రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-03T06:04:31+05:30 IST

నల్లగొండ జిల్లాలో బుధవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మృతదేహన్ని ట్రాక్టర్‌లో ఆసుపత్రికి తరలిస్తున్న కానిస్టేబుల్‌ నాగేందర్‌

 మరొకరికి తీవ్రగాయాలు

నల్లగొండ జిల్లాలో బుధవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

నాగార్జునసాగర్‌, డిసెంబరు 2: సాగర్‌లోని బుద్ధవనం  సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృ తి చెందారు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. దామ రచర్ల మండలం శ్రీనగర్‌ గ్రామానికి చెందిన మేకల ఎల్లయ్య(50) బైక్‌పై నాగార్జున సాగర్‌కు వస్తుండగా ఏపీ నుం చి హైదరాబాద్‌ వైపునకు వెళు తున్న పాల ట్యాంకర్‌ బుద్ధవనం సమీపంలోని మూలమలుపులో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.  కానిస్టేబుల్‌ నాగేందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని అటుగా వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను ఆపి ఎల్లయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేయత్నం చేశారు. 

ట్రాక్టర్‌ను నడిపి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన కానిస్టేబుల్‌

 ఈ క్రమంలో ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల దూరం రాగానే సాగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఎల్లయ్య మృతదేహం ఉన్న ట్రాక్టర్‌ను కానిస్టేబుల్‌ నాగేందర్‌ ఆపాడు. ఇంతలో డ్రైవర్‌ ట్రాక్టర్‌ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో కానిస్టేబుల్‌ నాగేందర్‌ ట్రాక్టర్‌ను నడుపుతూ ఎల్లయ్య మృతదేహాన్ని కమలా నెహ్రూ ఆస్పత్రి మార్చురీకి తరలించాడు. పాల ట్యాంకర్‌, ట్రాక్టర్‌, బైక్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సాగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో..

మిర్యాలగూడ రూరల్‌: లారీ నుంచి కిందపడి క్లీనర్‌ మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని గూడూరు శివారులో  జరిగింది. రూరల్‌ ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి హైదరాబాద్‌ లారీ వెళుతుండగా మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలోని శ్రీకర్‌ రైస్‌మిల్లు వద్ద డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో   వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ముందు లారీలో ఉన్న క్లీనర్‌ దీపక్‌(32) కిందపడి,  తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

బైక్‌ను కారు ఢీకొనడంతో..

దామరచర్ల:  బైకును  కారు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  మండలంలోని కొండ్రపోలు గ్రామంలో జరిగింది.  మిర్యాలగూడ మండలంలోని రాయినిపాలెం గ్రామానికి చెందిన మంద నాగయ్య, మరో వ్యక్తితో  కొండ్రపోలులో  శుభ కార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళుతున్న కారు వేగంతో ఢీకొట్టింది.   ఈప్రమాదంలో  తీవ్రంగా గాయపడిన నాగయ్యను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


వివాహిత బలవన్మరణం

మిర్యాలగూడ అర్బన్‌, డిసెంబరు 2: కుటుంబ వివాదాల నేపథ్యంలో పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన వివాహిత శిల్ప (28) బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా కేంద్రా నికి చెందిన శిల్పకు మిర్యాలగూడలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలుతో  ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరు నెలల పాప ఉంది. కుటుంబంలో వివాదాల నేపథ్యంలో మనస్తాపం చెందిన శిల్ప ఇంట్లో ఉరేసుకుంది. శిల్ప కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.



డబ్బులు వసూలు చేసిన విలేకరుల అరెస్టు

నిడమనూరు, డిసెంబరు 2: రైస్‌ మిల్లు యజమానులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన హాలియాకు చెందిన ముగ్గురు ఎలక్ర్టానిక్‌ మీడియా విలేకరులను బుధవారం అరెస్టు చేసి  రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ కొమ్మిరెడ్డి కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నర్సింహులగూడెం సమీపంలో ఉన్న హరికృష్ణ రైస్‌ మిల్లుకు గత నెల 28న  హాలియాకు చెందిన ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరులు నామని శివ, గోపిశెట్టి సైదులు, పాతనబోయిన సురేష్‌  వెళ్లారు. మిల్లులో పీడీఎస్‌ బియ్యం దందా చేస్తున్నారని యజమానులను బెదిరించి రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో మిల్లు యజమానులు భయపడి రూ.80 వేలు ఇచ్చారు. ఈ డబ్బుల పంపకంలో ముగ్గురికీ తేడాలు రావడంతో సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టారు. దీంతో  పోలీసులు మిల్లు యజమానులను ఆరా తీయగా డబ్బులు వసూలు చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. దీంతో మిల్లు మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ చేకూరి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన ప్రారంభించిన పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు.  నిందితులకు సహకరించిన నల్లగొండకు చెందిన రాంబాబు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 



పిల్లలతో తల్లి అదృశ్యం

చిట్యాల రూరల్‌, డిసెంబరు 2: కుటుంబంలో తగాదాతో  నేపథ్యంలో పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న గుండ్రాంపల్లికి చెందిన చెందిన బొడిగె మౌనికకు,  భర్త లింగస్వామికి తగాదా జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక  ఏడేళ్ల  కుమారుడు నిఖిల్‌, ఐదేళ్ల కుమార్తె శార్వానీలను తీసుకుని అదేరోజు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. తల్లీపిల్లల ఆచూకీ తెలియరానందున మౌనిక తల్లి కొండ వసంత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



విద్యుదాఘాతంతో గేదె మృతి

నార్కట్‌పల్లి, డిసెంబరు 2: మండలంలోని చిన్నతుమ్మలగూడెంలో బుధవారం విద్యుదాఘాతంతో గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు పడమటి మల్లారెడ్డికి చెందిన గేదె మేత మేస్తూ  వ్యవసాయబావి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. 





పత్తి లోడు ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా

కొండమల్లేపల్లి, డిసెంబరు 2: కొండమల్లేపల్లిలో పత్తి లోడు ట్రాక్టర్‌ ట్రాలీ బుధవారం బోల్తా పడింది.  నాంపల్లి మండలం గట్లమల్లేపల్లి గ్రామానికి చెందిన పచ్చిపాల కొండల్‌ ట్రాక్టర్‌లో పత్తిలోడును తరలిస్తుండగా కొండమల్లేపల్లి చౌరస్తా నుంచి హైదరాబాద్‌ రోడ్డుకు వెళ్లే మూలమలుపు వద్ద  ట్రాలీ బోల్తా పడింది. ఈ సమయంలో రోడ్డు జన సంచారం లేనందున త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

Updated Date - 2020-12-03T06:04:31+05:30 IST