గోషామహల్‌లో గందరగోళం.. సందిగ్ధంలో రాజాసింగ్‌

ABN , First Publish Date - 2020-11-28T19:05:33+05:30 IST

ఇతర పార్టీల నుంచి రాజాసింగ్‌ కులస్తులు, మరో వైపు పార్టీలో తన అనుచరులు పోటీలో ఉండడంతో ఎవరికి ప్రచారం చేసినా మరొకరికి దూరం అవుతాననే ఉద్దేశంతో ఎమ్మెల్యే గోషామహల్‌ నియోజకవర్గంలో అంటీముట్టనట్లు ఉంటున్నాడని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా అంటున్నాయి.

గోషామహల్‌లో గందరగోళం.. సందిగ్ధంలో రాజాసింగ్‌

గోషామహల్‌లో ఇతర పార్టీల అభ్యర్థులు కులస్తులు..

సొంత పార్టీ నుంచి ఇతరులు 

పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తే కులంలో... 

ఇతరులకు ప్రచారం చేస్తే పార్టీలో పరువుపోతుందనే భయం


మంగళ్‌హాట్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇతర పార్టీల నుంచి రాజాసింగ్‌ కులస్తులు, మరో వైపు పార్టీలో తన అనుచరులు పోటీలో ఉండడంతో ఎవరికి ప్రచారం చేసినా మరొకరికి దూరం అవుతాననే ఉద్దేశంతో ఎమ్మెల్యే గోషామహల్‌ నియోజకవర్గంలో అంటీముట్టనట్లు ఉంటున్నాడని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా అంటున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉంటున్న ఎం కృష్ణ విశ్వకర్మ కులానికి చెందిన తన సతీమణి శశికళకు మంగళ్‌హాట్‌ టికెట్‌, జైశ్వాల్‌ సమాజ్‌కు చెందిన మరో అనుచరుడు రాకేష్‌ జైశ్వాల్‌కు జాంబాగ్‌, అసెంబ్లీ ఎన్నికల్లో బేగంబజార్‌ నుంచి అత్యధిక ఓట్లు బీజేపీకి రావడంలో కీలక పాత్ర పోషించిన శంకర్‌ యాదవ్‌కు బేగంబజార్‌ టికెట్‌, గన్‌ఫౌండ్రీ టికెట్‌ను ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్‌ సురేఖ ఓం ప్రకాష్‌ భీష్వకు కేటాయించారు. దత్తాత్రేయ నగర్‌, గోషామహల్‌ డివిజన్లలో మాత్రం బీజేపీ టికెట్లను లోథి కమ్యూనిటీకి చెందిన వారికి కేటాయించారు. ఆ నాలుగు డివిజన్ల అభ్యర్థులకు పార్టీ తరఫున ప్రచారం చేస్తే తన లోథ్‌ కులస్తుల నుంచి ఇబ్బందులు వస్తాయని, ఈ సారి ఎన్నికలు మీరే చూసుకోవాలని అభ్యర్థులకు రాజాసింగ్‌ సూచించినట్లు కార్యకర్తలు, నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.



పార్టీనా... కులమా...

మంగళ్‌హాట్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి పరమేశ్వరీ సింగ్‌, టీడీపీ నుంచి ఊర్మిళాదేవి, కాంగ్రెస్‌ నుంచి జ్యోతి బరిలో ఉన్నారు. వీరు లోథ్‌ కమ్యూనిటీకి చెందిన వారు కావడం, బీజేపీ అభ్యర్థి ఇతర కమ్యూనిటీకి చెందిన వారు కావడంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన ముఖ్య అనుచరుడి తరపున కూడా ప్రచారం చేయడం లేదని చర్చ జరుగుతోంది. దత్తాత్రేయ నగర్‌, గోషామహల్‌ డివిజన్‌లలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే కులస్తులకే టికెట్‌ కేటాయించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ముఖేష్‌ సింగ్‌కు టికెట్‌ వచ్చింది. ముఖేష్‌ సింగ్‌ లోథ్‌ క్షత్రియ సమాజ్‌(కులసంఘం)లో కీలక పదవిలో ఉన్న సమయంలో రాజాసింగ్‌ మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో రాజాసింగ్‌కు ముఖేష్‌ సహకారం అందించారనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి లాల్‌ సింగ్‌ తరఫున ప్రచారం చేసి ముఖేష్‌ సింగ్‌పై వ్యతిరేకతను ఎత్తిచూపలేరని, అందుకే అటు మంగళ్‌హాట్‌, ఇటు గోషామహల్‌ డివిజన్లలో రాజాసింగ్‌ ప్రచారం చేయడం లేదని సమాచారం. జాంబాగ్‌, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్‌ టికెట్ల విషయంలో రాజాసింగ్‌ను కాదని ఇతరులకు కేటాయించారనే ప్రచారం ఉండడంతో అక్కడి నాయకులకు సైతం ఎమ్మెల్యే సహకారం దక్కేలా లేదని అంటు న్నారు. మొత్తానికి బీజేపీలో కీలక నేతగా ఉంటూ, ఎంఐఎంకు ధీటైన సమాధానం చెప్పే రాజాసింగ్‌ను నమ్ముకొని టికెట్లు తెచ్చుకున్న అనుచరులు ఆయనను ప్రచారానికి రమ్మనలేక, ఇటు సొంత ఇమేజ్‌తో ఓట్లడగలేక సతమతం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. 


బేగంబజార్‌లో రసవత్తరం...

బేగంబజార్‌ బీజేపీ అభ్యర్థి శంకర్‌ యాదవ్‌కు స్థానికులలో మంచి పేరుంది. మూడు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన వ్యక్తి అయినప్పటికీ పార్టీ టికెట్‌ కేటాయించడంలో తీవ్ర జాప్యం చేసింది. అందుకు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ సారి బేగంబజార్‌ బీజేపీ ప్రచారంలో ఎక్కడా రాజాసింగ్‌ ఫొటో గానీ, ఆయన పేరు గానీ కనిపించడం లేదని కార్యకర్తలు అంటున్నారు. కేవలం పార్టీ అభ్యర్థి శంకర్‌ యాదవ్‌ ఫొటో, ప్రధాని మోదీ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. 


Updated Date - 2020-11-28T19:05:33+05:30 IST