Advertisement

ధ్వంసమైన రోడ్లు

Nov 29 2020 @ 22:16PM
ధ్వంసమైన బల్లికురవ- మార్టూరు రహదారి

240 కి.మీ దెబ్బతిన్నట్లు 

యంత్రాంగం అంచనా

మరమ్మతులకు రూ 65.70 కోట్లు 

అవసరమని గుర్తింపు

వాస్తవ నష్టం అంతకు 

నాలుగురేట్లుపైనే 

ఒంగోలు,నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిన నివర్‌ తుఫాన్‌ రోడ్లను దారుణంగా దెబ్బతీసింది. అనేక ప్రాంతాల్లో జాతీయర రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని చిన్న, పెద్ద రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో రోడ్ల అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. కనీస మరమ్మతులు కూడా కరువయ్యాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల అవి మరింత అధ్వానంగా తయారయ్యాయి. కొన్నిచోట్ల మోకాలి లోతు గోతులు పడగా, మరికొన్ని చోట్ల తారుమొత్తం లేచి రాళ్లు బయటపడ్డాయి. ఇంకొన్ని చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు సైతం బురదమయంగా మారాయి.  

అంచనాల్లో కొంతే!

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో 34.4కిలో మీటర్లు, పంచాయతీరాజ్‌ పరిధిలో 206.12 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. వాటి తాత్కాలిక మరమ్మతులకు  సుమారు రూ. 4 కోట్లు, శాశ్వత మరమ్మతులకు దాదాపు రూ.65.70 కోట్లు అవసరంగా గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థిని పరిశీలిస్తే అధికారుల అంచనాకు నాలుగింతలు అధికంగా నష్టం జరిగినట్లు స్పష్టమవుతోంది.  అధిక వర్షం కురిసిన కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులైన కందుకూరు నుంచి చుట్టుగుంట మీదుగా ఉలవపాడు జాతీయ రహదారి, కరేడు- టెంకాయచెట్లపాలెం మీదుగా ఉలవపాడు, పొకూరు నుంచి వీఆర్‌కోట మీదుగా రాళ్లపాడు రిజర్వాయర్‌, కందుకూరు-పందలపాడు, గుడ్లూరు-సీతారాంపురం, టంగుటూరు నుంచి కొండపి, మర్రిపూడి నుంచి పొదిలి, ఓవీరోడ్డు సింగరాయకొండ-కందుకూరురోడ్లతోపాటు అనేక రహదారులు దెబ్బతిన్నాయి. దర్శి ప్రాంతంలో దర్శి నుంచి నలువైపులా ఉండే అన్ని రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దర్శి-అద్దంకిరోడ్డుతోపాటు, దర్శి-పొదిలి, రాజంపల్లి-బీకే పాడు, కురిచేడు-దొనకొండ, పొదిలి- దొనకొండ, తాళ్లూరు- తూర్పుగంగవరం తదితర రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. అద్దంకి నియోజకవర్గంలో కొప్పెరపాడు-వినుకొండ, బల్లికురవ-మార్టూరు, సంతమాగులూరు-కొప్పెరపాలెం, అద్దంకి-ముండ్లమూరు తదితర ప్రధాన రోడ్లు అన్నీ ఛిద్రమమయ్యాయి. ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. నాగులుప్పలపాడు మండలంలోని పలు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లు  దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులు చూస్తే దోర్నాల- కర్నూలు, కందుకూరు-కనిగిరి, ఒంగోలు- పొదిలి తదితర పలు రోడ్లు అనేక చోట్ల దారుణంగా కనిపిస్తున్నాయి. ఇక వివిధ మండలాల్లోని గ్రామాల మధ్య ఉండే అనేక పంచాయతీ రాజ్‌ రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో వాటిపై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీటికి తక్షణ మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరోసారి వర్షాలు కురిస్తే జిల్లాలో ఎక్కడిక్కడ రవాణా వ్యవస్థ స్తంభించే పరిస్థితి ఏర్పడనుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.