మెరిసిన పంత్‌

ABN , First Publish Date - 2022-06-25T10:18:38+05:30 IST

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు.

మెరిసిన పంత్‌

లీసెస్టర్‌ కౌంటీ తొలి ఇన్నింగ్స్‌ 244

భారత్‌కు స్వల్ప ఆధిక్యం 

రెండో ఇన్నింగ్స్‌ 80/1

లీసెస్టర్‌షైర్‌: ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. లీసెస్టర్‌ టీమ్‌ తరఫున ఆడుతున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (76) ఫామ్‌లోకొచ్చాడు. ఇదే జట్టు తరఫున బరిలోకి దిగిన పుజార మాత్రం డకౌటయ్యాడు. వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ లభించాలనే ఉద్దేశంతో టీమిండియా ఆటగాళ్లు ఇరు జట్ల తరఫున బరిలోకి దిగడం విశేషం. ఇక భారత బౌలర్లు కట్టడి చేయడంతో రెండో రోజు శుక్రవారం లీసెస్టర్‌షైర్‌ కౌంటీ క్లబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో   244 పరుగులకు ఆలౌటైంది. రిషి పటేల్‌ (34), రోమన్‌ వాకర్‌ (34) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్‌ జడేజా, షమిలకు మూడేసి.. సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


ఆ తర్వాత   రెండు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్‌ గిల్‌ (38) అవుట్‌ కాగా మరో ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ (31 బ్యాటింగ్‌), విహారి (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తమ ఓవర్‌నైట్‌ స్కోరు 246/8 వద్దే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత లీసెస్టర్‌ 44/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన దశలో పంత్‌ ఆదుకున్నాడు. 14 ఫోర్లు, 1 సిక్స్‌తో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 


సంక్షిప్త స్కోర్లు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

246/8 డిక్లేర్‌ (భరత్‌ 70, వాకర్‌ 5/24), లీసెస్టర్‌ తొలి ఇన్నింగ్స్‌: 244 ఆలౌట్‌ (పంత్‌ 76, జడేజా 3/28, షమి 3/42), భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 18 ఓవర్లలో 80/1 (గిల్‌ 38, భరత్‌ 31 బ్యాటింగ్‌).

Updated Date - 2022-06-25T10:18:38+05:30 IST