నీతిమాలిన చర్య ఏది, ఎవరిది..!?

ABN , First Publish Date - 2021-01-31T14:00:15+05:30 IST

గతవారం నేను రాసిన కొత్త పలుకును పాక్షికంగా ఖండిస్తూ వైఎస్‌ షర్మిల ఒక ప్రకటన జారీ

నీతిమాలిన చర్య ఏది, ఎవరిది..!?

గతవారం నేను రాసిన కొత్త పలుకును పాక్షికంగా ఖండిస్తూ వైఎస్‌ షర్మిల ఒక ప్రకటన జారీ చేశారని జగన్‌ మీడియాలో ప్రచురించారు. ఒక కుటుంబానికి సంబంధించి వార్తలు రాయడం నీతిమాలిన చర్య అని కూడా ఆక్షేపించారు. నిజానికి నేను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదు. ఎవరో తయారుచేసిన ప్రకటనపై షర్మిల అయిష్టంగా సంతకం చేసినట్టుగా ఆ ప్రకటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసిందీ నాకు తెలియదనుకుంటున్నారా? అయినా, కుటుంబ వ్యవహారాల గురించి రాయడం నీతిమాలిన చర్య అన్న పక్షంలో ఒకప్పుడు రామోజీరావుతో విభేదించిన ఆయన చిన్న కుమారుడు దివంగత సుమన్‌తో ఇంటర్వ్యూ చేసి రామోజీరావును తిట్టించిన జగన్మోహన్‌ రెడ్డి కూడా నీతిమాలిన చర్యకు పాల్పడినట్టే కదా! జగన్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయనది ప్రైవేటు కుటుంబం కాదు. షర్మిల కూడా వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి మధ్య విభేదాలు ఏర్పడితే అది వార్త కాకుండా పోదు.


రామోజీరావు ప్రజాజీవితంలో లేకపోయినా ఆయన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన వాళ్లు నీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే! అయినా నేను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్‌ పట్టుకుని చెప్పగలరా? అలా చెప్పిన రోజు నేను బహిరంగంగా క్షమాపణ చెబుతాను. అన్నట్టు రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఇతరులతో పాటు నేను కూడా కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారంనాడు ఢిల్లీలో నోరు పారేసుకున్నారు. గత ప్రభుత్వం హోదా సాధించలేకపోయిందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ మీరేం చేస్తున్నారో చెప్పకుండా నా బోటివాళ్లపై పడి ఏడవడం ఎందుకు? ‘‘మాకు అధికారం ఇస్తే హోదా సాధిస్తాం’’ అని నమ్మబలికే కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పెద్దల వద్ద ఆ ఊసు ఎత్తడానికి సైతం భయపడుతున్నారు ఎందుకు? మీడియా వారివల్ల హోదా రాకుండా పోయింది నిజమైతే.. మీకు అధికారంతో పాటు మీడియా కూడా ఉంది కదా? అయినా పాదాభివందనాలు ఎందుకు? విజయసాయి రెడ్డి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. సంబంధం లేనివారిని కూడా కుల ద్వేషంతో వివాదంలోకి లాగే ప్రయత్నం చేసే బదులు తనను తాను అదుపులో ఉంచుకుంటే ఆయనకే మంచిది!.

Updated Date - 2021-01-31T14:00:15+05:30 IST