రోడ్డెక్కిన సర్పంచ్‌లు

ABN , First Publish Date - 2021-11-25T05:30:00+05:30 IST

పంచాయతీల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించడంతో సర్పంచ్‌లు రోడ్డెక్కారు. నాలుగు రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం రాత్రికి రాత్రే దారిమళ్లించడంతో గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన సర్పంచ్‌లు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం భిక్షాటన చేసి నిరసన తెలిపారు.

రోడ్డెక్కిన సర్పంచ్‌లు
ఒంగోలులో భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న సర్పంచ్‌లు

14, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే

పంచాయతీలకు జమచేయాలని డిమాండ్‌

ఒంగోలులో భిక్షాటన చేసి నిరసన

త్వరలో పంచాయతీలకు తాళాలు వేయాలని నిర్ణయం

అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే విజయవాడలో ధర్నా

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 25 : పంచాయతీల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించడంతో సర్పంచ్‌లు రోడ్డెక్కారు. నాలుగు రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం రాత్రికి రాత్రే దారిమళ్లించడంతో గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన సర్పంచ్‌లు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మా నిధులు మాకివ్వాలని నినాదాలు చేస్తూ భిక్షాటన చేశారు. అనంతరం డీపీఓ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీరామమూర్తి, పగడాల రమేష్‌లు మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో అంతంతమాత్రంగా ఉన్న నిధులను కూడా ప్రభుత్వం తీసుకోవడం దుర్మార్గంగా ఉందన్నారు. ఒకవైపు ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పర్చాలని ఆదేశాలు ఇస్తూనే ఇంకొకవైపు ఉన్న నిధులను లాగేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం సర్పంచ్‌ల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిధులను తీసుకోవడంపై చర్చించి భవిష్యత్‌ కార్యచరణను రూపొందించారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. మరోవైపు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని, అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అక్కడ ధర్నా అనంతరం ముఖ్యమంత్రిని కలిసి దారిమళ్లించిన నిధులను వెంటనే పంచాయతీల అకౌంట్లలో జమచేయాలని కోరాలని నిర్ణయించినట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఇంద్రసేనారెడ్డి, పున్నారావు, రామాంజిరెడ్డి, రేణుక తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST