డబ్లింగ్‌లో మరో మైలురాయి

ABN , First Publish Date - 2021-10-04T05:26:39+05:30 IST

గుంటూరు - గుంతకల్లు రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది.

డబ్లింగ్‌లో మరో మైలురాయి
దొనకొండ - కురిచేడు మధ్యన పూర్తి అయిన రెండు వరసల రైలుమార్గం

దొనకొండ - కురిచేడు మధ్యన 12.5 కి.మీ. నిర్మాణం పూర్తి

గుంటూరు - గుంతకల్లు మధ్యన డబ్లింగ్‌ పనులు

గుంటూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): గుంటూరు - గుంతకల్లు రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు పేరేచర్ల -  సాతులూరు, దొనకొండ - గజ్జలకొండ, నల్లపాడు - పేరేచర్ల సెక్షన్ల మధ్యన డబ్లింగ్‌ పూర్తి చేసిన రైల్వేవర్గాలు తాజాగా దొనకొండ - కురిచేడు మధ్యన రెండు వరసల రైలుమార్గం నిర్మాణాన్ని పూర్తి చేశాయి. రెండోరోజుల క్రితం కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ వచ్చి ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 130 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపి రైలుమార్గం సామర్థ్యాన్ని పరీక్షించారు. ఎక్కడా కుదుపులు కూడా రాకపోవడంతో ఈ మార్గంలో ప్రస్తుతానికి 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతించారు. దీంతో గుంటూరు - గుంతకల్లు మధ్యన క్రాసింగ్‌ల సమస్య కొంతమేరకు పరిష్కారం అవుతుంది. 

రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాన్ని రాయలసీమ, దక్షిణ భారతదేశం ప్రాంతాలను అనుసంఽధానించడంలో గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ఎంతో కీలకమైనది. ఈ సెక్షన్‌లో ఆటంకాలు లేని ప్రయాణానికి, రద్దీ నివారణ కోసం రైల్వే శాఖ డబ్లింగ్‌, విద్యుద్దీకరణ ప్రాజెక్టుని కొన్ని సంవత్సరాల క్రితమే మంజూరు చేసింది. 404 కిలోమీటర్ల పొడవునా నిర్మాణం చేయనున్న ఈ మార్గం కోసం రూ.3,887 కోట్లు కేటాయించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుని మంజూరు చేసింది. తొలుత పేరేచర్ల - సాతులూరు సెక్షన్‌ మధ్యన పనులు చేపట్టారు. ఆ తర్వాత దొనకొండ - గజ్జలకొండ(12.4 కిలోమీటర్లు) పనిని పూర్తిచేశారు. నల్లపాడు - పేరేచర్ల కూడా పూర్తికావడంతో సాతులూరు వరకు 32 కిలోమీటర్ల రెండు వరసల రైలుమార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కురిచేడు - దొనకొండ మధ్యన 12.5 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రావడంతో గుంటూరు - గుంతకల్లు మార్గంలో ఇప్పటివరకు 56.9 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మాణం పూర్తయింది. ఇదేవిధంగా డోన్‌ - పెండేకల్లు - ఎద్దులదొడ్డి(36.6 కిలోమీటర్లు) కూడా పూర్తి అయింది. మొత్తంగా 93.5 కిలోమీటర్ల పొడవునా విద్యుద్దీకరణతో కూడిన రెండు వరసల పనులు పూర్తి అయ్యాయి. 

2022 మార్చి నాటికి మరో రెండు సెక్షన్ల లక్ష్యం

2022 మార్చి నెలాఖరు నాటికి మరో రెండు సెక్షన్లలో పనులు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నది. తర్లుపాడు - గజ్జలకొండ మధ్యన 25 కిలోమీటర్లు, గుండ్లకమ్మ - కురిచేడు మధ్యన 11 కిలోమీటర్ల దూరం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత తర్లుపాడు - నంద్యాల మధ్యన మరో 59 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఘాట్‌ సెక్షన్‌, అటవీప్రాంతం ఉండటంతో ఇప్పటివరకు ఆ శాఖ నుంచి క్లియరెన్స్‌ రాలేదు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే తర్లుపాడు - నంద్యాల సెక్షన్‌ సంక్లిష్టం కానుంది. 

రైల్వే చెబుతున్న ప్రయోజనాలు

గుంటూరు - గుంతకల్లు మద్యన ప్రధానంగా దేశంలోని తూర్పు ప్రాంతాలైన హౌరా, భువనేశ్వర్‌, విశాఖపట్టణం వంటి ప్రాంతాల నుంచి రాయలసీమ, దక్షిణ భారత దేశంలోని ప్రాంతాలకు మరిన్ని రైళ్లను నడిపే సామర్థ్యం పెరుగుతుంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఖనిజాలు పుష్కలంగా లభించే పల్నాడు ప్రాంతం నుంచి దేశంలోని ఇతర ఏ ప్రాంతానికైనా సరుకులను రవాణా చేయవచ్చు. అలానే ప్రస్తుతం గూడురు మార్గంలో నడుస్తున్న పలు రైళ్లని ఇటువైపునకు మళ్లించే అవకాశం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య రైల్వేవర్గాలను ప్రత్యేకించి అభినందించారు. 

Updated Date - 2021-10-04T05:26:39+05:30 IST