Advertisement

తెలంగాణ (అ)ధర్మాగ్రహం!

Oct 16 2020 @ 00:15AM

కృష్ణా జలాల వాటాలలో తేడాలుండవని స్పష్టమయ్యాకే ఆంధ్రప్రదేశ్‌తో గోదావరి కృష్ణా జలాల బార్టర్ (బదలాయింపు) ప్రతిపాదనను తెలంగాణ చేసింది. ఆంధ్రలో వరి సాగు అవసరం లేదు, అక్కడి రైతులకి నవీన సాగు పద్ధతులు తెలియవు, వారు నీటిని వృధా చేస్తున్నారు, వాళ్ళ వాటాలు తగ్గించి తమకు ఇవ్వాలని ట్రైబ్యునల్‌లో అనైతిక వాదన చేస్తుంటే ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఎలా సాధ్యమవుతుంది?


ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల జగడం స్థాయి మళ్ళీ పెరిగింది.ఉన్న విషయాలు కొత్తవేమీ కావు.నదీ జలాల పంపిణీ విధానంలో తెలంగాణ, విభజన తేదీ మరుసటి రోజునుంచే ఆధిపత్యం ప్రదిర్శిస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి వైఖరిని ఓర్చుకోవడానికి ఒక విధంగా అలవాటు పడ్డారు. కానీ ఆ ఓర్పు ఎన్నాళ్ళు? రాయలసీమ పంపింగ్ స్కీం ద్వారా ఎదురు దెబ్బ తీసినట్టయింది.ఈ స్కీం రచనలో స్వర్గీయ వై ఎస్ రాజశేఖర రెడ్డి ముద్ర కనబడింది.  తగాదా అపెక్స్ కౌన్సిల్ చేరింది.ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి, కృష్ణా నదిని తరలించుకు పోతామని బెదిరింపు లాంటి హెచ్చరిక చేసారు! రాయలసీమ పంపింగ్ స్కీం మీదున్న ఆక్రోశాన్ని అక్కడ వెళ్ళగక్కారు. కృష్ణా నది తమ స్వంత ఆస్తి అనీ, ఆంధ్రప్రదేశ్ ఒక కిరాయిదారు అన్నట్లుగా తెలంగాణ ఎప్పుడూ మాట్లాడుతుంది. కృష్ణా డెల్టా, కే.సీ.కెనాల్ వ్యవస్థలు దశాబ్దాల చరిత్రగలవని గుర్తించదు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తమ నివేదికలో -ఏ రాష్ట్రానికీ నీటిపై యాజమాన్య హక్కులు ఆ రాష్ట్ర భూ భాగంలో ప్రవహించే నిడివికి గానీ లేక నదికి సమకూర్చే నీటి పరిమాణం ద్వారా గానీ సంక్రమించవు అని చెప్పింది. ఇదే ట్రైబ్యునల్ 2016లో ఇచ్చిన తీర్పులో ఏమందంటే - నీటి వినియోగ హక్కులు అందరికీ సమానమే. తమ భూభాగంలో ప్రవహిస్తోంది కనుక ఏ రాష్ట్రం వారికీ ప్రత్యేక హక్కులు ప్రాప్తించవు.


