రియాకు స్వర్ణం

ABN , First Publish Date - 2022-10-01T09:55:47+05:30 IST

జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొట్టింది. తొలిరోజే స్వర్ణంతో ఘన బోణీ చేసింది. స్కేటింగ్‌లో రాష్ట్ర క్రీడాకారిణి రియా సబూ బంగారు పతకం సాధించింది.

రియాకు స్వర్ణం

జాతీయ క్రీడలు

 నెట్‌బాల్‌లో రజతం 

తెలంగాణకు రెండు పతకాలు

గాంధీనగర్‌: జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొట్టింది. తొలిరోజే స్వర్ణంతో ఘన బోణీ చేసింది. స్కేటింగ్‌లో రాష్ట్ర క్రీడాకారిణి రియా సబూ బంగారు పతకం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ క్వాడ్‌ ఫ్రీస్టయిల్‌ విభాగంలో రియా చాంపియన్‌గా నిలిచింది. ఇక, పురుషుల నెట్‌బాల్‌లో రాష్ట్ర జట్టు రజత పతకం కొల్లగొట్టింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తెలంగాణ బృందం 73-75 స్కోరు తేడాతో హరియాణా చేతిలో పరాజయంపాలై రన్నర్‌పతో సరిపెట్టుకుంది. 


మెరిసిన మీరా..

 జాతీయ క్రీడల తొలిరోజు పోటీల్లో అంతర్జాతీయ క్రీడాకారిణులైన లిఫ్టర్‌ మీరాబాయి చాను, షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌, ఫెన్సర్‌ భవానీ దేవి, రెజ్లర్‌ దివ్యా కక్రాన్‌లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయ్‌ చాను ఊహించినట్టే జాతీయ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. శుక్రవారం జరిగిన మహిళల 49 కిలోల విభాగంలో స్నాచ్‌లో 84 కిలోలు,  క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 107 కిలోలతో కలిపి మొత్తం 191 కిలోలు ఎత్తిన మణిపూర్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ టైటిల్‌ దక్కించుకుంది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోనూ చాను పసిడి పతకం అందుకున్న సంగతి తెలిసిందే. మణిపూర్‌కే చెందిన సంజితా చాను 187 కి. (82+105కి.) రజతం, ఒడిశా లిఫ్టర్‌ స్నేహా సొరేన్‌ 169కి. (73+96) కాంస్య పతకం గెలుపొందారు. ఇక, మహిళల ఫెన్సింగ్‌ వ్యక్తిగత సబ్రె విభాగంలో తమిళనాడుకు చెందిన భవానీ దేవి విజేతగా నిలిచి పసిడి పతకం అందుకుంది. మహిళల రెజ్లింగ్‌ 76 కిలోల కేటగిరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన దివ్యా కక్రాన్‌ ఫైనల్లో రీతిక (హరియాణా)ను చిత్తుచేసి బంగారు పతకాన్ని ముద్దాడింది. కాగా, మహిళల హైజం్‌పలో స్వప్నా బర్మన్‌ (మధ్యప్రదేశ్‌) 1.83 మీటర్లు లంఘించి స్వర్ణం దక్కించుకోగా.. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచాడు.  

Updated Date - 2022-10-01T09:55:47+05:30 IST