ఆర్వో ప్లాంట్‌ నిర్వహణపై శీతకన్ను!

ABN , First Publish Date - 2021-11-29T06:25:33+05:30 IST

ఆర్వో ప్లాంట్‌ నిర్వహణపై శీతకన్ను!

ఆర్వో ప్లాంట్‌ నిర్వహణపై శీతకన్ను!
నున్న పంచాయతీ నిర్వహిస్తున్న ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, వృథాగా పోతున్న తాగునీరు

ఫ కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచని నున్న పంచాయతీ

ఫ వృథాగా పోతున్న తాగునీరు

ఫ వాటర్‌ ప్లాంట్‌ లోపల, బయట అపరిశుభ్ర వాతావరణం

ఫ దాతల దాతృత్వం వృథా

విజయవాడ రూరల్‌, నవంబరు 28 : లాభాపేక్ష లేకుండా ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేసేందుకు దాతలే నిర్మించి పంచాయతీకి అప్పగించిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. కొన్నేళ్లగా ఆర్వో ప్లాంట్‌కు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో సురక్షిత నీరు వృథా అవుతోంది. నున్న పంచాయతీ సభ్యుడిగా పనిచేసిన టీడీపీ నాయకుడు భీమవరపు సత్యనారాయణరెడ్డి రూ.5 లక్షల వ్యయంతో తన తల్లి దుర్గమ్మ పేరుతో 2005లో ఆరోవ వాటర్‌ ప్లాంట్‌ను నిర్మించారు. మంచినీటి చెరువు కట్ట పక్కనే నిర్మించిన ప్లాంట్‌ను కొన్నాళ్లపాటు ఆయనే నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మినరల్‌ వాటర్‌కు డిమాండ్‌ పెరుగుతుందని దశాబ్ధకాలం క్రితమే ఆయన అంచనా వేశారు. అప్పట్లో 20 లీటర్ల క్యాన్‌ను రూ.2కు సరఫరా చేశారు. ఆ తర్వాత ఆ ప్లాంట్‌ను  పంచాయతీకి అప్పగించారు. అప్పటి నుంచి ప్లాంట్‌ నిర్వహణలో పంచాయతీకి ఆయన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఇదిలావుండగా, నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో 20 లీటర్ల క్యాన్‌ను రూ.3కు ఇవ్వాలని పంచాయతీ నిర్ణయించింది. ఇటీవల ప్లాంట్‌ నిర్వహణపై పంచాయతీ శీతకన్ను వేస్తోంది. వాటర్‌ప్లాంట్‌ పంచాయతీకి అదనపు భారంగా మారిందంటూ కనీస మరమ్మతులకు కూడా చేయడంలేదు. ప్రస్తు తం వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణకు ఏటా ఐదారు లక్షలు ఖర్చవుతుండగా, ఆదాయం సగం కూడా రావడంలేదని సమాచారం. ఈ కారణంతోనే వాటర్‌ ప్లాంట్‌ లోపల, బయట అపరిశుభ్ర వాతావరణం ఉన్నా పట్టించుకోవడంలేదు. చివరకు వాటర్‌ పైపులైన్లు లీకై నీళ్లు వృథాగా పోతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. దాతల ధాతృత్వంతో ఇచ్చిన ప్లాంట్‌ను సరి గా నిర్వహించకపోగా, సురక్షిత నీరు వృథా అవుతు న్నా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని శాండ్‌ ఫిల్టర్‌ బెడ్‌లు కూడా పని చేయకపోవడంతో చాలా మంది ఆర్వో ప్లాంట్‌ నుంచే తాగునీళ్లను తీసుకువెళుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దాతలు ఇచ్చిన ఆర్వో ప్లాంట్‌ నిర్వహణపై దృష్టిసారించడంతోపాటు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-11-29T06:25:33+05:30 IST