పండ్లతో పండిన హాస్యం!

ABN , First Publish Date - 2022-06-29T09:28:41+05:30 IST

వినయ్‌ పండ్ల వ్యాపారి. రాత్రయ్యాక ఇంటికి వెళ్లిపోగానే.. బాస్కెట్‌లోంచి ఒక మామిడి పండు దుమికి బయటకు వచ్చింది

పండ్లతో పండిన హాస్యం!

వినయ్‌ పండ్ల వ్యాపారి. రాత్రయ్యాక ఇంటికి వెళ్లిపోగానే.. బాస్కెట్‌లోంచి ఒక మామిడి పండు దుమికి బయటకు వచ్చింది. డ్యాన్స్‌ వేస్తోంది. ‘కమాన్‌ మై ఫ్రైండ్‌.. డ్యాన్స్‌ చేయ్‌’ అంటూ పుచ్చకాయను అడిగింది. పుచ్చకాయ దొర్లుతూ డ్యాన్స్‌ వేస్తోంది. భారీకాయం వల్ల డ్యాన్స్‌ వేయలేకపోతోంది.  మామిడిపండు నవ్వింది. ‘నీలా డ్యాన్స్‌ వేయలేను’ అంటూ బాధపడింది. ‘౅మిత్రమా. బయట ఆకుపచ్చగా ఉంటావు. లోపల ఎర్రగా  తియ్యగా ఉంటావు. నువ్వు నీకే సాటి. నువ్వు’ అంటూ పుచ్చకాయను సముదాయించింది మామిడిపండు. మామిడి మాటలను ఊకొడుతూ పుచ్చకాయ సంబరపడింది.


మామిడిపండు, పుచ్చకాయ మధ్యలోకి అరటి పండు వచ్చి ‘పుచ్చకాయ గారూ.. డ్రమ్‌లా సౌండ్‌ చేయండి.  దరువుకి డ్యాన్స్‌ వేస్తా’నంది. అరటి పండు ఎగిరెగిరి డ్యాన్స్‌ చేస్తుంటే పండ్లన్నీ చూస్తున్నాయి. బిగ్గరగా నవ్వుతున్నాయి. ‘వావ్‌. నిన్ను తిన్న వెంటనే జనాలు కూడా అంతే ఉత్సాహంగా డ్యాన్స్‌ వేస్తారు’ అన్నది పుచ్చకాయ. మెల్లగా మధ్యలోకి లిచి పండు వచ్చింది. ‘నేను డ్యాన్స్‌ వేయనా?’ అంటూ అడిగింది.. ‘అసలు ఎవరు నువ్వు. ఎప్పుడూ చూడలేదు. నీ ముఖం రఫ్‌గా ఉంది. కోపమొస్తే నిన్ను క్రష్‌ చేస్తా’ అన్నది ఓ పుచ్చకాయ. మిగతా పండ్లన్నీ ఊకొట్టాయి. వెంటనే మామిడికాయ సీన్‌లోకి ఎంటరైంది. ‘అందరూ కాసేపు గమ్మున ఉండండి. లిచీ కొత్త. మన షాప్‌లోకి ఈరోజే వచ్చింది. చూడటానికి రఫ్‌గా ఉండొచ్చు కానీ లోపల మాత్రం తను సెన్సిటివ్‌. స్వీట్‌ ఫ్రూట్‌’ అంటూ మెచ్చుకుంది. హమ్మయ్య అనుకుంది లిచీ.. మనసులో! ‘చూడండి మిత్రులారా..’ అంటూ మామిడి పండు తన స్పీచ్‌ను కంటిన్యూ చేసింది. ‘మనం వివిధ ప్రాంతాలనుంచి, వివిధ వాతావరణ పరిస్థితులనుంచి వేల మైళ్లు దాటి ఇక్కడికి వచ్చాం. మన రంగు, రూపు, రుచి.. ఎవరికి వారే. మనల్ని తింటే జనాలు కొత్త శక్తితో ముందుకెళ్తారు. ఈ షాప్‌లో అందరం ఒక చోట కలిశాం. ఉన్నంతసేపు హాయిగా నవ్వుతూ ఉండాలి. అనవసరంగా మనం కొట్లాడి టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటే పద్ధతి కాదు కదా?’ అంటూ మామిడి గట్టిగా మాట్లాడింది. వెంటనే.. అన్ని పండ్లు ‘నిజమే’ అంటూ అంగీకరించాయి. ‘లిచీ డ్యాన్స్‌ వేయాలి’ అన్నది పుచ్చకాయ. లిచీ పండు నవ్వుతూ డ్యాన్స్‌ వేసింది. చూస్తుండగానే ఉదయం అయింది. వినయ్‌ ఉదయాన్నే షాప్‌కి వచ్చి పండ్ల దుకాణం షట్టర్‌ తెరిచాడు. పండ్లన్నీ ఎవరి బాస్కెట్స్‌లోకి అవి ఎగిరి దుమికి తెలీనట్లు ఉన్నాయి. ‘ఏదో సౌండ్‌ వినిపించినట్లుంది.. ఎవరూ లేరే అనుకున్నాడు వినయ్‌. ‘క్రేజీగా ఉందీ సౌండ్‌’ అనుకున్నాడు. ‘పగటి కలనేమో’ అంటూ తనలో తాను గొణుక్కున్నాడు. వినయ్‌ను చూసి పండ్లన్నీ ఫక్కున నవ్వాయి.

Updated Date - 2022-06-29T09:28:41+05:30 IST