Freebies Debate : సీజేఐ జస్టిస్ రమణకు ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-08-12T16:42:49+05:30 IST

రాజకీయ పార్టీల ఉచిత పథకాల (Freebies) హామీలపై భారతీయ జనతా

Freebies Debate : సీజేఐ జస్టిస్ రమణకు ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీల ఉచిత పథకాల (Freebies) హామీలపై భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ప్రారంభించిన చర్చ విస్తృతమవుతోంది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడంతో రాజకీయ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) చీఫ్ జయంత్ చౌదరి (Jayant Chaudary) స్పందిస్తూ, ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (NV Ramana)పైనే గురిపెట్టారు. 


‘‘భారత ప్రధాన న్యాయమూర్తికి కల్పించిన ఉచిత తాయిలాలు ఏమిటి?’’ అంటూ రేవడి కల్చర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి జయంత్ చౌదరి ప్రశ్నించారు. 


అశ్విని కుమార్ ఉపాధ్యాయ (Ashwini Kumar Upadhyay) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించి, పంపిణీ చేయడం చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు. ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందన్నారు. అదే సమయంలో ప్రజా సంక్షేమాన్ని కూడా సమతూకంలో చూడాలని తెలిపారు. అయితే హామీలను నెరవేర్చని  రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలన్న డిమాండ్‌లో కోర్టు జోక్యం చేసుకోబోదని చెప్పారు. 


ఈ నేపథ్యంలో జయంత్ చౌదరి ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘భారత ప్రధాన న్యాయమూర్తికి కల్పించిన ఉచిత తాయిలాలు ఏమిటి?’’ అంటూ రేవడి కల్చర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి సీజేఐని ప్రశ్నించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవిగా కనిపిస్తున్నాయని, అయితే సరైన స్ఫూర్తితో చేసినట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. పిరమిడ్‌లో అట్టడుగున్న ఉన్నవారి విషయంలో నేరుగా జోక్యం చేసుకోవడం అవసరమని పేర్కొన్నారు. రేషన్ సరుకులను పంపిణీ చేయడం ద్వారా కానీ, ఆర్థిక సాయం చేయడం ద్వారా కానీ అట్టడుగు ప్రజానీకానికి మద్దతుగా నిలవవలసిన అవసరం ఉందన్నారు. ఇది జీవించే హక్కు సహా ప్రాథమిక హక్కులకు సంబంధించినదని తెలిపారు. ఔనా? కాదా? అని అడిగారు. 


బీజేపీపై ఆగ్రహం

జయంత్ బీజేపీపై కూడా విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న అనేక ఉచిత పథకాల హామీలు ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో ఉండటం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. ఇది బీజేపీ విషయంలో నిజం కావచ్చునన్నారు. తమ పార్టీ విషయంలో అలా లేదని చెప్పారు. ఆర్ఎల్‌డీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను మాత్రమే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో తాము ప్రజలకు చెప్పామని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను విడుదల చేయకుండా ప్రచారాన్ని ప్రారంభించినపుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. నిపుణులు, ప్రజలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్నికల ప్రణాళికను తయారు చేసి, దానిని సకాలంలో ఓటర్ల ముందు పెడితే, వారు సమస్యలను, హామీలను అర్థం చేసుకోగలుగుతారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసే ప్రక్రియ పవిత్రతను కొనసాగించడానికి ఇది చాలా అవసరమని చెప్పారు. 


బీజేపీ వాదన

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ విధానాలు సమాజంలో అణగారిన వర్గాలను సాధికారులను చేసే విధంగా ఉన్నాయని బీజేపీ చెప్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు రేవడి సంస్కృతిని ఆచరిస్తున్నాయని ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం అందరికీ ఉచిత పథకాలను పంచిపెడుతున్నాయని పేర్కొంది. 


అసలు రేవడి అంటే ఏమిటి?

రేవడి అనేది ఆహార పదార్థం. దీనిని మకర సంక్రాంతి వంటి పండుగల సమయంలో తయారు చేసి, దేవునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరించి,  అందరికీ పంచుతారు. 


రేవడి యుద్ధానికి కారణం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జూలై 16న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రేవడిని పంచిపెట్టి ఓట్లను సేకరించే సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉచిత పథకాల హామీలతో రేవడి సంస్కృతిని దేశంలో వ్యాపింపజేస్తున్నారని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటువంటి సంస్కృతి దేశ అభివృద్ధికి చాలా అపాయకరమని హెచ్చరించారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మోదీపై విరుచుకుపడింది. ఉచిత, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలను అందజేయడం రేవడి కాదని పేర్కొంది. 


Updated Date - 2022-08-12T16:42:49+05:30 IST