నెత్తురోడిన రహదారులు!

ABN , First Publish Date - 2022-05-27T09:01:31+05:30 IST

జగదేవ్‌పూర్‌/ముదిగొండ/సత్తుపల్లి, మే 26: తెలంగాణ జిల్లాల రహదారులు రక్తసిక్తమయ్యాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో నలుగురు, ఖమ్మం జిల్లా

నెత్తురోడిన రహదారులు!

- సిద్దిపేట జిల్లాలో లారీ, ఆటో ఢీ.. నలుగురి మృతి

- ఖమ్మం జిల్లాలో రెండు ప్రమాదాలు.. ఐదుగురు మృత్యువాత

జగదేవ్‌పూర్‌/ముదిగొండ/సత్తుపల్లి, మే 26: తెలంగాణ జిల్లాల రహదారులు రక్తసిక్తమయ్యాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో నలుగురు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ముగ్గురు, సత్తుపల్లి మండలంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలివీ.. జగదేవ్‌పూర్‌కు చెందిన శ్రీగిరిపల్లి కనకయ్య ఆటోలో కొట్టాల కవిత, కొట్టాల లలిత, కొంతం చంద్రయ్య, కొంతం లక్ష్మి, కొంపల్లి కనకవ్వ.. తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ గ్రామానికి బయల్దేరారు. ఆటో జగదేవ్‌పూర్‌ నుంచి అలీరాజపేట్‌ కల్వర్ట్‌ సమీపానికి రాగానే హరియాణాకు చెందిన లారీ అతి వేగంగా ఎదురుగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ కనకయ్య(30), ఆటోలో ప్రయాణిస్తున్న కవిత(26) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. లలిత, చంద్రయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ, సత్తుపల్లి మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(55), ఆమె మనవడు హర్షవర్థన్‌(6) ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురంలో బంధువుల కర్మకాండలకు హాజరై తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. వీరితో పాటు సింగరేణి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చాగంటి రమేష్‌(36) ఖమ్మం రూరల్‌ కోదాడ క్రాస్‌ రోడ్డు వద్ద ఇదే ఆటో ఎక్కాడు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ముదిగొండ మండలం గోకినపల్లి వద్ద.. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారతమ్మ, హర్షవర్థన్‌, రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. భారతమ్మ కుమారుడు ఉపేందర్‌, మేనల్లుడు బొడ్డు ఉప్పలయ్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. మరో ఘటనలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తూ తల్లీ కొడుకులు మరణించారు. సత్తుపల్లిలోని కూతురి అత్తవారింట్లో నోముల కోసం వడాలి రంగరాజు(50), తల్లి వడాలి భానుమతి(65)తో కలిసి ఆంధ్రాలోని కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం నుంచి కారులో బయల్దేరారు. వారి కారును సత్తుపల్లి వేంసూర్‌ రోడ్‌లోని సింగరేణి మైన్‌ వద్ద లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రంగరాజు, భానుమతిని విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మిగిలిన క్షతగాత్రులకు సత్తుపల్లి, ఖమ్మం ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2022-05-27T09:01:31+05:30 IST