నదీ జలాలు అందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలి. ఇటువంటి భాషణం తెలంగాణకి నచ్చదు,వినపడదు. కృష్ణా నది నీరంతా తమదే కావాలని మొండిపట్టు.అందుకే ఈ స్థాయి తగాదాలు. ఆంధ్రప్రదేశ్‌కి లభించిన నీటి వాటాలన్నీ న్యాయప్రక్రియ ద్వారా లభించినవే.ఎవ్వరూ ధారాదత్తం చేయలేదు. తమకు విభజన చట్టం షెడ్యూల్ 11లో చేర్చిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అవసరమనీ వీలయితే కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత కూడా పరిశీలించమని ప్రస్తుత ట్రైబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వాటాలకి కోత పెట్టి తమకు నీళ్ళు ఇవ్వాలని తెలంగాణ నిస్సిగ్గుగా డిమాండ్ చేస్తోంది. కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణ తాము ఒక సమాఖ్య వ్యవస్థలో భాగమనీ అదే స్థాయిలో ఇతరులు ఉన్నారనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. అభ్యంతరకరమైన స్వార్ధపరత్వం ప్రదర్శిస్తోంది. తాము కొత్తగా పుట్టుకొచ్చామని మిగతా తీర సంబంధీకులు తమ వాటాలు తగ్గించుకోవాలని అది తమ ప్రత్యేక హక్కన్నట్లు ప్రవర్తిస్తుంది. ఇంకా కొన్ని ప్రత్యేకతలు: శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం నుంచి వారు నీరు తోడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అలా చేయటానికి వీల్లేదు; నాగార్జునసాగర్ రిజర్వాయర్ అన్ని కవాటాలు వారి ఆధీనంలో ఉండాలి, శ్రీశైలం రిజర్వాయర్ కుడిగట్టు మాత్రమే ఆంధ్ర ఆధీనం; ఎడమగట్టు విద్యుత్కేంద్రం నుంచి కిందకి నీరు తోడెయ్యటానికి ఎవ్వరూ అభ్యంతర పెట్టకూడదు; కృష్ణా నదీ బోర్డ్ ఆంధ్రప్రదేశ్‌ని పోతిరెడ్డిపాడు నుంచి నీటిని బయటకి పంపకుండా ఆంధ్రప్రదేశ్‌ని నియంత్రించాలి, తాము మాత్రం బోర్డ్ పరిధిలోకి రారు; సంగమేశ్వరం దగ్గర రెండు రాష్ట్రాలు చెరోవైపు ఉన్నా రాయలసీమకి గోదావరి జలాలు తీసుకెళ్ళాలి, తెలంగాణ వారు మాత్రం కృష్ణా జలాలను వాడుకుంటారు; గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కి ఆంధ్రా తరలిస్తే తెలంగాణకు వాటా ఇవ్వాలి, అదే తెలంగాణా చేస్తే ఆంధ్ర వాటా అడగకూడదు! తాము బేసిన్ పరిధిలోనే నీటిని వాడు తున్నాము కనుక తమకు హక్కులు ఎక్కువున్నాయని తెలంగాణ వారు అంటారు. ఈ సిద్ధాంతం తప్పనీ బేసిన్ బయటకి మళ్ళింపు చట్టబద్ధమని ట్రైబ్యునళ్ళు పదే పదే చెప్పినా వారీ హంసధ్వనిరాగం మటుకు ఆపరు.


తెలంగాణకి ఇంకొక బూచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. ఆ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల బోర్డ్ అనుమతితోనే జరుగుతోందనీ, వరద జలాల మళ్ళింపునకు మాత్రం ఎక్కువ సామర్ధ్యం అవసరమయిందనీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని సార్లు  చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, పోనీ ప్రత్యేకంగా గత ఆరేళ్ళలో గానీ పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్ర బయటకు తీసిన నీటి పరిమాణాలు వారికి ఇబ్బంది కల్గించిన దాఖలాలు లేవు. తెలంగాణ విచ్చలవిడిగా శ్రీశైలం ఎడమ విద్యుత్కేంద్రం నుంచి కిందకి నీటిని తోడే ప్రక్రియకి ఆంధ్ర అడ్డం పడిందా? ఎస్.ఎల్.బి.సి పంపింగ్ కేంద్రం ద్వారా హైదరాబాద్ మంచినీటి సరఫరా పేరిట జరుగుతోన్న నిరంతర నీటి పంపింగ్‌కి ఆంధ్ర అంతరాయం కల్గించిందా? నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా మొత్తం నీరు వారే వాడుకొని కృష్ణాజిల్లా ఆయకట్టుకి అప్పుడప్పుడు చుక్క నీరు విదల్చడం అనే అలవాటులో మార్పుందా? ఏమీ మారలేదే! మరెందుకు అంత గగ్గోలు? తెలంగాణ వారి ఆధిపత్య ధోరణికి అవరోధం అనే భావన తప్ప వేరే కారణం లేదు.


