ఎప్పటికి దారి..చేరేను..?

Published: Sat, 26 Mar 2022 00:15:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎప్పటికి దారి..చేరేను..?డొంకరోడ్డు వద్ద రహదారి మధ్యలో నిలిచిన పనులు

ఏపీఐఐసీ గ్రీన్‌ఫీల్డు రోడ్డు నిర్మాణానికి మళ్లీ అడ్డంకి

రేమల్లె-మీర్జాపురం డొంకరోడ్డు వద్ద పరిహారం సమస్య

డబ్బు ఇస్తేనే కుదురుతుందంటున్న భూమిని కోల్పోయిన రైతు

ఆగిపోయిన పనులు


హనుమాన్‌జంక్షన్‌, మార్చి 25 : ఏపీఐఐసీ మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ప్రధాన రాజమార్గం (గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు) నిర్మాణానికి మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. మీర్జాపురం-రేమల్లె డొంకరోడ్డు వద్ద కల్వర్టు నిర్మించాల్సి ఉండగా, సదరు భూమి యజమానికి ఇంతవరకు పరిహారం అందకపోవడంతో రహదారి పనులు నిలిచిపోయాయి. 

ఆది నుంచీ సమస్యలే..

భూసేకరణ పరిహారం విషయంలో పెండింగ్‌ పడిన పనులు గత జూలైలో తిరిగి చేపట్టారు. 3.9 కిలోమీటర్ల పొడవున సాగే ఈ మార్గంలో 900 మీటర్ల మేర భూ సేకరణలో ఏర్పడిన వివాదాలతో మొదట్లో పనులు నిలిచిపోయాయి. ఈ వివాదాన్ని గత మేలో జిల్లా అధికారులు పరిష్కరించడంతో జూలై నుంచి  పనులను చేపట్టగా, దాదాపు తుదిదశగా చేరాయి. అయితే, మీర్జాపురం-రేమల్లె డొంకరోడ్డు వద్ద కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఇక్కడే మీర్జాపురం రైతు వద్ద నాలుగు సెంట్ల స్థలాన్ని ఏపీఐఐసీ సేకరించింది. సదరు రైతుకు సెంటుకు రూ.85వేలు పరిహారం చెల్లించాల్సి ఉంది. రైతు నుంచి అంగీకారం తీసుకుని దాదాపు ఐదు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పరిహారం చెల్లించకపోవడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కల్వర్టు నిర్మాణం నిలిచిపోయింది. ఈ అభ్యంతరం లేకుంటే ఈ నెలాఖరు నాటికి రహదారి నిర్మాణం పూర్తిచేసి రాకపోకలను సాగించే పరిస్థితి ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. రహదారి నిర్మాణంతో పాటు రెండువైపులా పక్కా డ్రెయినేజీ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. కొన్నిచోట్ల రైతులు తమ భూముల్లోకి డ్రెయినేజీ చొచ్చుకు వచ్చిందని అభ్యంతరాలు చెప్పడంతో ఆ పని కూడా నత్తనడకన సాగుతోంది. 

ఇదే ప్రధాన మార్గం

3.9 కిలోమీటర్ల పొడవునా 100 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టిన ఈ రహదారికి ఏపీఐఐసీ రూ.15.2 కోట్లను కేటాయించింది. దీనిని పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డు రోడ్డుగా అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. మల్లవల్లిలో ఏపీఐఐసీ చేపట్టిన మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌, మెగా పుడ్‌ పార్క్‌కు అనుసంధానంగా రాజమార్గంగా అభివృద్ధి చేయడానికి మూడేళ్ల క్రితం నిర్మాణానికి పూనుకున్నారు. మచిలీపట్నం-నూజివీడు-కల్లూరు రహదారిపై నుంచి నేరుగా ఇండస్ట్రియల్‌ పార్కుకు చేరుకోవడానికి వీలుగా ఉండే ఈ రహదారి నిర్మాణానికి 39 ఎకరాలు సేకరించారు. ఇటు హనుమాన్‌ జంక్షన్‌కు 5 కిలోమీటర్లు, అటు నూజివీడుకు 13 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం-నూజివీడు-కల్లూరు రహదారి ఉంది. మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్కులో ఉత్పత్తిని ప్రారంభించిన కొన్ని పరిశ్రమలతో పాటు రానున్న  పరిశ్రమలకు ఈ రహదారే ప్రధానం కానుంది.


పరిహారం ఇస్తేనే పనులు

రహదారి నిర్మాణంలో భాగంగా డ్రెయినేజీ కోసం ఐదు నెలల కిందట ఐదు సెంట్ల భూమిని తీసుకుంటున్నట్టు సంతకాలు తీసుకున్నారు. నేటికీ పరిహారం సొమ్ము చెల్లించలేదు. అందువల్లే నేను అభ్యంతరం పెట్టాను. గతంలో సెంటు భూమి రోడ్డులో పోయింది. తరువాత తీసుకున్న ఐదు సెంట్ల భూమికి డబ్బు ఇవ్వలేదు. పంట పొలాలకు వెళ్లే పైపులైన్లు కూడా కల్వర్టు కింద ఉన్నాయి. పరిహారం సొమ్ము అందిన తరువాతే నా భూమిని అప్పగిస్తాను. అప్పటి వరకు పనులు చేయడానికి వీల్లేదు.                         - ఓలేటి ఉదయ భాస్కర్‌, మీర్జాపురం


త్వరలోనే రహదారిని ప్రారంభిస్తాం

ఏపీఐఐసీ ప్రధాన రాజమార్గం నిర్మాణం అతి కొద్దిరోజుల్లో పూర్తిచేస్తాం. రేమల్లె-మీర్జాపురం డొంకరోడ్డు వద్ద కల్వర్టు నిర్మాణానికి సంబంధించి భూ సమస్య ఉంది. రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. డ్రెయినేజీ నిర్మాణంలో కూడా చిన్నచిన్న భూ సమస్యలు ఉన్నాయి.  - సత్యనారాయణ, ఏపీఐఐసీ ఏఈ


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.