నితీష్‌పై అవిశ్వాస తీర్మానం: ఆర్జేడీ

ABN , First Publish Date - 2022-01-19T21:09:59+05:30 IST

మద్యపాన నిషేధం చట్టాన్ని సవరించకుంటే వచ్చే బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో..

నితీష్‌పై అవిశ్వాస తీర్మానం: ఆర్జేడీ

పాట్నా: మద్యపాన నిషేధం చట్టాన్ని సవరించకుంటే వచ్చే బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నితీష్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్‌జేడీ హెచ్చరించింది. నితీష్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ సిద్ధం చేస్తోందని ఆర్జేడీ ప్రధాన ప్రతినిధి భాయ్ వీరేంద్ర బుధవారంనాడు మీడియాకు తెలిపారు. మద్యపాన నిషేధ చట్టాన్ని నితీష్ కుమార్ సవరించనున్నారనే వార్తల నేపథ్యంలో ఆర్జేడీ తాజా వ్యాఖ్యలు చేసింది.


''సవరణ బిల్లును ముందు పరిశీలిస్తాం. రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా సవరణ బిల్లు లేకపోతే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం'' అని వీరేంద్ర తెలిపారు. మద్యనిషేధం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా ఇది వారికి ఒక తలనొప్పిగా మారకూడదని తమ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడే చెప్పారని అన్నారు. అయినప్పటికీ రాబోయే పరిణామాలను, సైడ్ ఎఫెక్ట్‌లను పట్టించుకోకుండా నితీష్ కుమార్ మద్యనిషేధ చట్టాన్ని తెచ్చారని పేర్కొన్నారు. ఇందువల్ల ముఖ్యంగా పేద ప్రజలు బాధితులయ్యారని, అనేక మందిని ఈ చట్టం కింద జైలుకు పంపారని అన్నారు. డబ్బున్న వాళ్లు ఇళ్లలోనే కూర్చుని మద్యం సేవిస్తుంటే, పేదలు జైళ్లపాలవుతున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-19T21:09:59+05:30 IST