గేదెను తప్పించబోయి ఆటో బోల్తా

ABN , First Publish Date - 2022-06-26T04:09:39+05:30 IST

మండలంలోని మనుబోలు-పొదలకూరు మార్గంలో పర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికిపైగా మహిళలకు గాయాలయ్యాయి.

గేదెను తప్పించబోయి ఆటో బోల్తా
అస్వస్థతలో లక్ష్మీతేజ

పది మందికి పైగా గాయాలు

మనుబోలు, జూన్‌ 25: మండలంలోని మనుబోలు-పొదలకూరు మార్గంలో పర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికిపైగా మహిళలకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. అక్కంపేట వద్దనున్న జీడిపప్పు పరిశ్రమలో సుమారు 70 మంది మహిళా కార్మికులు పని చేస్తుంటారు. వీరంతా రోజూ రాత్రి 7గంటల సమయంలో ఫ్యాక్టరీ నుంచి ఆటోల్లో గ్రామాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో శనివారం పరిశ్రలో పనులు ముగించుకుని జట్లకొండూరు, గోవిందరాజపురం, మడమనూరు గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ఒకే ఆటోలో ఎక్కారు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఆటో పర్లపాడు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై గేదె అడ్డురావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న లక్ష్మీతేజ, జి.కల్పన, రమ, నీరజ, శ్రీవల్లి, ఏ పావని, పల్లవి, మునెమ్మ, కుమారమ్మ, అశ్విత, పల్లవిలతో పాటు ఆటో డ్రైవర్‌ పోలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని 108లో నెల్లూరుకు, కొందరిని మడమనూరు, మనుబోలు, గూడూరులోని ప్రైవేట్‌ వైద్యశాలలకు తరలించారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-06-26T04:09:39+05:30 IST