సత్తుపల్లి ‘బార్‌’ అధ్యక్షుడు మంత్రిప్రగడ దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-22T04:48:47+05:30 IST

కల్లూరు మండలం కొత్త నారాయణపురం(గోకవరం) సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ న్యాయవాది, సత్తుపల్లి బార్‌ అసోసియమేషన్‌ అధ్యక్షుడు మంత్రిప్రగడ వెంకట సత్యనారాయణ (60) అక్కడిక్కడే మృతి చెందారు.

సత్తుపల్లి ‘బార్‌’ అధ్యక్షుడు మంత్రిప్రగడ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో నుజ్జయిన కారు

 కల్లూరు వద్ద రోడ్డుప్రమాదం

 తుమ్మల, పొంగులేటి, సండ్ర, మెచ్చా, తదితర  ప్రముఖుల సంతాపం

సత్తుపల్లి/కల్లూరు/దమ్మపేట/ఖమ్మం సాంస్కృతికం/ ఖమ్మం లీగల్‌, జనవరి 21:  కల్లూరు మండలం కొత్త నారాయణపురం(గోకవరం) సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ న్యాయవాది, సత్తుపల్లి బార్‌ అసోసియమేషన్‌ అధ్యక్షుడు మంత్రిప్రగడ వెంకట సత్యనారాయణ (60) అక్కడిక్కడే మృతి చెందారు. సత్తుపల్లి నుంచి కారులో ఖమ్మం వైపు వెళుతు ండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కొనటంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వెంకటసత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం వీఎం బంజర ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేయగా.. సత్తుపల్లి రూరల్‌ సీఐ కరుణాకర్‌ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమా దం జరిగిన తీరు తెలుసుకున్నారు. మంత్రిప్రగడకు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య రజనీకుమారి వరంగల్‌ జిల్లా కొత్తకొండ దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నారు.


ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా..


విద్యార్థి దశలో తెలుగు విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీలో పలు పదవులు నిర్వహించిన మంత్రిప్రగడ అనంతరం తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండేవారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కలిగిన మంత్రిప్రగడ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. అంతేకాదు న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన సత్తుపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆయన సత్తుపల్లిలో పీవీ విగ్రహం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. పలు ఆలయాల కమిటీల్లో బాధ్యుడిగానూ, సర్వబ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


పలువురి సంతాపం..


మంత్రిప్రగడ వెంకట సత్యనారాయణ మృతికి మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్‌, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మువ్వా విజయబాబు, డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయకుమార్‌, సత్తుపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, బీజేపీ నాయకుడు ఉడతనేని అప్పారావు, సీసీఎం, సీసీఐ నాయకులు మోరంపూడి పాండురంగారావు, దండు ఆదినారాయణ, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు కొడిమెల అప్పారావు, ఎంఎ్‌సఆర్‌ శర్మ, ఊటుకూరి పద్మనాభరావు, మాదిరాజు పుల్లారావు, తేరాల వాణి, అఖిలభారత బ్రాహ్మణ నెట్‌వర్క్‌ అధ్యక్షుడు శనగపాటి మురళీకృష్ణ, రాష్ట్ర విభాగం అధ్యక్ష, కార్యదర్శులు డి.ఫణిశర్మ, లతో పాటు పలువురు న్యాయవాదులు, దమ్మపేట జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు దొడ్డాకుల రాజేశ్వరరావు, బండి పుల్లారావు, బ్రాహ్మణ సంఘం జిల్లా బాధ్యులు మాదిరాజు వెంకటేశ్వరావు సంతాపం ప్రకటించారు. మువ్వా విజయబాబు, పలువురు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా అర్చకోఉద్యోగుల సంఘం నేతలు వీరభద్రశర్మ, వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం తెలిపారు.  


నేడు కోర్టు విధుల బహిష్కరణ


మంత్రిప్రగడ మృతికి సంతాపంగా శుక్రవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్టు ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాజుద్దీన్‌ బాబా తెలిపారు. పలు న్యాయవాద సంఘాలు మంత్రిప్రగడ మృతికి దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. 


Updated Date - 2021-01-22T04:48:47+05:30 IST