Bihar: యావజ్జీవ జైలు శిక్ష పడిన ఆర్జేడీ నేత ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!

ABN , First Publish Date - 2022-08-15T01:46:22+05:30 IST

యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ తాజా వివాదానికి..

Bihar: యావజ్జీవ జైలు శిక్ష పడిన ఆర్జేడీ నేత ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!

పాట్నా: యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఆర్జేడీ (RJD) నేత, బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) తాజా వివాదానికి తెరతీశారు. గోపాల్ గంజ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (DM) జి.కృష్ణయ్య హత్య కేసులో జీవితఖైదు పడి ప్రస్తుతం సహర్సా జైలులో ఉన్న ఆనంద్ మోహన్ అనూహ్యంగా తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో ఇంటి వద్ద కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కావడం సంచలనమైంది. బీహార్‌లో ''జంగిల్ రాజ్'' మళ్లీ  వచ్చిదంటూ పలు రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పించాయి.


పాట్నాలోని కోర్టు మందు ఆగస్టు 12న ఆనంద్ మోహన్ హాజరయ్యారు. తిరిగి వెళ్తూ తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, మద్దతుదారులను కలిశారు. ఆయన భార్య లవ్లీ ఆనంద్, కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ కూడా గ్రూప్ ఫోటోలో కనిపిస్తున్నారు. కాగా, పాటలీ పుత్రలోని 166/బి నివాసంలో ఆనంద్ మోహన్ తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో చాలా సేపు గడిపారని, రక్షాబంధన్ రోజును ఆయనను చూశామని స్థానికులు చెబుతున్నారు. ఆర్జేడీ హయాలో అనేక మంది బాహుబలుల్లాంటి ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చిన ఉదంతాలున్నాయని అంటున్నారు.


గోపాల్ గంజ్ డీఎం జి.కృష్ణయ్య హత్య కేసులో 2007లో ఆనంద్‌ మోహన్‌కు ఉరిశిక్ష పడింది. అయితే, సుప్రీంకోర్టు ఆ శిక్షను తగ్గించి జీవితఖైదుగా మార్చింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. ఇప్పటి వరకూ 14 ఏళ్లు ఆయన జైలు జీవితం గడిపారు. దీంతో ఆయనను విడుదల చేయాలంటూ సమయం వచ్చినప్పుడల్లా ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆనంద్ మోహన్ కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ సైతం నితీష్‌కుమార్‌కు పలు విజ్ఞాపనలు చేశారు. అయితే, నితీష్ మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. కానీ, ప్రస్తుతం ఆర్జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆనంద్ మోహన్ విడుదలపై ఆశలు చిగురించినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 14 ఏళ్లు జైలుశిక్ష పూర్తయితే ఖైదీ ప్రవర్తన ఆధారంగా జైలు శిక్షను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు.

Updated Date - 2022-08-15T01:46:22+05:30 IST