మృత్యుశ‌క‌టాలు

ABN , First Publish Date - 2021-02-25T06:43:14+05:30 IST

ద్విచక్రవాహనంపై

మృత్యుశ‌క‌టాలు

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

రెడీమిక్స్‌ వాహనాలు ఢీ కొని వేర్వేరు చోట్ల ఇద్దరు..

ఆర్టీసీ బస్సు ఢీ కొని గర్భిణి...

డివైడర్‌ను ఢీ కొట్టి యువకుడి మృతి


రోడ్డెక్కాలంటేనే జంకే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనంపై నడిపే అక్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలనే సంకేతాలను ఇస్తున్నాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.


రెడీమిక్స్‌ వాహనం ఢీ.. విద్యార్థి మృతి

గచ్చిబౌలి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థిని  రెడీమిక్స్‌ వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మసీద్‌బండ గ్రామానికి చెందిన రాజుసాగర్‌ కుమారుడు యోగేష్‌(19) ఇంటర్‌ చదువుతున్నాడు. మంగళవారం ద్విచక్రవాహనంపై లింగంపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా మసీద్‌బండ వద్ద ఉన్న ఎస్‌ఎంఆర్‌ ప్లాంట్‌ వద్ద డ్రైవర్‌ రెడీమిక్స్‌ వాహనాన్ని అజాగ్రత్తగా ప్లాంట్‌లోకి మలుపు తిప్పుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన యోగేష్‌ ద్వి చక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. యోగేష్‌ తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. యోగేష్‌ బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో ప్లాంట్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.35 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని యజమానులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.  


ఉప్పల్‌లో మరొకరు...

ఉప్పల్‌,ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి) : రెడీమిక్స్‌ వాహనం ఢీ కొట్టడంతో ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో యువకుడు మృతి చెందాడు. వనపర్తిజిల్లా అమరచింత మండలం నాగర్‌కుడుముర్‌ గ్రామానికి చెందిన ముష్టిపల్లి నర్సన్న కుమారుడు నరేష్‌ (25) ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్నాడు. టాటూలు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన స్నేహితుడి బైక్‌ తీసుకొని అంబర్‌పేట మీదుగా ఉప్పల్‌కు బయలుదేరాడు. మోడ్రన్‌ బేకర్‌ వద్దకు రాగానే రాత్రి 12.30 ప్రాంతంలో క్రికెట్‌ స్టేడియం వైపు వేగంగా వెళ్తున్న కాంక్రీట్‌ రెడీమిక్స్‌ వాహనం ఢీకొట్టింది. నరేష్‌ లారీ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెండాడు. ఉప్పల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   


రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు... 

మియాపూర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : సిద్దిపేట జిల్లాకు చెందిన కరుణాకర్‌(22) ఉద్యోగం కోసం నగరానికి వచ్చి తెల్లాపూర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసే స్నేహితుడు మధుతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం మధుతో కలిసి కరుణాకర్‌ బైక్‌పై ప్రగతినగర్‌ నుంచి తెల్లాపూర్‌కు వెళ్తూ మియాపూర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌ వెనుక కూర్చున్న కరుణాకర్‌ హెల్మెట్‌ ధరించక పోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి గర్భిణి బలి

హిమాయత్‌నగర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండు నెలల గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ముషీరాబాద్‌ కుమ్మరిబస్తీకి చెందిన సతీష్‌గౌడ్‌ భార్య షాలినీ గర్భిణి. రాంనగర్‌ సెయింట్‌ స్కూల్‌లో టీచర్‌గా షాలీని పనిచేస్తున్నారు. షాలినీ, సతీష్‌ బుధవారం ఉదయం హైదర్‌గూడ ఫెర్నాండేజ్‌ ఆసుపత్రికి చెకప్‌ కోసం వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ముషీరాబాద్‌ డిపోకు చెందిన బస్సు హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద ఆ దంపతుల వాహనాన్ని ఢీకొట్టింది. ఇద్దరూ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో షాలినీ తీవ్రంగా గాయపడింది. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లేష్‌ అంబులెన్స్‌లో హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా దాదాపు అయిదు గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందింది. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరీదాబాద్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ కమలన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చందర్‌సింగ్‌ తెలిపారు.

Updated Date - 2021-02-25T06:43:14+05:30 IST