పండుగ ఆనందం ఆవిరి

ABN , First Publish Date - 2021-07-22T05:22:19+05:30 IST

బక్రీదు పండుగ కావడంతో పొట్టేళ్లు అమ్ముకుని ఆనందంగా ఇంటికి వస్తుండగా డ్రైవర్‌ నిద్రమత్తు రూపంలో మృత్యువు కబళించింది. నెల్లూరు శివార్లలోని కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం సంభవించిన ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు.

పండుగ ఆనందం ఆవిరి
నుజ్జునుజ్జయిన వాహనంలో ఇరుక్కుపోయిన కరిముల్లా మృతదేహం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, 9 మందికి గాయాలు


నెల్లూరు(క్రైం), జూలై 21: 

బక్రీదు పండుగ కావడంతో పొట్టేళ్లు అమ్ముకుని ఆనందంగా ఇంటికి వస్తుండగా డ్రైవర్‌ నిద్రమత్తు రూపంలో మృత్యువు కబళించింది. నెల్లూరు శివార్లలోని కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం సంభవించిన ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురానికి చెందిన పెద్ద కరిముల్లా(59) పొటేళ్ల వ్యాపారి. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొట్టేళ్లను కొనుగోలు చేసి వాటిని మేపుతూ చెన్నై మార్కెట్‌లో విక్రయిస్తుంటాడు. ఆయన దగ్గర తాళ్లూరు మండలానికి చెందిన వై కొండయ్య, షేక్‌ మౌలాలి, పీ చిన్యయ్య, కే రామాంజనేయులు, దర్శి మండలానికి చెందిన యూ కోటయ్య, ఏ శ్రీను, జీ శ్రీను, ఎం సుబ్బారాయులు, ఒంగోలులోని కర్నూలు రోడ్డుకు చెందిన షేక్‌ నాగూరువలీ పనిచేస్తుంటారు. వీరందరూ తరచూ పొటేళ్లను చెన్నై మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే బక్రీదు పండుగ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన గంగవరం గ్రామం నుంచి బొలెరో ట్రక్కులో పొటేళ్లను చెన్నై మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించారు. ఏడు పొట్టేళ్లు మిగిలి పోవడంతో వాటిని ట్రక్కులో వేసుకుని మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం తెల్లవారుజామున కనుపర్తిపాడు క్రాస్‌ రోడ్డు దాటి కొద్దిదూరం వెళ్లగానే వాహనం నడుపుతున్న శ్రీనివాసులు నిద్రమత్తులో ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో ట్రక్కులోని వారందరు రోడ్డుపై పడిపోగా డ్రైవర్‌ పక్కన కూర్చొని ఉన్న పెద్ద కరిముల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారందరికీ గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు వెంటనే 108, 100 నెంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న కరిముల్లా మృతదేహాన్ని బయటకు తీసి, క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయపడ్డ వారిని ఒంగోలుకు తీసుకెళ్లారు. సౌత్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-22T05:22:19+05:30 IST