‘దారి’ద్య్రం

ABN , First Publish Date - 2021-07-15T06:26:23+05:30 IST

జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానమైన జాతీయ రహదారులు మినహాయిస్తే పట్టుమని పది నిమిషాల పాటు ఏఒక్క రోడ్డుపైనా సజావుగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు.

‘దారి’ద్య్రం
చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద అధ్వానంగా ఉన్న ఒంగోలు-కర్నూలు రహదారి

జిల్లాలో  రోడ్ల పరిస్థితి దయనీయం

గోతులమయంగా మారిన ప్రధానదారులు

గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం

చినుకు పడితే చిత్తడిగా మారుతున్న వైనం

అల్లాడిపోతున్న వాహన చోదకులు

పట్టించుకోని పాలకులు, అధికారులు


ఒంగోలు-పొదిలి రోడ్డులో కీలకమైన చీమకుర్తి సమీపంలోని రామతీర్థం వద్ద గ్రానైట్‌ వాహనాలు, కంకర లారీలు, భారీ టన్నేజీతో తిరుగుతుండగా రోడ్డు ధ్వంసమైంది. ఒక్కో చోట మూడు, నాలుగు అడుగుల లోతు గుంతలు ఏర్పడగా వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. ఒంగోలు నుంచి కనిగిరి, పొదిలి, గిద్దలూరు మార్కాపురం ఇలా అన్ని ప్రాంతాలకు అటు నుంచే వెళ్లాల్సి రావడంతో వాహనదారులు అల్లాడుతున్నారు.


పర్చూరు నుంచి ఎటు వెళ్లాలన్న ఒళ్లంతా హూనమే. నియోజకవర్గంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయి. పర్చూరు నుంచి చెరుకూరు వెళ్లే ప్రధాన రహదారిలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వీరన్నపాలెం నుంచి రమణాయపాలెం,  పర్చూరు-దేవరపలి  రోడ్లలో ఎక్కడ చూచినా పెద్ద పెద్ద గుంతలే దర్శనమిస్తున్నాయి. 


జిల్లాలోని కడప-గుంటూరు రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉంది. కొమరోలు మండల పరిధిలోని నల్లగుట్ల వద్ద రోడ్డు మొత్తం ధ్వంసమైపోయింది. తారు లేచిపోయి మట్టిరోడ్డుగా మారింది. వాహనాలు వచ్చినప్పుడు లేస్తున్న దుమ్ముకు ఆ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలంటూ ఇటీవల రాస్తారోకో కూడా చేశారు.


ఇవి మచ్చుకు మాత్రమే.. జిల్లాలో అన్ని ప్రధాన రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. సాఫీగా ప్రయాణం సాగుతుందన్న నమ్మకం వాహనదారులు, ప్రయాణికులకు లేకుండాపోయింది. సాధారణంగా ఏటా మరమ్మతులు, నాలుగైదు ఏళ్లకు ఒకసారి పూర్తిస్థాయిలో రోడ్లు అభివృద్ధి చేస్తేనే జిల్లాలో తిరిగే పరిస్థితి. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక రోడ్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో రహదారులన్నీ దరిద్రంగా మారాయి. ప్రయాణికులను భయపెడుతున్నాయి. 

ఒంగోలు, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానమైన జాతీయ రహదారులు మినహాయిస్తే పట్టుమని పది నిమిషాల పాటు ఏఒక్క రోడ్డుపైనా సజావుగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రప్రభుత్వ పరిధిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల రోడ్లు ఎక్కడ చూసిన అధ్వానంగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల ప్రధానమైన రహదారులు సైతం గతుకులమయంగా ఉంటుండగా వర్షం పడితే నరకమే. ఎక్కడికక్కడ పాడైపోయి వాటిపై ప్రయాణం చేయలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొత్త రోడ్లు, అభివృద్ధి మచ్చుకైనా లేకపోగా కనీస మరమ్మతులు కూడా కరువయ్యాయి. దీంతో ఏప్రాంతంలో చూసినా రోడ్లపై తిరగలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల జిల్లాలో ఒక మోస్తరు జల్లులు పడుతున్నాయి. ఆ కాస్త వానకే అత్యధిక ప్రాంతాల్లోని రోడ్లు పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లా పరిధిలో చెన్నై - కోల్‌కత్తా, మాచర్ల- కనిగిరి - వెంకటగిరరి, ఒంగోలు కత్తిపూడి, గుంటూరు - కర్నూలు వంటి కొన్ని రోడ్లు మినహాయిస్తే ఇతర ప్రధానరోడ్లతోపాటు గ్రామీణ దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒంగోలు - పొదిలి, టంగుటూరు - కొండపి - పొదిలి, సింగరాయకొండ - కందుకూరు - కనిగిరి, కడప- గుంటూరు, అద్దంకి- దర్శి - దొనకొండలాంటి ప్రధానమైన రోడ్లు ఆధ్వానంగానే కనిపిస్తున్నాయి.    


