ఆర్జేడీ అదుర్స్‌!

ABN , First Publish Date - 2022-08-17T06:53:51+05:30 IST

బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ కూటమి ప్రభుత్వానికి సంబంధించి.. నూతన మంత్రి వర్గ విస్తరణ...

ఆర్జేడీ అదుర్స్‌!

నితీశ్‌ కేబినెట్‌లో 16 బెర్తులు.. 31 మందితో కొత్త సర్కారు

లాలూ ఇద్దరు కుమారులకు మంత్రి పదవులు 


పట్నా, ఆగస్టు 16: బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ కూటమి ప్రభుత్వానికి సంబంధించి.. నూతన మంత్రి వర్గ విస్తరణ పూర్తయింది. మొత్తం 31 మంది మంత్రులతో కొత్త పాలన ప్రారంభమైంది. భాగస్వామ్య పార్టీ ఆర్జేడీ.. అదుర్స్‌ అనే రేంజ్‌లో మంత్రి వర్గంలో సింహభాగం కైవసం చేసుకుంది. మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లకు బెర్తులు లభించాయి. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఫగు చౌహాన్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. వీరిలో 16 మంది తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీకి చెందిన వారు కాగా, 11 మంది సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు చెందినవారు ఉన్నారు. ఇక, మిగిలిన వారిలో ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎం), మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో ఐదుగురు  ముస్లింలకు, ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది. కొత్త మంత్రులకు సీఎం నితీశ్‌  శాఖలను కేటాయించారు.


సాధారణ పరిపాలన, హోం శాఖలు సహా ముఖ్యమైన మరికొన్ని శాఖలను సీఎం తనదగ్గరే పెట్టుకున్నారు. తేజస్వి యాదవ్‌కు వైద్య, ఆరోగ్య శాఖ, రోడ్లు, భవనాలు, పట్టణ గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. తాజా మంత్రి వర్గంపై తేజస్వి యాదవ్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్‌ మయూఖ్‌ విమర్శించారు.  ఈ కూటమి వెనుక ఉన్న రాజకీయాలను బహిర్గతం చేస్తామన్నారు.

Updated Date - 2022-08-17T06:53:51+05:30 IST