సామర్లకోట, మార్చి 27: సామర్లకోట ఓవర్‌బ్రిడ్జి పైన కాకినాడ రోడ్డు మలుపు వద్ద రెండు లారీలు ఢీకొనగా ఒకలారీ బ్రిడ్జి రక్షణ గోడమీదుగా దూసుకువెళ్లి గాలిలో వేలాడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా ముగ్గురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. లేకుంటే లారీ 30 అడుగుల కిందన భాగంలో కెనాల్ రోడ్డుపై బోల్తా పడిఉండేదని, భారీ ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాకినాడ నుంచి పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రైస్‌మిల్లుకు వెళ్తున్న లారీని కాకినాడ వెళ్తున్న టిప్పర్‌లారీ ఎదురుగా ఢీకొంది. ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా లారీ రక్షణగోడ మీదుగా దూసుకుపోయింది. లారీ యాజమాన్యం భారీ క్రేన్ సాయంతో ప్రమాదానికి గురై గాలిలో వేలాడుతున్న లారీని సురక్షింతగా రోడ్డుపైకి చేర్చారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.