‘దారి’ద్య్రం

ABN , First Publish Date - 2021-07-27T04:21:41+05:30 IST

ఓ వైపు కంకర తేలిన రోడ్లు.. మరో వైపు గుంతల రోడ్లు.. ఇంకో వైపు బురద రోడ్లు.. జిల్లాల్లో ఏ దారిలో వెళ్లినా రోడ్ల పరిస్థితి ఇంతే. పల్లె, పట్టణం అనే తేడా లేదు. రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయి. ఇటీవలే కురిసిన వర్షానికి మరింత అధ్వానంగా తయారయ్యాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటూ నిర్వహించినా ఈ రోడ్ల దుస్థితి మారలేదు. గతుకుల రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇవే రోడ్లపై నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వెళ్తున్నా వాటి మరమ్మతును మాత్రం పట్టించుకోవడం లేదు.

‘దారి’ద్య్రం
చేగుంట- గజ్వేల్‌ రోడ్డులో ఏర్పడిన గుంతలు

ప్రమాదకరంగా మారిన రోడ్లు 

దారులన్నీ గుంతలమయం, బురదమయం

గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం


ఓ వైపు కంకర తేలిన రోడ్లు.. మరో వైపు గుంతల రోడ్లు.. ఇంకో వైపు బురద రోడ్లు.. జిల్లాల్లో ఏ దారిలో వెళ్లినా రోడ్ల పరిస్థితి ఇంతే. పల్లె, పట్టణం అనే తేడా లేదు. రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయి. ఇటీవలే కురిసిన వర్షానికి మరింత అధ్వానంగా తయారయ్యాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటూ నిర్వహించినా ఈ రోడ్ల దుస్థితి మారలేదు. గతుకుల రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇవే రోడ్లపై నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వెళ్తున్నా వాటి మరమ్మతును మాత్రం పట్టించుకోవడం లేదు.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 26 : మెదక్‌ జిల్లాలో రహదారులు గుంతలమయంగా, బురదమయంగా మారాయి. ముందే అంతంత మాత్రంగానే ఉన్న రోడ్ల పరిస్థితి ఇటీవలే కురిసిన వర్షాలకు మరింత దారుణంగా తయారైంది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను రెండు లేన్ల దారిగా అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఉన్న రోడ్లను బాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. గుంతల రోడ్లపైనే పడుతూ.. లేస్తూ ప్రయాణం చేయడం నేతలకు సరదాగా మారిందని జనం సెటైర్లు వేస్తున్నారు.


పట్టణ ప్రాంతాల్లో అడుగుకో గుంత 

గ్రామీణ రోడ్లతో పట్టణ ప్రాంత రోడ్లు పరిస్థితి అడుగుకో గుంత అన్నట్లు తయారయ్యాయి. పేరుకు పురపాలక సంఘాలైన ఇక్కడ రహదారుల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో రోడ్ల అందం చూస్తే మూర్చపోవలసిందే. ఇక అంతర్గత రోడ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తా నుంచి చమాన్‌ వైపు వెళ్లే రోడ్లు గుంతలతో దరిద్రంగా మారాయి. పాత బస్టాండ్‌, కిల్లా రోడ్డు, సాయినగర్‌, ఐసీఐసీఐ బ్యాంకు రోడ్లు కూడ గుంతలమయంగా మారాయి. రామాయంపేట పట్టణంలోని వెంకటేశ్వరకాలనీ రోడ్డు వర్షానికి కయ్యలు ఏర్పడింది. నర్సాపూర్‌ పట్టణంలోనూ పలు చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా మారింది.


మెదక్‌ జిల్లాలో గ్రామీణ రోడ్ల దుస్థితి..

-మెదక్‌ నుంచి మగ్దుంపూర్‌కు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని కంకర తేలింది. 

-చేగుంట- గజ్వేల్‌ రోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. 

