రహదారులు ధ్వంసం

ABN , First Publish Date - 2021-09-15T04:31:32+05:30 IST

చింతలపూడి – ఏలూరు రోడ్డుపై పలు చోట్ల గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి.

రహదారులు ధ్వంసం
చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న రోడ్డు

గోతుల్లో ప్రయాణం ప్రమాదకరం


చింతలపూడి, సెప్టెంబరు 14: చింతలపూడి – ఏలూరు రోడ్డుపై పలు చోట్ల గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి సైతం వాహనదారులు భయపడుతున్నారు. అడుగడుగునా గోతులు, ధ్వం సమైన రోడ్లతో వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. వర్షం వస్తే గోతులలో నీరు చేరి మరింత అధ్వానంగా మారుతున్నాయి. పట్టణ పరిధిలో ప్రధాన కూడళ్లలో సైతం భారీ గోతులు పడినా అధికారులు కనీసం పూడ్చే ఆలోచన కూడా చేయడం లేదు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, ప్రభుత్వాసుత్రి, పాత బస్టాండ్‌ సమీపంలో, మారుతీనగర్‌లో ప్రధాన రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వాహనాలపై వెళ్లేవారు గోతుల్లో పడి గాయాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. వాహనాలు మరమ్మతు షెడ్‌కు వెళుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రహదారుపై గోతులు పూడ్చి ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 


కామవరపుకోట: కామవరపుకోట – అంకాలంపాడు రహదారి గోతుల తో అధ్వానంగా మారింది. అడుగుకో మడుగు, గజానికో గొయ్యిలో రాకపో కలు ఎలా సాగించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. తక్షణమే అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


దేవరపల్లి: గోతుల రహదారిలో గమ్యం చేరుకుంటామో.. మధ్యలో ఆస్పత్రికి వెళతామో తెలియని పరిస్థితి. యర్నగూడెం, కొయ్యలగూడెం రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతు న్నారు. యర్నగూడెం నుంచి చిన్నాయిగూడెం, యాదవోలు, పొంగుటూరు నుంచి కొయ్యలగూడెం రహదారి పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా పరిణమించింది. గోతుల్లో వర్షపునీరు చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో నీరు నిల్వ ఉండడంతో గోతులు కనపడక ఆ గోతుల్లో పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మోటర్‌ సైకిల్‌పై వెళ్లే వాహనదారుల ఇబ్బందులు వర్ణనాతీతం. గాయాలు కాకుండా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపై గోతులను పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ యాదవోలు, చిన్నాయిగూడెం, సంగాయి గూడెం, పొంగుటూరు గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-09-15T04:31:32+05:30 IST