అడ్డదారుల్లో ఆర్‌ఎంపీలు!

ABN , First Publish Date - 2022-09-24T06:18:38+05:30 IST

అడ్డదారుల్లో ఆర్‌ఎంపీలు!

అడ్డదారుల్లో ఆర్‌ఎంపీలు!

వివాదాల్లో కీలకంగా కొందరు గ్రామీణ వైద్యులు

కాసుల కోసం నేరాల్లో భాగస్వామ్యమవుతున్న వైనం

ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాలోనూ వారిదే హవా

యాజమాన్యాల పర్సంటేజీల కోసం జనాల జేబులకు చిల్లు

కొందరి తీరుతో నిజాయితీగా సేవలందించే వారిలో వేదన

ఖమ్మం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): అనారోగ్యానికి గురైన వారికి అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు కాపాడడమే వృత్తిగా ఎంచుకున్న గ్రామీణ వైద్యులు (ఆర్‌ఎంపీలు) కాసు ల కోసం అడ్డదారులు పడుతున్నారు. వృత్తి ధర్మాన్ని పక్కనబెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా.. అత్యాశకు పోయి నేరాల్లో భాగస్వాములవుతున్నారు. వైద్యంలో తమకున్న అనుభవాన్ని వక్రమార్గంలో ఉపయోగిస్తున్న కొందరు.. నిజాయితీగా ఆర్‌ఎంపీ వృత్తిని కొనసాగిస్తున్న వారికి వేదన మిగులుస్తున్నారు. చాలామంది ఆర్‌ఎంపీలు గ్రామాల్లో మంచిగా సేవలందిస్తూ ‘మా డాక్టర్‌ గారు’ అన్న ప్రజల మన్ననలు అందుకుంటుంటే.. ఇంకొందరు డబ్బుపై అత్యాశ, స్వలాభాల కోసం అనైతిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. తమకున్న గుర్తింపు, అనుభవాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయాలనుంచి రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాల వరకు అన్నీ తామై నడిపించడమే కాకుండా నేరసంఘటనల్లోనూ తలదూరుస్తున్నారు. ఇందుకుజిల్లాలో ఇటీవల జరుగుతున్న సం ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు ఛత్తీ్‌సగఢ్‌ ఒడిస్సా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 3వేలమంది ఆర్‌ఎంపీలు ఖమ్మంజిల్లాకేంద్రంగా తమ వైద్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రులతో అనుసంధానమవుతున్న వారు రోగులను ఆయా ఆసుపత్రులకు పంపడం, వారినుంచి ఆసుపత్రుల యాజమాన్యా లు వసూలు చేస్తున్న బిల్లుల్లో నుంచి పర్సంటేజీలు తీసుకోవడం లాంటి చేస్తున్నారు. ఇదంతా వృత్తిపరంగా చేసుకుంటున్నదే అయినా.. కొందరు ఇతర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ నేరాలకు కూడా వెనుకాడటం లేదు. కొందరైతే నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారు. 


నిదర్శనంగా నిలిచిన తాజా సంఘటనలు..

తెల్దారుపల్లిలో ఇటీవల జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులోని ప్రదాన సూత్రధారుల్లో ఆర్‌ఎంపీ వైద్యుడు ఒకరు కీలక నిందితుడుగా అరెస్టయ్యాడు. ఆయన గ్రామీణ వైద్యుడిగా స్థానికులకు ప్రాథమిక వైద్యసేవలందించడంతో పాటు గ్రామ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటూ.. చివరకు ఒక నాయకుడి హత్య కేసులో నిందితుడుగా జైలుకు వెళ్లాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు ‘సూది’ హత్య సంఘటనల్లో ఆర్‌ఎంపీల కీలకంగా ఉన్నారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్‌సాహెబ్‌ హత్య పథకంలో భార్య ఇమాంబీతోపాటు ఆమె ప్రియుడు మోహనరావు సూత్రధారులు కాగా మత్తు ఇంజక్షన్‌ పొడిచి జమాల్‌సాహెబ్‌ను హతమార్చింది మాత్రం నామవరానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్న. మత్తు ఇంజక్షన్లకోసం రూ.5వేలు తీసుకున్న అతడు ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోపనిచేస్తున్న తనమిత్రుడు యశ్వంత, మరో ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన ధియేటర్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆర్‌ఎంపీ వైద్యుడు పోరళ్ల సాంబశివరావు ద్వారా వాటిని తెప్పించి దారుణానికి ఒడిగట్టాడు. అలాగే రెండో భార్యను ప్రసవం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చి.. ప్రసవం అనంతరం మత్తు ఇంజక్షన ఇచ్చి భార్యను హతమార్చిన భిక్షం కూడా మత్తు ఇంజక్షన్ల కోసంవు  ఆర్‌ఎంపీ వైద్యుడినే సంప్రదించినట్టు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తి పడి మత్తు ఇంజక్షన్లను అందించడం, సూది పొడిచి చంపడంలో ఆర్‌ఎంపీలు కీలక పాత్ర పోషించడం చర్చనీయాంశమైంది. ఈ రెండు ఘటనలతో ఆర్‌ఎంపీలు అంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే నేలకొండపల్లి మండలంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి పక్కనున్న మరో ప్రయాణికుడి చేయి గోరు తగలగా.. సూదిపొడిచినట్టు భావించిన ఆ యువకుడు భయంతో ఆటోనుంచి దూకి గాయపడ్డాడు. దీన్ని బట్టి చూస్తే జనంలో ‘సూది’ భయం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. 


