కక్షల దారిలో... కేసుల రోడ్డు!

ABN , First Publish Date - 2022-05-11T08:19:31+05:30 IST

అమరావతిలో బినామీలన్నారు. అక్రమాలు జరిగాయన్నారు. కేసులు పెట్టారు. ‘ఏదిఏమైనా’ చంద్రబాబుసహా నాటి ప్రభుత్వంలో కీలక పదవుల్లోఉన్నవారిని ఇరికించాలని ప్రయత్నించారు. చివరికి... సుప్రీంకోర్టు దాకా వెళ్లి భంగపడ్డారు. అయినా... ‘కేసుల

కక్షల దారిలో... కేసుల రోడ్డు!

అమరావతి అభివృద్ధిపై ధ్యాస శూన్యం

ఆది నుంచీ కేసులు పెట్టడంపైనే కన్ను

‘మ్యాప్‌’లో గీతల దశ దాటని రింగ్‌ రోడ్డు

వేయని దారిలో దారుణాలు జరిగాయట

ప్రతిపాదనల దశలోనే పలు జాగ్రత్తలు

ఆరు నెలలకు పైగా సంప్రదింపులు

వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌ ‘ఔటర్‌’లో అనేక దారుణాలు

అయినా.. ఒక్కరిపైనా చర్యలు లేవు


‘ఆలూ లేదు చూలూ లేదు... కొడుకు పేరు అదేదో’ అనే సామెతను జగన్‌ సర్కారు నిజం చేస్తోంది. ‘విపక్ష నేత చంద్రబాబుపై ఏదో ఒక కేసు పెట్టాలి! ఏ1గా చేర్చాలి’ అనే లక్ష్యంతో అడుగులు వేస్తూ... ఎట్టకేలకు ఆ పని చేసేసింది. అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించారు. ఇక... మాస్టర్‌ ప్లాన్‌లో రాజధాని అమరావతి చుట్టూ ప్రతిపాదించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు టీడీపీ హయాంలోనూ ‘మ్యాప్‌’ల దశ దాటలేదు. కానీ... ఐఆర్‌ఆర్‌లో భారీగా అక్రమాలు జరిగాయట! అధికార దుర్వినియోగం చోటు చేసుకుందట! కొన్ని కంపెనీలకు అపార ధనలాభం కలుగగా... పేదలకు తీవ్ర నష్టం జరిగిందట! ఆ మేరకు.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. 2 వారాల్లో విచారణ చేసిన సీఐడీ అధికారులు.. ‘అక్రమాలు నిజమే’ అని తేల్చేశారు. చంద్రబాబును మొదటి ముద్దాయి (ఏ1)గా, అప్పటి మంత్రి పి.నారాయణను ఏ2గా చేర్చి కేసు పెట్టారు. ‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అటకెక్కించారు’ అని గతంలో వచ్చిన వార్తలపై ఇదే ప్రభుత్వ పెద్దలు.. ‘అసలు ఆ రోడ్డు ఎక్కడుంది? కాగితాల్లో గీతలను దాటిరాని ప్రాజెక్టును మేం అటకెక్కించడం ఏమిటి?’ అని కస్సుమన్నారు. ఇప్పుడు.. అదే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై కేసు పెట్టారు.


(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

అమరావతిలో బినామీలన్నారు. అక్రమాలు జరిగాయన్నారు. కేసులు పెట్టారు. ‘ఏదిఏమైనా’ చంద్రబాబుసహా నాటి ప్రభుత్వంలో కీలక పదవుల్లోఉన్నవారిని ఇరికించాలని ప్రయత్నించారు. చివరికి... సుప్రీంకోర్టు దాకా వెళ్లి భంగపడ్డారు. అయినా... ‘కేసుల ఆరాటం’ తగ్గలేదు. ఈసారి ఏకంగా... వెయ్యని ఇన్నర్‌ రింగ్గు రోడ్డును అడ్డం పెట్టుకుని చంద్రబాబును ‘ఏ1’గా చేర్చుతూ కేసు పెట్టేశారు. నాటి కేసులకూ, నేటి కేసుకూ మూలం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదులే కావడం విశేషం. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచే ఆయన పలు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలేవీ నిలబడలేదు. ఇప్పుడు... మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు జరిగాయని ఆళ్ల మరో ఫిర్యాదు చేశారు. నిజానికి... అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణానికి సింగపూర్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని నగర ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కోసం సీఆర్‌డీఏ ఇంచుమించు ఆరు నెలలకు పైగా సంప్రదింపులు జరిపింది.


