మోగుతున్న సింహళ సాంగ్‌!

Sep 20 2021 @ 02:00AM


సంగీతానికి అవధులుఉండవనే వాస్తవాన్ని రుజువు చేస్తూతాజాగా ఓ శ్రీలంక పాట ఇన్‌స్టాగ్రామ్‌లోమారుమోగిపోతోంది. ‘మనికె మగే హితే’ అంటూ సాగేఈ సింహళ గీతం భావంతో సంబంధం లేకుండా,దేశ సరిహద్దులు దాటి కోట్లాది సంగీతాభిమానుల మనసులను దోచుకుంది.అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌లాంటి ప్రముఖులు సైతం షేర్‌ చేసేంతగా వారిని ప్రభావితం చేసిన ఈ పాట, పాటతో సాగిన తన ప్రయాణం గురించీ 28 ఏళ్ల సింగర్‌, ర్యాపర్‌... యొహానీ ఏం చెబుతోందంటే...


మనికె మగే హితే సింహళ గీతం తక్కువ సమయంలో విపరీతంగా వైరల్‌ అయుపోయి యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూలను దక్కించుకుని, శ్రీలంక, ఇండియా, మాల్‌దీవ్స్‌ టాప్‌ 100 ఐట్యూన్స్‌లో నంబర్‌ ఒన్‌గా, స్పాటిఫై ఇండియా, స్పాటిఫై గ్లోబల్‌లో టాప్‌ వైరల్‌ 50గా కొనసాగుతోంది. ఇంతటి స్పందనను తాను ఊహించలేదనీ, ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని యొహానీ అంటోంది. ‘‘నిజానికి ఇంతటి స్పందన నాకు పెద్ద సమస్యే. నేను వ్యూస్‌ లక్ష్యంగా పని చేసే వ్యక్తిని కాను. నా అభిరుచికి తగిన నాకు నచ్చిన పాటలనే నేను నిర్మిస్తూ ఉంటాను. అయితే అదృష్టవశాత్తూ మనికే మగే హితే ఊహించనంతగా విజయం సాధించింది. అమితాబ్‌ బచ్చన్‌, టైగర్‌ ష్రాఫ్‌, మాధురీ దీక్షిత్‌, ప్రియాంకా చోప్రా మొదలైన ప్రముఖులు నా పాటను మెచ్చి, రీపోస్ట్‌ చేసేంతగా వాళ్లను అలరించడం గర్వించదగిన విషయం. ఇకముందు నేను పాడబోయే పాటలకు కూడా ఇంతే సమానమైన ఆదరణ దక్కుతుందనే అనుకుంటున్నా’’ అంటూ చెప్పుకొచ్చిన యొహానీకి గాయనిగా ఇంతటి గుర్తింపు రావడానికి ఐదేళ్లు పట్టింది.


లైవ్‌ షో ఇస్తా..

‘‘2016 నుంచి ఎన్నో విషయాలు జరిగాయి. నేను గాయనిగా స్థిరపడాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నానో నాకు నిజంగా గుర్తులేదు. అసలు సంగీతాన్నే వృత్తిగా ఎంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రారంభంలో నా యూట్యూబ్‌ ఛానల్‌ కోసం కవర్‌ సాంగ్స్‌ పాడేదాన్ని. తర్వాత ఒరిజినల్స్‌ పాడడం మొదలుపెట్టా. ఇప్పుడు రెండూ చేస్తున్నా. అయితే కెరీర్‌లో ఇంత వేగంగా దూసుకువెళ్తానని మాత్రం అనుకోలేదు. ఈ మధ్యే నా తాజా ఆల్బమ్‌ను పూర్తి చేశాను. దాన్ని విడుదల చేయవలసి ఉంది. మున్ముందు వేలు, లక్షల మంది ప్రజల ముందు లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వాలని ఉంది. నాతో పాటు సంగీత పరిశ్రమకు చెందిన కళాకారులకు కొవిడ్‌ ఇబ్బందికరంగా మారడం దురదృష్టకరం. కొవిడ్‌ పూర్తిగా కనుమరుగయ్యే వరకు లైవ్‌ షోల కోసం నేను వేచి ఉండక తప్పదు.’’ 


అంతా సోషల్‌ మీడియా చలవే!

సామాజిక మాధ్యమాల శక్తి ఏపాటిదో యొహానీ పాట వైరల్‌గా మారిన వైనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం గురించి మాట్లాడుతూ... ‘‘ప్రజలతో అనుసంధానమై సంగీతాన్ని వాళ్లతో పంచుకోవడానికి అనువైన వేదిక సోషల్‌ మీడియా. అదొక్కటే కాదు. ఏం షేర్‌ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే వేదిక అదొక్కటే. సోషల్‌ మీడియా లేకపోయి ఉంటే, దేశాలను దాటి నా పాట మోగి ఉండేది కాదేమో!’’ అంటూ చెప్పుకొచ్చింది యొహానీ.


పాట ప్రత్యేకత ఏంటంటే...

తాజాగా వైరల్‌గా మారిన ‘మనికె మగే హితే’ పాట ఒరిజినల్‌ వెర్షన్‌ గతేడాది జూలైలో విడుదలైంది. చమత్‌ సంగీత్‌ సంగీత దర్శకత్వంలో గాయకుడు సతీషన్‌, ర్యాపర్‌ దులాన్‌తో కలిసి పాడాడు. ర్యాపర్‌ దులాన్‌ ఈ గీతాన్ని రచించి, పాటకు ఆకర్షణను జోడించడం కోసం దాన్ని ర్యాప్‌గా మలిచాడు. శ్రీలంకలోని ఓ కుగ్రామానికి చెందిన ఓ అందమైన అమ్మాయిని ఉద్దేశించి ఓ యువకుడు పాడే పాట ఇది. ఆ అమ్మాయితో ప్రేమలో పడిన ఆ పాట పాడే కుర్రాడు... తనను నిర్లక్ష్యం చేయవద్దనీ, అలా చేసి తనకున్న ఫీలింగ్స్‌ను వదులుకునేలా చేయవద్దనీ ఆ అమ్మాయిని అభ్యర్ధిస్తూ ఉంటాడు. ఈ ఒరిజినల్‌ పాట విడుదలైన ఏడాది తర్వాత గాయకుడు సంగీత్‌, శ్రీలంక సింగర్‌, ర్యాపర్‌ యొహానీలు కలిసి, 2021 మేలో డ్యుయట్‌ కవర్‌ సాంగ్‌ రూపొందించారు. ఇప్పుడీ పాటకు బోలెడన్ని విభిన్నమైన వెర్షన్లు రూపొందుతున్నాయి. తమిళం, మళయాళ భాషల్లో సైతం ఈ పాటను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు గాయకులు సింహళ పాట అర్థాన్ని యధాతధంగా అనువాదం చేస్తుంటే, మరికొందరు తమదైన ముద్రను, ప్రాంతీయతలను జోడిస్తూ వినూత్నమైన శైలిలో పాటలను రూపొందిస్తూ ఉండడం విశేషం.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.