రోడ్లన్నీ గుంతలమయమే...

దర్శి ప్రాంతంలో చూస్తే దర్శి - దొనకొండ, తాళ్ళూరు - తూర్పుగంగవరం, దర్శి - బొద్దికూరపాడు రోడ్ల పరిస్థితి అడుగుకో గుంతతో వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. కొండపి ప్రాంతంలో కీలకమైన టంగుటూరు నుంచి కొండపి మీదుగా పొదిలి వెళ్లే రోడ్డు దారుణంగా తయారవడంతో ఇటీవల గోతులు పూడ్చటం ప్రారంభించారు. అయినా పలు గ్రామాల్లో గోతులు ఇంకా దర్శనమిస్తున్నాయి. కందుకూరు ప్రాంతంలో ప్రధాన రోడ్లన్నింటి పరిస్థితి దారుణంగానే ఉంది. కీలకమైన సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా కనిగిరి వెళ్లే ఓవీరోడ్డుతోపాటు ఆ నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఒంగోలు పరిసరాల్లో కొప్పోలు - మోటుమాల, ఒంగోలు - చండ్రపాలెం, అలాగే ఇతర ప్రాంతాల్లో కంభం - గిద్దలూరు, పర్చూరు - ఇంకొల్లు, గుంటూరు - పర్చూరు రోడ్లు ఇలాగే ఉన్నాయి. అద్దంకి- నార్కెట్‌పల్లి రోడ్డులో ఏళ్ల తరబడి పలుచోట్ల గ్యాప్‌లు పూర్తిచేయకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదాలకు నెలవులుగా మారాయి కర్నూలు - గుంటూరు రోడ్డులో పెద్దారవీడు మండల పరిధిలోనూ అలాగే ఉంది. 


పంచాయతీరాజ్‌ రోడ్లు మరీ ఘోరం

ఇక పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని రోడ్లు వివిధ ప్రాంతాల్లో అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయి. మండల కేంద్రాలు, గ్రామాలకు మధ్య ఉండే లింకు రోడ్లు, ఒక మండలం నుంచి మరో మండలానికి కలిపే కనెక్టివిటీ రోడ్ల దుస్థితి చెప్పనలవి కాదు. రానున్న వర్షాకాలంలో ఆయా రోడ్లపై తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది నవంబరులో సంభవించిన నివర్‌ తుఫాన్‌తో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. తుఫాన్‌ దాటికి 11 మండలాల్లో 206 కి.మీ మేర 72రోడ్లు దారుణంగా దెబ్బతినగా రూ. 49.3కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు నివేదించారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. 


కనీస మరమ్మతులు కరువు

రోడ్ల తక్షణ మరమ్మతులకు అడిగిన రూ.4.18 కోట్లు కూడా ఇవ్వకపోవడంతో కనీస మరమ్మతులు జోలికి అధికారులు పోలేదు. కేంద్ర నిధుల కింద వచ్చే ఒక్క పీఎంజీఎస్‌వై పనులు తప్ప ఇతర రోడ్ల పని ఆ శాఖలో జరగడం లేదు. ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి కూడా అంతకన్నా అధ్వానంగా ఉంది. గతంలో పనులు చేసిన వారికి బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో ప్రస్తుతం పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు సంబంధించి రూ.106.87కోట్లతో 62 పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడం అందుకు నిదర్శనం. తక్షణం ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోకపోతే రానున్న వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 










Updated Date - 2021-07-15T06:26:23+05:30 IST