జాతీయ రహదారి మరమ్మతు ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-27T03:38:10+05:30 IST

అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 161 జాతీయ రహదారి మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అందోలు మండలం సంగుపేట నుంచి అందోలు, జోగిపేట మీదుగా నేరడిగుంట వరకు 12.71 కిలోమీటర్లమేర రహదారి మోకాలి లోతు గుంతలతో ప్రాణాంతకంగా మారింది. ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొన్నది.

జాతీయ రహదారి మరమ్మతు ప్రారంభం
అందోలులో పాత రోడ్డును తొలగిస్తున్న దృశ్యం

అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో తొలుత పనులు


జోగిపేట, జూలై 26: అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 161 జాతీయ రహదారి మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అందోలు మండలం సంగుపేట నుంచి అందోలు, జోగిపేట మీదుగా నేరడిగుంట వరకు 12.71 కిలోమీటర్లమేర రహదారి మోకాలి లోతు గుంతలతో ప్రాణాంతకంగా మారింది. ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొన్నది. ఈ రోడ్డు దుస్థితిపై పలుమార్లు ఆంధ్రజ్యోతితో పాటు మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎంపీ బీబీపాటిల్‌ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ రోడ్డు మరమ్మతుకు రూ. 11 కోట్లు నిధులను సంవత్సరం క్రితం మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. చివరకు మంత్రి, ఎమ్మెల్యే చొరవతో ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న సంస్థ ఈ రోడ్డుకు మరమ్మతులు చేయడానికి ముందుకువచ్చి టెండర్‌ దాఖలు చేసింది. కానీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో శనివారం జోగిపేటలో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాలొల్గన్న ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ కాంట్రాక్టు సంస్థ బాధ్యులతో మాట్లాడి పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఆదివారం అందోలులోని ఆర్డీవో కార్యాలయం దగ్గరి నుంచి సాయంత్రం పనులు ప్రారంభించారు. తొలుత అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 2.5 కిలోమీటర్లమేర రోడ్డుకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఇదే సమయంలో రోడ్డుకు ఇరువైపులా సైడ్‌ డ్రెయిన్స్‌ నిర్మించనున్నారు. ఇందుకోసం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేసింది.

Updated Date - 2021-07-27T03:38:10+05:30 IST