ఇద్దరిని బలిగొన్న మద్యంమత్తు

ABN , First Publish Date - 2022-06-03T13:55:50+05:30 IST

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ముగ్గురు వ్యక్తులు ఓ డ్రైవర్‌ చేసుకున్న చపాతీలను ఇవ్వాలని దౌర్జన్యానికి దిగారు. అతను ఇచ్చేందుకు

ఇద్దరిని బలిగొన్న మద్యంమత్తు

- చపాతీల కోసం దౌర్జన్యంఫ లారీతో తొక్కించిన డ్రైవర్‌

- ఇద్దరి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు 

- ఉత్తరాదికి చెందిన డ్రైవర్‌, క్లీనర్‌ అరెస్టు


చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ముగ్గురు వ్యక్తులు ఓ డ్రైవర్‌ చేసుకున్న చపాతీలను ఇవ్వాలని దౌర్జన్యానికి దిగారు. అతను ఇచ్చేందుకు సమ్మతించకపోవడంతో అది కాస్త ఘర్షణకు దారి తీయడంతో ఆగ్రహం చెందిన ఆ డ్రైవర్‌ లారీతో ముగ్గురినీ తొక్కించేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్‌ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా.. రెడ్‌హిల్‌ సమీపంలోని వడపెరుంబాక్కం ప్రాంతంలో లారీ పార్కింగ్‌ యార్డులున్నాయి. ఇందులో ఒక యార్డును రెడ్‌హిల్స్‌కు చెందిన రాజేష్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన కమల్‌ అలియాస్‌ కమలకన్నన్‌ (36), కుమరన్‌ (34) నవీన్‌ అనే ముగ్గురు యువకులు ఆ యార్డు వద్ద ఫుల్లుగా మద్యం తాగారు. ఆ తర్వాత యార్డులో ఆగివున్న ఓ లారీ వద్దకెళ్లి దాని డ్రైవర్‌ కల్యాణ్‌సింగ్‌, క్లీనర్‌ గిరీ్‌షకుమార్‌తో గొడవపడ్డారు. వారు తయారు చేసుకుంటున్న చపాతీలను తమకు ఇవ్వాలంటూ దౌర్జన్యానికి దిగారు. చపాతీలు కావాలంటే ఇస్తాను గానీ, దౌర్జన్యం చేస్తే కుదరదని డ్రైవర్‌ కల్యాణ్‌సింగ్‌  చెప్పాడు. ఈ వ్యవహారం కాస్తా గొడవకు దారి తీసింది. దాంతో కమల్‌ బృందం ఆ డ్రైవర్‌, క్లీనర్‌పై దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన డ్రైవర్‌ యార్డులో ఉన్న ఓ లారీని రివర్సులో నడుపుతూ ఆ ముగ్గురినీ ఢీకొట్టాడు. లారీ చక్రాల కింద పడి కమల్‌, కుమరన్‌ అక్కడికక్కడే మరణించగా, నవీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు.  అనంతరం డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆ యార్డులో ఉన్న ఐదు లారీలపై రాళ్లతో దాడి జరిపారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఆవడి డీసీపీ మహేష్‌, అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్లు మురుగేశన్‌, దక్షిణామూర్తి ఘటనా స్థలానికి వెళ్ళి విచారణ జరిపారు.  రెడ్‌హిల్స్‌ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఇదిలా ఉండగా హత్యకు గురైన కమల్‌, కుమరన్‌ స్నేహితులే. వారిద్దరూ కార్లను అద్దెకిచ్చే ట్రావెలర్స్‌ సంస్థ నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా వుండగా ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే దీనికి బాధ్యులైన డ్రైవర్‌, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2022-06-03T13:55:50+05:30 IST