మీరు వేసిన రోడ్లు.. ఇవేనా సారూ!?

Nov 10 2021 @ 23:21PM
నెల్లూరు నగర పరిధిలోని డైకస్‌ రోడ్డు కూడలి నుంచి కొత్తూరు వరకు రోడ్డు దుస్థితి

అడుగుకొక గుంత.. రోడ్లన్నీ రోత

జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న రహదారులు

రెండేళ్లుగా అభివృద్ధికి పైసా విదిల్చితే ఒట్టు

కేంద్ర భాగస్వామ్య రోడ్ల పరిస్థితీ అంతే!

ప్రయాణమంటే హడలుతున్న ప్రజలు


‘గత ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టనందు వల్లే అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వర్షాలు కురవడంతో రోడ్ల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రూ.2205 కోట్లతో 8,970 కి.మీ మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి సుంకంగా గత ప్రభుత్వం విధించిన దానికంటే అధికంగా విధించాల్సి వచ్చింది’... ఇదీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. అయితే ప్రభుత్వం చెబుతున్న అన్ని వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. వందలు కాదు కదా.. కనీసం పదుల కిలోమీటర్లు కూడా జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరగలేదు. 


నెల్లూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. అడుగడుగునా  గుంతలు, కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్నదారులు, మరికొన్ని చోట్ల అసలు రోడ్లే లేక అవస్థలు. ఆ వీధి రోడ్డు.. ఈ ఊరి రోడ్డు అన్న తేడా లేదు. ఒక్కసారి దెబ్బతిందంటే మళ్లీ ఆ రోడ్డు బాగుపడటం కష్టమే అన్న విధంగా జిల్లాలో  పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నన ప్యాచ వర్కులు వేయడంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది.  ప్యాచ వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు రెండేళ్లుగా బిల్లులు అందలేదు. దీంతో కొత్తగా పనులు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా గతేడాది నివర్‌ తుఫాన దెబ్బకు పాడైన రోడ్ల వివరాలను జిల్లా నుంచి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో 46 ప్రధాన రోడ్ల మరమ్మతులకు రూ.88.28 కోట్లు మంజూరు అయ్యాయి. అదేవిధంగా బాగా దెబ్బతిన్న రాష్ట్ర రహదారులను కూడా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఒక్క రోడ్డూ పూర్తి కాలేదు.

 

ప్రభుత్వంపై నమ్మకం లేక..


జిల్లాలో దెబ్బతిన్న మేజర్‌ డిసి్ట్రక్ట్‌ రోడ్లు (ఎండీఆర్‌), రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ఏప్రిల్‌ నెలలో ఆర్‌ అండ్‌ బీ అధికారులు టెండర్లు పిలిచారు. 21 ఎండీఆర్‌ రోడ్లకు రూ.87 కోట్లతో, 11 రాష్ట్ర రహదారులకు రూ.75 కోట్లతో టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌ నుంచి మూడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు. ఇక చేసేది లేక నాలుగో సారి పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏడాది పాటు టెండర్లు ఎవరూ వేయకపోవడంతో ఎస్టిమేషన్లు పెరిగి దాదాపు రూ.10 కోట్లు ఖజానాపై భారం పడింది. 


కేంద్రం నిధులిచ్చినా...


ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎ్‌సవై) పథకం కింద జిల్లాలో 13 గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రోడ్ల అభివృద్ధికి కేంద్రం 60 శాతం, మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. మొత్తంగా ఈ రోడ్ల నిర్మాణాలకు రూ.67 కోట్లు వెచ్చిస్తుండగా ఐదేళ్లపాటు మెయింటెనెన్సకు మరో రూ.4 కోట్లను ఖర్చు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేసే విధంగా పంచాయతీ రాజ్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇవి కేంద్ర భాగస్వామ్యంతో జరిగే పనులు కావడంతో  కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకొచ్చారు. అయినా ఆశించిన మేర పురోగతి కనిపించడం లేదు. కాగా న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంక్‌(ఎనడీబీ) ఆర్థిక భాగస్వామ్యంతో జిల్లాలోని ఆరు ప్రధాన రహదారులను 69 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.87 కోట్ల అంచనాతో ఏడాది క్రితం టెండర్లు పిలిచారు. ఇప్పటికీ ఈ పనులు మొదలు కాలేదు. ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో లేదోనన్న అనుమానంతో కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.