ఇంకెన్నాళ్లకు?

ABN , First Publish Date - 2020-11-25T06:22:27+05:30 IST

టెండర్లు పిలిచారు. హడావిడిగా సాయిల్‌ టెస్ట్‌ పనులు జరిగాయి. జంగిల్‌ క్లియరెన్స్‌ జరుగుతున్నాయి. కానీ అసలు పనులు మాత్రం మొదలు కావటం లేదు.

ఇంకెన్నాళ్లకు?

కాజ - గుండుగొలను ప్యాకేజీ-3, 4 పనులెప్పుడు?  
ఫైనాన్స్‌ క్లోజర్స్‌ ఇవ్వని కాంట్రాక్టు సంస్థలు 

అపాయింట్‌  డేట్‌ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం 

ఒప్పందం జరిగి మూడు నెలలు 

అయినా వీడని స్తబ్దత 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : టెండర్లు పిలిచారు. హడావిడిగా సాయిల్‌ టెస్ట్‌ పనులు జరిగాయి. జంగిల్‌ క్లియరెన్స్‌ జరుగుతున్నాయి. కానీ అసలు పనులు మాత్రం మొదలు కావటం లేదు. ఇదీ.. కాజ - గుండుగొలను ప్యాకేజీ-3, 4ల ప్రస్తుత పరిస్థితి. టెండర్లు ఖరారైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, కాంట్రాక్టు సంస్థలకు నడుమ అగ్రిమెంట్‌ జరిగి కూడా మూడు నెలలు దాటింది. ఇప్పటి వరకు ప్యాకేజీలోని పనులు మాత్రం జరగటం లేదు. అగ్రిమెంట్‌ జరిగినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు అపాయింట్‌ డేట్‌ ఇవ్వకపోవటం గమనార్హం. అయితే దీనికి తమ నుంచి సమస్యేమీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాంట్రాక్టు సంస్థలు ప్రాజెక్టు ఆర్థిక వనరుల నివేదిక ఇవ్వనందునే అపాయింట్‌ డేట్‌ ఇవ్వలేదన్నట్టు చెబుతున్నాయి. ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్టును పొందినపుడు కాంట్రాక్టు సంస్థలు వర్క్‌ టెండర్లను దక్కించుకున్నా, అగ్రిమెంట్‌ చేసుకుంటాయి. అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్‌ క్లోజర్స్‌ (ఆర్థిక వనరుల నివేదిక)ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కాజ - గుండుగొలను ప్యాకేజీ-3, 4 పనుల్లో జరగలేదు. ఈ ప్యాకేజీలో విజయవాడ బైపాస్‌, చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ఆరు వరసల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కాంట్రాక్టును మెగా సంస్థ దక్కించుకుంది. డిజైన్స్‌, అలైన్‌మెంట్‌ సిద్ధం చేసింది. సాయిల్‌ టెస్ట్‌ పనులు కూడా చేపట్టింది. ప్రాజెక్టు ఏరియాలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు కూడా చేపడుతోంది. కానీ అసలైన ప్రాజెక్టు పనులు మొదలు కాలేదు. మెగా సంస్థ ఫైనాన్స్‌ క్లోజర్స్‌ ఎందుకు ఇవ్వలేదన్నది అంతుచిక్కటం లేదు. క్షేత్రస్థాయిలో ఇతర పనులను చురుగ్గానే చేస్తున్నప్పటికీ, ఫైనాన్షియల్‌ క్లోజర్స్‌ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందన్నది మిస్టరీగా మారింది. అలాగే ఈ ప్యాకేజీ-4కు సంబంధించి గొల్లపూడి దిగువ కృష్ణానదిపై ఆరు వరసల బ్రిడ్జి నిర్మాణంతో పాటు, చిన కాకాని వరకు ఆరు వరసల రోడ్డు నిర్మాణం పనులను నవయుగ - అదాని జాయింట్‌ వెంచర్‌ సంస్థ టెండర్లను దక్కించుకుంది. టెండర్‌ను దక్కించుకున్న వెంటనే ఈ సంస్థ కూడా చాలా వేగంగా డిజైన్స్‌, అలైన్‌మెంట్‌ పనులను పూర్తి చేసింది. సాయిల్‌ టెస్ట్‌ పనులతో పాటు.. నదిలో ఉండే చిన్న చిన్న ద్వీపాలలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు కూడా చేపడుతోంది. కానీ ఫైనాన్స్‌ క్లోజర్స్‌ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అపాయింట్‌ డేట్‌ ఇస్తే కానీ కాంట్రాక్టు సంస్థలు పనులు ప్రారంభించటానికి లేదు. కాంట్రాక్టు సంస్థలు ఫైనాన్స్‌ క్లోజర్స్‌ ఇస్తేనే అపాయింట్‌ డేట్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కాంట్రాక్టు సంస్థలు ఫైనాన్స్‌ క్లోజర్స్‌ ఇచ్చే విషయంలో కొంత జాప్యం జరిగినా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేరుతో ఉద్దేశపూర్వక జాప్యం చేస్తుండవచ్చన్న వాదనలు కూడా వస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలకు మొబలైజేషన్‌ అడ్వాన్సులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయంలోనూ జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. 

Updated Date - 2020-11-25T06:22:27+05:30 IST