ఇక సెక్షన్ 3 గురించి చర్చించుదాం. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89లో, ఇంతకు ముందు ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు లేనట్లయితే,ట్రైబ్యునల్ 1 కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకి ప్రాజెక్టుల వారీగా నిర్ణయించి ఒక ఆపరేషన్ ప్రోటోకోల్‌ని నిర్ధారించాలని స్పష్టంగా ఉంది. విభజనకాక ముందున్న నీటి వాటాలలో ఏ మార్పు ఉండదు (విభజన కాక ముందు అమలులో ఉన్న విధానం- బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన వాటాల ప్రకారం పంపిణీ) ఆ వాటాలు 1976 మే 31 నుంచి కేంద్రప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి వచ్చాయి. 2014లో తెలంగాణ సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన ఎస్.ఎల్.పి పరిశీలిస్తే ఈ అంశం తెలంగాణకి కూడా తెలుసని విశదమవుతుంది. 1956 జలవనరుల చట్టం ప్రకారం దీనిపై అప్పీళ్ళకు అవకాశం లేదని కూడా తెలుసు. పోతే 2000 సంవత్సరం తర్వాత పునఃసమీక్ష అవసరమని బచావత్ ట్రైబ్యునల్ చెప్పడంతో ట్రైబ్యునల్2 ఏర్పడింది. 2013 సంవత్సరంలో ఈ ట్రైబ్యునల్ తుది తీర్పు సమర్పించింది. అన్ని సంబంధిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఈ తీర్పుపై పిటిషన్లు దాఖలు చేయటంతో తీర్పు అమలులోకి రాలేదు. 2014లో విభజన జరిగింది. ప్రస్తుతమున్న చట్టాలననుసరించి బచావత్ కేటాయించిన నీటి వాటాల మార్పుకి అవకాశం లేదు. అంతే కాకుండా 2002లో నీటి వివాదాల పరిష్కార చట్టానికి ఒక సవరణ చేసారు.అది 2002 సంవత్సరానికి ముందు పరిష్కారమైన జలవివాదాలను మరల తిరగ తోడటానికి వీలు లేదని. ఈ సవరణ కారణంగా విభజన చట్టంలో పొందుపరిచిన నిబంధనల కారణంగా తెలంగాణకి ఇప్పుడు అమలులో ఉన్న నీటి వాటాలకంటే ఎక్కువ లభించవు. అదే గాక ట్రైబ్యునల్2 2013లో ఇచ్చిన తీర్పు తర్వాత అసలు నది లోనే బాగా తగ్గిపోయిన మిగులు జలాలు తప్ప కొత్తగా నికర జలాల కేటాయింపులే కుదరవు. ఇవన్నీ తెలంగాణకి అంతర్గతంగా తెలుసు.కానీ బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి.


విభజన చట్టపరంగా వీలు కాదని తెలిసి మొత్తం తిరగతోడటానికని తెలంగాణ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వాన్ని సెక్షన్3 ప్రకారం మరల పునఃసమీక్ష కోసం ఇంకొక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయమని కోరింది.ఈ అభ్యర్ధన పై కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాది కిమ్మనకుండా, 2015 జూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీ అభిప్రాయమేమిటని అడిగింది. దీనికి జవాబుగా బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన వాటాలలో మార్పు జరగకూడదనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ వెలిపుచ్చింది.ఈ లోపల తెలంగాణ సుప్రీంకోర్టుకి వెళ్ళింది.సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగానే విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల వాదనలు ట్రైబ్యునల్ 2 వినడం ప్రారంభించింది.తెలంగాణ కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటోంది. అసలు అంశాలపై విచారణ ప్రారంభం కాకుండానే,తగాదా తీర్చవలసినది రెండు రాష్ట్రాల మధ్యా లేక నాలుగు రాష్ట్రాల మధ్య అనే వాదాంశంపై విచారణ జరిగింది. ఈ ట్రైబ్యునల్ ముందు కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ప్రస్తుత ట్రైబ్యునల్ ఇరు రాష్ట్రాల మధ్య మాత్రమే న్యాయనిర్ణయం చేయాలని ఈ సందర్భంగా మిగతా రెండు రాష్ట్రాల కేటాయింపులను భంగపరచటం జరగకూడదనీ చెప్పింది.ఈ విచారణానంతరం 2016 అక్టోబర్‌లో ఒక తీర్పు వెలువడింది.


