దారులిలా.. దాటేదెలా?

ABN , First Publish Date - 2022-06-20T06:44:04+05:30 IST

తిరుపతి జిల్లాలో ప్రధాన రహదారులు 2019 నుంచి ఇటీవలి వరకూ నిర్వహణకు నోచుకోలేదు.

దారులిలా.. దాటేదెలా?

గత ఏడాది కురిసిన వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రహదారులు

తారురోడ్లు కాస్తా మట్టిరోడ్లయ్యాయి

 

తిరుపతి జిల్లాలో ప్రధాన రహదారులు 2019 నుంచి ఇటీవలి వరకూ నిర్వహణకు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు దారుణంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు దాటే చోట్ల కల్వర్టులు, చిన్నపాటి బ్రిడ్జిల నుంచి భారీ బ్రిడ్జిల వరకు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గోతులను చాలావరకూ ఇటీవల పూడ్చి.. నిర్వహణ పనులు చేపట్టారు. ఇంకా కొన్ని రోడ్లు అలాగే దుస్థితిలోనే ఉన్నాయి. \


- తిరుపతి, ఆంధ్రజ్యోతి


గత ఏడాది వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టులు, బ్రిడ్జిల పునర్నిర్మాణం జరగలేదు. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రోడ్లపైనే ఇప్పటికీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మరోసారి భారీ వర్షాలొచ్చి..  నీటి ప్రవాహాలు మొదలైతే ఈ రోడ్లన్నీ తట్టుకుని నిలిచే పరిస్థితి లేదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఒకప్పుడు తారు పూతతో కళకళలాడుతూ కనిపించిన ప్రధాన రోడ్లు ఇప్పుడు మట్టి రోడ్లుగా రూపాంతరం చెంది జిల్లా తిరోగమనానికి అద్దం పడుతున్నాయి. 


గత ఏడాది నవంబరు 20న కురిసిన భారీ వర్షాలకు తిరుచానూరు - పాడిపేట మార్గంలో స్వర్ణముఖి నదిపై వంతెన కొట్టుకు పోయింది. వంతెన స్థానంలో మట్టి పేర్చి తాత్కాలికంగా వాహనాల రాకపోకలకు వినియోగిస్తున్నారు. దీనికితోడు పక్కన ప్రత్యామ్నాయంగా మరో మట్టి రోడ్డు నిర్మించారు. వర్షాలు కురిసి.. నీటి ప్రవాహం మొదలైతే ఈ రెండు రోడ్లు కూడా కొట్టుకు పోవడం ఖాయం. ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఇప్పటి దాకా వంతెన నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు.


నాయుడుపేట - అన్నమేడు రోడ్డు భారీ గోతులతో, తారు పొరలు పొరలుగా లేచిపోయి దారుణంగా ఉంది. మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోక తీవ్ర దుస్థితిలో ఉంది.


నాయుడుపేట నుంచి మేనకూరు సెజ్‌ వరకూ ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. అధిక టన్నేజీతో కూడిన భారీ వాహనాల రాకపోకల కారణంగా మూడేళ్ల నుంచి రోడ్డు బాగా దెబ్బతింది. మరమ్మతులు లేకపోవడంతో వాహనదారులకు ప్రయాణం పరీక్షగా మారుతోంది.


రామచంద్రాపురం మండలంలోని సుప్రసిద్ధ రాయలచెరువు నుంచి గత ఏడాది నవంబరులో నీరు ఉధృతంగా ప్రవహించడంతో నెన్నూరు - వినాయకపురం నడుమ ఆర్‌అండ్‌బీ రోడ్డు వంతెన కొట్టుకుపోయింది. దీంతో తాత్కాలికంగా సిమెంట్‌ పైపులు వేసి మట్టి రోడ్డు వేశారు. ఈ వాగులో ఎప్పుడు నీటి ఉధృతి పెరిగినా రోడ్డు కొట్టుకుపోవడం ఖాయం. ఎనిమిది నెలలుగా వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.


చంద్రగిరి-తిరుపతి రోడ్డులో ముక్కోటి సమీపాన స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సేఫ్టీ దిమ్మెలు కూలిపోయాయి. ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ వాటిని తిరిగి ఏర్పాటు చేయలేదు. దీంతో రోజుకు వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది.


తిరుపతి నుంచి వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం వెళ్లే రోడ్డులో స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి గత ఏడాది నవంబరులో సంభవించిన భారీ వర్షాలకు కూలిపోయింది. పక్కనే నదిలో మట్టితో తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన తారు రోడ్డులో సుఖప్రదమైన ప్రయాణం సాగించాల్సిన వాహనదారులు ఇపుడిలా దుమ్ము రేపుతున్న మట్టిరోడ్డుపై అగచాట్ల ప్రయాణం చేస్తున్నారు.


తిరుపతి నగరం శ్రీనివాస కళ్యాణ మండపాల నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయానికి వెళ్లే తారు రోడ్డు గత ఏడాది నవంబరు వర్షాలకు దారుణంగా దెబ్బతింది. తారు పూత కొట్టుకుపోగా కంకర తేలిపోయి వాహనదారులకు చుక్కలు చూపిస్తోందీ రోడ్డు.







Updated Date - 2022-06-20T06:44:04+05:30 IST