మద్యం మత్తు జీవితాలు చిత్తు

ABN , First Publish Date - 2021-02-28T05:51:59+05:30 IST

తాగిన మత్తులో యువత చిత్తవుతున్నారు.

మద్యం మత్తు జీవితాలు చిత్తు

డ్రంకెన్‌ డ్రైవ్‌తోనే అధిక రోడ్డు ప్రమాదాలు

ఒక్క జనవరి నెలలోనే సైబరాబాద్‌, రాచకొండలో 630 

115 మంది దుర్మరణం, 566 మందికి గాయాలు

సైబరాబాద్‌లో నెలలో 121 డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలు

26 మంది దుర్మరణం, 135 మందికి గాయాలు

ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో వెల్లడి


వనస్థలిపురం పరిధి బీఎన్‌ రెడ్డి నగర్‌లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపారు. రోడ్డు పక్కన ఉన్న డివైడర్లను ఎక్కించారు. బారికేడ్లుగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ దిమ్మెలను బలంగా ఢీ కొట్టారు. అక్కడి నుంచి వాహనం ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ఆ కారులో ఉన్న ముగ్గురిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిగిలిన ఇద్దరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తు ఓ కుటుంబాన్ని చిత్తు చేసింది. చెట్టంత కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మిగిలిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరు పోలీస్‌ కానిస్టేబుల్‌ కావడం గమనార్హం. 


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : తాగిన మత్తులో యువత చిత్తవుతున్నారు. తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్లే జరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది. దాంతో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతకు పోలీస్‌ ఉన్నతాధికారులు పెద్దపీట వేస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను కఠినతరం చేస్తూ అతివేగం, డ్రంకెన్‌ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కొందరి వాహనదారుల్లో మార్పు రావడం లేదు. మరి కొందరు పోకిరీలు, ఆకతాయిలు రోడ్ల మీద బైక్‌లపై సర్కస్‌ ఫీట్లు చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. 


అవగాహన కల్పించినా మారని తీరు

- ట్రాఫిక్‌ పోలీసులు రహదారి భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

- పాఠశాల, కళాశాలల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.  

- డ్రంకెన్‌ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

- తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మందుబాబులకు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తున్నారు. 

- నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వారి వివరాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

- నిర్లక్ష్యంగా, తాగిన మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి ఇతరుల మృతికి కారణమైన వారిపై 304 పార్ట్‌-2 ఐపీసీ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. 

అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా, ఎన్ని జరిమానాలు విధిస్తున్నా ఏ మాత్రం బాధ్యత లేకుండా, రహదారి భద్రతా నియమాలు పాటించకుండా అడ్డగోలుగా వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాల సంఖ్యను పెంచుతున్నారు. 

Updated Date - 2021-02-28T05:51:59+05:30 IST