‌-19 ఆస్పత్రిగా రిమ్స్‌

750 బెడ్లకు ఆక్సిజన అందేలా సన్నాహాలు

డెంటల్‌ ఆస్పత్రిలో అత్యవసర జనరల్‌ కేసులకు చికిత్స

ఆక్సిజన కొరత రాకుండా ప్రత్యేక చర్యలు 


కరోనా.. కరోనా.. ఎవరి నోటవిన్నా ఇదే మాట. అంతగా సెకండ్‌ వేవ్‌ వైరస్‌ విజృంభిస్తోంది. జిల్లాలో రోజువారి కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. అదే క్రమంలో హోం ఐసోలేషనలో ఉంటున్న బాధితులు వైరస్‌ తీవ్రత పెరిగాక విషమ పరిస్థితుల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. అలా వస్తున్నవారిలో ఎక్కువ మందికి ఆక్సిజన అవసరం ఉంటోంది. ప్రస్తుతం జిల్లాలో ఆక్సిజన కొరత లేకున్నా.. బెడ్ల కొరత వేధిస్తోంది. దీంతో రిమ్స్‌ను పూర్తిగా కొవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చారు. ప్రతి బెడ్‌కు ఆక్సిజన అందేలా చర్యలు చేపట్టారు. మరో 30 కిలో లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన ట్యాంక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అది పూర్తి అయితే ఆక్సిజన సమస్యను అధిగమించవచ్చు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధానమైన సర్వజన వైద్యశాల రిమ్స్‌. దీనిని 750 పడకలతో ఏర్పాటు చేశారు. అన్ని విభాగాలకు ఇక్కడ వైద్య సేవలు అందేలా నిర్మించారు. వెంటిలేటర్స్‌, ఆక్సిజన బెడ్లు 350, నాన అక్సిజన బెడ్లు 400 ఉన్నాయి. గత ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో రిమ్స్‌ను జిల్లా కొవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చారు. ఫారెన్సిక్‌ విభాగం పక్కనే 300 బెడ్లలో కొవిడ్‌-19 కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అక్కడే కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే.. కరోనా వైరస్‌ సెంకడ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ నెలలో మాత్రమే 8,118 కేసులు నమోదు కాగా.. సుమారుగా 38 మంది మృత్యువాత పడ్డారంటే వైరస్‌ తీవ్ర ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్‌ కేసులు 5,680 ఉన్నాయి. వారిలో 3,608 మంది హోం ఐసోలేషనలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఎక్కువ మందికి ఆక్సిజన అవసరం వస్తుండడం వల్ల రిమ్స్‌లో 750 బెడ్లను ఆక్సిజన బెడ్లుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు.


ఆక్సిజన సమస్య తలెత్తకుండా..!

కడప సర్వజన వైద్యశాల (రిమ్స్‌)లోని మొత్తం 750 బెడ్లు కొవిడ్‌-19 రోగులకు వినియోగించేలా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్స్‌, ఆక్సిజన బెడ్లు 350 ఉన్నాయి. ఆమేరకు ఆక్సిజన సరఫరా చేసేందుకు వీలుగా 13 కిలో లీటర్లు (కేఎల్‌) ఏర్పాటు చేశారు. రోజుకు 7-8 కిలో లీటర్ల అవసరం ఉంది. మిగిలిన 400 వాటిని కూడా ఆక్సిజన బెడ్స్‌గా మారుస్తున్నారు. పనులు పూర్దయొతే రోజువారి వినియోగం 18-20 కేఎల్‌ ఆక్సిజన అవసరం ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 13 కేఎల్‌ సామర్థ్యం కలిగిన ఆక్సిజన ట్యాంకు మాత్రమే ఉంది. దీంతో ప్రాణవాయువు సమస్యలు తలెత్తకుండా మరో 30 కేఎల్‌ సామర్థ్యంతో ఆక్సిజన ట్యాంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌ ఏర్పాటుకు పునాదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి 750 బెడ్లకు ఆక్సిజనను అందించేలా పైపులైన కూడా ఏర్పాటు చేస్తారని వైద్యులు తెలిపారు. అలాగే.. జిల్లాలో రోజు వారి ఆక్సిజన వినియోగం 18 కేఎల్‌ ఉంది. జిల్లాలో అన్నిచోట్లా కలిపి 27 కేఎల్‌ నిల్వ చేసుకునే ట్యాంకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్యులు అంటున్నారు. పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణలో భాగంగా పాత భవనాలు కూల్చివేసి కొత్త భవనాలు కడుతున్నారు. దీంతో అక్కడ పది బెడ్లు మాత్రమే ఉన్నాయి. జేఎనటీయూలో 200 తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేశారు. కనీసం సగం బెడ్లకైనా ఆక్సిజన సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


డెంటల్‌ ఆస్పత్రిలో జనరల్‌ వైద్యం

రిమ్స్‌ డెంటల్‌ కళాశాల ఆస్పత్రిలో 350 బెడ్లు ఉన్నాయి. రిమ్స్‌ను పూర్తిగా కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడంతో అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లు, కాన్పులు వంటి జనరల్‌ వైద్యసేవలు డెంటల్‌ ఆస్రతికి మార్చారు. కొవిడ్‌-19 రోగులు ఇక్కడికి రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.


సీసీ కెమరాల ఏర్పాటుకు సన్నాహాలు

కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు కొందరు వార్డులోకి వెళ్లడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. డాక్టర్లు ఎక్కడో కూర్చొని నర్సుల ద్వారానే వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం కలెక్టరు దృష్టికి వెళ్లింది. దీంతో కొవిడ్‌ వార్డుల్లో విధుల్లో ఉన్న డాక్టర్లు వార్డుల్లోకి వెళ్తున్నారా..? నర్సుల ద్వారానే బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారా? అనేది పర్యవేక్షించేందుకు సీసీ కెమరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఆక్సిజన సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు

- సి.హరికిరణ్‌, కలెక్టరు

జిల్లాలో ఏ ఒక్కరికి ఆక్సిజన సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జిల్లాలో ఆక్సిజన సమస్య లేదు. కరోనా బాధితులు పెరుగుతున్న దృష్ట్యా రిమ్స్‌లో 750 బెడ్లు కొవిడ్‌ వైద్య సేవలకు వినియోగిస్తున్నాం. అన్ని బెడ్లకు ఆక్సిజన సరఫరా కోసం కొత్తగా 30 కిలో లీటర్ల సామర్థ్యంతో మరో ఆక్సిజన ట్యాంక్‌, పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నాం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.