vizianagaram: లోయలో పడ్డ వాహనం.. ఒకరు మృతి..41 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-29T14:00:10+05:30 IST

కొద్దిరోజుల కిందట వారంతా ఎంతో సంతోషంగా వివాహ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లికూతురు ఇంట ఏర్పాటు చేసిన భోజనాలకని పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఓ వాహనంలో

vizianagaram: లోయలో పడ్డ వాహనం.. ఒకరు మృతి..41 మందికి గాయాలు

విజయనగరం/సీతంపేట:  వారంతా ఎంతో సంతోషంగా వివాహ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లికూతురు ఇంట ఏర్పాటు చేసిన భోజనాలకని పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఓ వాహనంలో బయల్దేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగారు. ఇంతలో పెద్దకుదుపు. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో బోల్తాపడింది. దీంతో ఒకరు మృతి చెందగా, 41 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండలంలోని వజ్జాయిగూడలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్జాయిగూడలో అదే గ్రామానికి చెందిన అజయ్‌కుమార్‌కు ఇదే మండలం గులుమూరు వాసి రాజ్యలక్ష్మితో ఈనెలల 22న వివాహమైంది.


మంగళవారం పెళ్లికూతురు ఇంటిలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇందు కోసమని వజ్జాయిగూడ నుంచి పెళ్లికుమారుడు తరఫున 40 మంది బంధు వులు యర్నాగూడకు చెందిన పికప్‌ వ్యాన్‌లో గులుమూరు బయ ల్దేరారు. పెళ్లికూతురు కూడా ఇదే వాహనంలో ఉంది.  పెళ్లికుమారుడు బైక్‌పై వెనుక వస్తున్నాడు. అయితే కొద్దిదూరం వెళ్లిన తర్వాత వ్యాన్‌ అదుపు తప్పి 30 అడుగుల లోయలో బోల్తా పడింది. దీంతో బండిలో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఊహించని ఈ ఘటన నుంచి తేరుకోలేక పోయారు. గాయాలతో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇది గమనించిన స్థానికులు 108కి సమచారం ఇచ్చారు. దీంతో క్షతగాత్రుల్లో 19మందిని కుశిమి పీహెచ్‌సీకి, మిగిలిన వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళంలోని సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సవర మల్లమ్మ (60) మృతి చెందింది. ప్రస్తుతం క్షతగాత్రులందరూ పాలకొండలోనే చికిత్స పొందుతున్నారు. గిరిజన క్షతగాత్రులను ఐటీడీఏ డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.  బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై సీతంపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ కిశోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-29T14:00:10+05:30 IST