-టేక్మాల్‌ నుంచి ఎల్లుపల్లి గ్రామాలకు వెళ్లే ఏడు కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారింది. 

-చిన్నశంకరంపేట నుంచి జంగరాయికి వెళ్లే మూడు కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి కూడ ఇదే విదంగా ఉంది.

-చిల్‌పచెడ్‌ మండలం బండపోతంగల్‌, ఫైజాబాద్‌, సీలంపల్లి నుంచి కౌడిపల్లి వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. 

-హవేళీఘనపూర్‌ మండలం పోచమ్మరాల్‌, జక్కన్నపేట రోడ్లు అధ్వానంగా మారాయి. 

-మెదక్‌ - జోగిపేట రహదారితో పాటు కొల్చారం నుంచి వెల్దుర్తికి వెళ్లే రహదారుల పై బీటీ లేచిపోయి కంకర తేలింది. 


సంగారెడ్డి జిల్లాలో అంతే సంగతి!

నాగల్‌గిద్ద : ఇటీవల కురిసిన వర్షాలకు నారాయణఖేడ్‌ నుంచి మండల కేంద్రమైన నాగల్‌గిద్దకు వెళ్లే రోడ్డు పూసల్‌పాడ్‌ వద్ద దారుణంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసిన గుంతలు వర్షం నీరు నిలిచి ఎక్కడ గుంతలు ఉన్నాయో  ఏర్పడడం లేదు.  


గుంతలమయంగా పారిశ్రామిక, గ్రామీణ రహదారులు

జిన్నారం : జిన్నారం మండలం బొల్లారం, గడ్డపోతారం, నల్తూరు ప్రాంతంలోని పలు రహదారులు గుంతల మయంగా మారాయి. పారిశ్రామికవాడలోనూ రోడ్లు భారీ గుంతలు పడి ప్రయాణాలకు ఇబ్బందిగా మారాయి. నల్తూరు, కిష్టయ్యపల్లి రోడ్డు ప్రమాదకరంగా మారింది.


కోహీర్‌లో దెబ్బతిన్న అంతర్గత రోడ్లు 

కోహీర్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 65 జాతీయ రహదారి నుంచి మద్రి వరకు 3 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడైపోయింది. పిచేర్యాగడి నుంచి పిచేర్యాగడి తండా వరకు ఉన్న 10 కిలోమీటర్ల రోడ్డు దరిద్రంగా తయారైంది. అలాగే కోహీర్‌ నుంచి బడంపేట పేట గ్రామం వరకు ఉన్న 8 కిలోమీటర్ల రోడ్లు కూడా అధ్వానంగా మారింది. 


అంతర్‌రాష్ట్ర రోడ్డు అధ్వానం

కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నుంచి నాగూర్‌.కె గ్రామం మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే అంతర్‌రాష్ట్ర  రోడ్డు అధ్వానంగా తయారైంది. నాలుగేళ్లుగా ఈ రోడ్డు గుంతలతో పాటు బురదమయంగా మారింది.


సిద్దిపేట జిల్లాలో

సిద్దిపేటసిటీ, జూలై 26: వారం రోజులుగా కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని రహదారులు, మండలాల రోడ్లు, గ్రామాల్లోని సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల రోడ్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రిజర్వాయర్లు ఉన్నచోట అలాగే బ్రిడ్జి నిర్మాణాలు ఉన్నచోట రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వెళ్లే రహదారిలో అక్కడక్కడ గుంతలు పడ్డాయి. దుద్దెడ నుంచి చేర్యాల వెళ్లే రోడ్డు పరిస్థితి వీధి రోడ్ల కంటే దారుణంగా ఉంది.  ఇక మండలాల కేంద్రాలకు వెళ్లే తారురోడ్లు, గ్రామాల్లోని సీసీరోడ్లు కొన్ని ప్రాంతాల్లో గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లను, వాటిని బాగుచేయించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. 

Updated Date - 2021-07-27T04:21:41+05:30 IST