అడుగడుగునా గోతులు!

ABN , First Publish Date - 2021-09-19T05:08:50+05:30 IST

వీటిని చూసి ఎవరైనా రోడ్లు అంటారా.. ఎందుకంటే ఏ మూల చూసినా ఎక్కడా రోడ్లు కానరావడంలేదు..

అడుగడుగునా గోతులు!
గోతులతో నిండిన భీమవరం బైపాస్‌ రహదారి

రహదారులన్నీ ఛిద్రం 

చినుకు పడితే చింతే

ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

ఎవరికీ పట్టని వైనం


వీటిని చూసి ఎవరైనా రోడ్లు అంటారా.. ఎందుకంటే ఏ మూల చూసినా ఎక్కడా రోడ్లు కానరావడంలేదు.. నిండా గోతులే.  ఏళ్ల తరబడి సమస్య వేధిస్తున్నా పట్టించుకునే నాథులే లేరు.. కనీసం కన్నెత్తి చూసిన పాలకులు లేరు.. ఇక అధికారులైతే అసలు పట్టించుకోవడమే మానేశారు. ఎవరి చావు వాళ్లు చావండి అన్నట్టు తయారైంది పరిస్థితి..    అటు పాలకులు ఇటు అధికా రులు ఇద్దరిదీ ఇదే తీరు.. అందుకే రోడ్డుపై గోతులు కని పిస్తున్నా కనీసం హెచ్చరిక బోర్డులూ కనిపించడం లేదు.. అయ్యా పాలకులు.. అధికారులు ఇకనైనా కదలండి.. ప్రమాదాల నివారణకు  ఏదో ఒకటి చేయండి..   


భీమవరం బైపాస్‌లో వెళితే పడతారంతే!


భీమవరం క్రైమ్‌, సెప్టెంబరు 18 : భీమవరం బైపాస్‌ రోడ్డు మరీ దారుణంగా తయారైంది. ఉండి రోడ్‌ నుంచి కుముదవల్లి రోడ్‌ వరకు ఉన్న బైపాస్‌ గోతులమ యంగా మారింది. బీవీ రాజు విగ్రహం వద్ద నుంచి ఉండి రోడ్‌ వరకు భారీ గోతులు పడ్డాయి. గోతుల్లో నీరు నిలబడడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొన్ని సమయాల్లో వాహనాలు తిరగబడి గాయాలపాలవుతున్నారు. బైపాస్‌ రోడ్‌లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బైపాస్‌ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. 


అధ్వానంగా వీరవాసరం రహదారులు..


వీరవాసరం, సెప్టెంబరు 18 : వీరవాసరం – మత్స్యపురి రహదారి నిర్మాణానికి ఏళ్ళ తరబడి మోక్షం లేదు అడపా తడపా చేసిన మరమ్మతు పనులు మట్టిలో కలిసిపోయాయి. 8 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ రహదారి వీరవాసరం, తలతాడితిప్ప , బొబ్బనపల్లి, మత్స్యపురి గ్రామాల్లో పలుచోట్ల గోతులమయమైంది. వర్షం వస్తే నీళ్లతో నిండిన గోతులు కనపడక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.           వీరవాసరం –పెనుమంట్ర రహదారి వీరవాసరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీరవాసరం రైస్‌మిల్లు వద్ద రహదారి పూర్తిగా శిఽథిలమై గోతుల మయమైంది. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఐదు ప్రమాదాలు సంభవించాయి. అయినా నేటికీ మోక్షం లేదు. 


రోడ్డు తవ్వారు.. వదిలేశారు..


ఆకివీడురూరల్‌, సెప్టెంబరు 18 : మూలిగే నక్కపై తాటికాయపడ్డ చం దాన తయారైంది ఆకివీడు–పెదకాపవరం రహదారి..ఆ రహదారి ఇప్పటి వరకూ గోతులమయంగా మారడంతో వాహనదారులు పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా గుమ్ములూరు వద్ద అనుమతి లేకుండా రోడ్డును తవ్వి తూరలుపెట్టడంతో నల్లమట్టి పైకి వచ్చింది.దీంతో వాహనదారులు జారిపడిపోతున్నారు. రోడ్డును పాడుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ జేఈ శ్రీహరి మాట్లాడుతూ రోడ్డు తవ్వడానికి అనుమతులు ఇవ్వలేదని,  సిబ్బందిని పంపించి పరిశీలించి బాద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 




Updated Date - 2021-09-19T05:08:50+05:30 IST