ప్రైవేటు ఆసుపత్రుల దందాలో ఆర్‌ఎంపీలు.. 

వందలాది ఆసుపత్రులతో వైద్య సేవలకు కేంద్రంగా అభివృద్ధి చెందిన ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ఆర్‌ఎంపీల సాయంతో దందాలు చేస్తున్నాయి. ఆర్‌ఎంపీలతో ఒప్పందాలు చేసుకుని గ్రామాల నుంచి రోగులను రప్పించుంటున్న ఆసుపత్రుల వారు అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తూ.. అందులో సగానికి సగం ఆర్‌ఎంపీలకు ఇస్తూ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాము పెద్దగా కష్టపడకుండా సొమ్ములు వస్తుండటంతో ఆర్‌ఎంపీలు కూడా ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలోని ఆసుపత్రుల్లో మూడొంతులు ఆర్‌ఎంపీల దయతోనే నడుస్తుండటం, కొన్ని ఆసుపత్రులైతే ఆర్‌ఎంపీలు లేకపోతే నడవడమే కష్టతరం అవుతోందనంటే ఏమేరకు వారు యాజమాన్యాలు, వైద్యుల వద్ద తమ ప్రభావం చూపుతున్నారో అర్థమవుతోంది. మరోకోణం ఏంటంటే రోగులను ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు పంపించకుండా తమకు ఒప్పందం ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు పంపించి మరీ రూ.25నుంచి50వేలు వరకు బిల్లులు వసూలు చేయిస్తున్నారు ఆర్‌ఎంపీలు. గ్రామాల్లో ఏఎనఎంలు, ఆశావర్కర్లు గర్భిణులకు మొదటినుంచి కౌన్సెలింగ్‌ ఇస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు సిద్ధం చేస్తుంటే.. కొందరుఆర్‌ఎంపీలు ప్రసవ సమయానికి వారం ముందు గర్భిణులు, వారి కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి.. ‘ప్రభుత్వ వైద్యంకోసం వెళితే సక్రమంగాచూడరు. తల్లీ, బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుంది’ అని భయపెడుతూ ప్రైవేటు ఆసుపత్రులవైపు మళ్లిస్తున్నారు. అలా తీసుకెల్లినందుకు గాను రూ.లక్ష బిల్లుకు రూ.40వేలు, రూ.50వేల వరకు ఆసుపత్రుల వారు ముట్టజెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే రోగం చిన్నదే అయినా రోగులు, వారి కుటుంసభ్యులను భయపెడుతూ రోజుల తరబడి వైద్యం చేయిస్తూ ఆసుపత్రుల వారి నుంచి డబ్బు పోగేసుకుంటున్నారు. అంతేకాదు ల్యాబ్‌, మందుల బిల్లుల నుంచి కూడా పర్సంటేజీలు వారికి ముడుతున్నాయి. అంతేకాదు ఆసుపత్రుల వారు తమ వద్దకు రోగులను పంపినందుకు గాను ఆర్‌ఎంపీలకు ప్రాధాన్యం ఇస్తూ విందులు, వినోదాలు, టూర్లు, విలువైన బహుమతులు కూడా ఇస్తున్నారు. వీటన్నిటిని చూస్తున్న ఆర్‌ఎంపీలు తమకు తిరుగులేదు అన్నట్టుగా ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ప్రవర్తిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు.


నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : మాలతి, డీఎంహెచవో 

ఆర్‌ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గర్భస్రావాలు చేయడం, రోగులను బలవతంగా ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడం చట్ట రీత్యా నేరం. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలు , శస్త్రచికిత్సలు, వైద్యపరీక్షలు ఉచితంగానే అందుతున్నాయి. ప్రత్యేకమైన విభాగాలు జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. ఆర్‌ఎంపీల మాటలు నమ్మి మోసపోకుండా ప్రభుత్వ వైద్యం చేయించుకోవాలి. అలాగే ఎవరైనా ఆర్‌ఎంపీలు అనైతిక చర్యలకుపాల్పడితే వారి పట్ల అసోసియేషన్ల ప్రతినిధులు కఠినంగా వ్యవహరించి.. అలాంటి వారి గురించి ఆరోగ్యశాఖ, పోలీసులదృష్టికి తీసుకెళ్లాలి. 

Updated Date - 2022-09-24T06:18:38+05:30 IST