జాతీయ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ)తో పాటు వివిధ గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. మొత్తం 97.5 కిలోమీటర్ల పొడవున ఐఆర్‌ఆర్‌ నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఐఆర్‌ఆర్‌ వల్ల విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అలానే గన్నవరం విమానాశ్రయానికి సులువుగా  చేరుకోవచ్చు. మొత్తం రింగురోడ్డులో 67.5 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్‌ కాగా.. ఎన్‌హెచ్‌-65ని 15 కిలోమీటర్లు, ఎన్‌హెచ్‌-16ని మరో 15 కిలోమీటర్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. టీబీడీ అనే సంస్థ మొత్తం అధ్యయనం జరిపి డీపీఆర్‌ను రూపొందించి సీఆర్‌డీఏకి నివేదించింది. భూసేకరణ, రోడ్డు అభివృద్ధి కలిపి రూ.6,878 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. నిజానికి ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా చేశారు. దాదాపు 1100 మందిని సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి రూపొందించారు.


వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల మాత్రం.. కొన్ని సంస్థల స్వప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపణలు చేశారు. అలైన్‌మెంట్‌ మార్పుతో రామకృష్ణ హౌసింగ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్టు, లింగమనేని అగ్రికల్చర్‌ ఫామ్స్‌, జయని ఎస్టేట్స్‌కు లబ్ధి కలిగించారని ఆరోపించారు. రాజధాని ప్రకటనకు ముందే రాజధాని వెలుపల లింగమనేని, జయని ఇన్‌ఫ్రా, గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కంతేరు వద్ద హెరిటేజ్‌ భూములు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూములకు నష్టం కలగకుండా ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చారన్నది ఆయన అభియోగం. వాస్తవానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎన్‌హెచ్‌-16పై చినకాకాని నుంచి గుండుగొలను వరకు విజయవాడ బైపాస్‌ రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐ మంజూరు చేసింది. దీనికి అమరావతి రాజధాని రాకముందే మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని రైతులు భూములు కూడా ఇచ్చారు. ఈ బైపా్‌సతో అనుసంధానం చేస్తూ ఐఆర్‌ఆర్‌ను రూపొందించారు. అయినా ఆళ్ల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగర భూసేకరణ, భూసమీకరణ సందర్భంలోనూ నాటి మంత్రి నారాయణ పాల్గొన్న సభల వద్దకు ఆళ్ల వెళ్లి అడ్డుపడ్డారు. అప్పట్లో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని అధికారులు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. మంత్రి ఆదేశాల మేరకే తనపై కేసులు పెట్టారని అప్పటి నుంచి ఆయన కక్ష పెంచుకున్నారని రైతులు అంటున్నారు. నారాయణపై ప్రతీకారం తీర్చుకునేందుకే  అసంబద్ధ ఆరోపణలతో సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరి ఔటర్‌ మాటేమిటో... 

ఉమ్మడి ఆంధ్ర సీఎంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో చేసిన మార్పులు.. దానిపై జరిగిన రచ్చ గుర్తున్నాయా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు వేసిన ఈ ఓఆర్‌ఆర్‌ ప్రణాళికను ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు. భూసేకరణ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఆ తర్వాతికాలంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తయింది కూడా. కానీ... ఔటర్‌కు అన్ని వైపులా అలైన్‌మెంట్‌ను పదేపదే, యథేచ్ఛగా మార్చారు. తమకు కావలసిన వారి భూముల పక్కకు రింగ్‌రోడ్డును తీసుకెళ్లేందుకు.. తమకు అయినవారి భూములు రింగ్‌రోడ్డులో పోకుండా ఉండేందుకు అలైన్‌మెంట్‌ మార్చారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. నాడు అలైన్‌మెంట్‌ మార్పుపై ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. కానీ... ఇప్పుడు ఏమీలేని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌పై అక్రమాలు జరిగాయని చంద్రబాబు, నారాయణలపై ప్రభుత్వం సీఐడీ కేసు పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇక్కడ రింగ్‌రోడ్డు విషయంలో వచ్చిన ఆరోపణలు లేవు. ప్రజల నుంచి వ్యతిరేకత అసలే లేదు. గతంలో అలైన్‌మెంట్‌ నిర్ణయించినప్పుడు గానీ.. ఆ తర్వాత గానీ వచ్చిన అభ్యంతరాలు కూడా పెద్దగా లేవు. అయినా కేసులు పెట్టడం గమనార్హం.


ఫిర్యాదులన్నీ ఆ రోజే..!

చంద్రబాబు, పి.నారాయణలపై ఫిర్యాదులన్నీ ఒకే రోజు చేయడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అదే రోజు ఉదయం పదో తరగతి పరీక్ష తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. మీడియా, ప్రతిపక్షాలు పేపర్‌ లీకేజీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జగన్‌ ప్రభుత్వం అదే రోజు ఆళ్లతో ఫిర్యాదు చేయించినట్లు తెలుస్తోంది.   పేపర్‌ లీకేజీపై చిత్తూరు జిల్లా డీఈవో సైతం అదే రోజు చిత్తూరు వన్‌ టౌన్‌లో మధ్యాహ్నం 1.50కి ఫిర్యాదు చేశారు.

Read more