ఈ తీర్పులో వివాద పరిష్కరణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్యేననీ నాలుగు రాష్ట్రాల మధ్య కాదని స్పష్టం చేసింది.ఇంకా ఈ తీర్పులో ముఖ్యమైన సారాంశాలు: ఇంతకుముందు ట్రైబ్యునల్స్ చేసిన నిర్ణయాలని తిరగతోడటం కుదరదు; వివాదం ఇరు రాష్ట్రాల మధ్యే; విభజన చట్టం సెక్షన్ 89 నందు కొత్తగా కేటాయింపులు చేసె అవకాశం కల్పించలేదు; ఇంతకుముందు ట్రైబ్యునల్ లో తెలంగాణ నీటి అవసరాలను సరిగా ప్రతిపాదించలేదు అన్న వాదన సమర్ధనీయం కాదు, ఆంధ్రాకి బేసిన్ బయటి అవసరాలకు కేటాయించిన నీటి వాటాలకు కోత పెట్టి తెలంగాణకి బదలాయించమని ఎక్కడా చెప్పలేదు. 2013లోనే అప్పటి మూడు ఇప్పటి నాలుగు రాష్ట్రాల నీటి వాటాల పునఃసమీక్షజరిగింది.మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇంకొక సమీక్ష అవసరం లేదు. నదిలో నీటి లభ్యతలలో తేడాలు రాలేదు, మిగతా రాష్ట్రాల సరిహద్దులలో మార్పు లేదు, జనాభాలలో మార్పు లేదు, ఉమ్మడి రాష్ట్రానికి కొత్త ప్రాంతాలు చేరలేదు, ట్రైబ్యునల్ 1 నీటి వాటాలని మార్చనవసరం లేదు అని చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు స్పష్టం చేసిన అంశాలు పరిశీలిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళినా పునఃస్సమీక్షకి అవకాశముండదు. ఒక పక్క ట్రైబ్యునల్ న్యాయవిచారణ పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టం సెక్షన్ 89 ప్రాతిపదికగా జరుపుతుండగా సెక్షన్ 3 ప్రాతిపదికగా కూడా విచారణ సాగించమని కేంద్ర ప్రభుత్వం ఒక ఎక్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఇవ్వగలదు? పార్లమెంటు చేసిన చట్టానికి సవరణలు ప్రతిపాదించడం చట్ట విరుద్ధం కాగలదు. అలాగే విడిగా మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయటం కూడా కుదరదు. కనుక తెలంగాణ సెక్షన్ 3 పరంగా వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కృష్ణా జలాల వాటాలలో తేడాలుండవని స్పష్టమయ్యాకే ఆంధ్రప్రదేశ్‌తో గోదావరి కృష్ణా జలాల బార్టర్ (బదలాయింపు) ప్రతిపాదనను తెలంగాణ చేసింది. ఆంధ్రలో వరి సాగు అవసరం లేదు, అక్కడి రైతులకి నవీన సాగు పద్దతులు తెలియవు, వారు నీటిని వృధా చేస్తున్నారు వాళ్ళ వాటాలు తగ్గించి మాకిచ్చెయ్యండి అని ట్రైబ్యునల్‌లో అనైతిక వాదన చేస్తుంటె ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఎలా సాధ్యమవుతుంది? 


-కురుమద్దాలి వెంకట సుబ్బారావు

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.