అలుగు పడిన లకారం

Jul 22 2021 @ 23:47PM
లకారం అలుగును పరిశీలిస్తున్న మేయర్‌ నీరజ

ఖమ్మం 41వ డివిజన్‌కు ముంచుకొస్తున్న ముప్పు

 ముంపు ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలి: మేయర్‌

ఖమ్మం కార్పొరేషన్‌, జూలై22:  ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లముందు మోకాలిలోతు నీళ్లు నిలవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కుండపోత వర్షంతో లకారం చెరువుకు అలుగుపడింది. మున్నేరులో 13 అడుగులలోతులో నీరు ప్రవహిస్తున్నది. మేయర్‌ పునుకొల్లు నీరజ, అర్బన్‌ తహసీల్దార్‌ శైలజ, ఇరిగేషన్‌ ఈఈ ఆంజనేయులు, 1వ పట్టణ సీఐ చిట్టిబాబు, కార్పోరేటర్లు కర్నాటి కృష్ణ, మాటేటి అరుణ, కమర్తపు మురళితో కలిసి లోతట్లు ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు, లకారం ముంపు ప్రాంతాల్లో  ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పైనుండి వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో బొక్కలగడ్డ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయాలని మేయర్‌ నీరజ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. రెండు జేసీబీలు, ట్రాక్టర్లతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

రహదారులు జలమయం, ఇళ్ల ముందు నీరు

నగరంలోని 59వ డివిజన్‌ దానవాయిగూడెంలో రహదారులకు ఇరువైపులా కాలువలు లేకపోవటంతో వరదనీరంతా ఇళ్లముందుకు చేరింది. దీంతో ఇళ్లల్లోంచి రావాలంటే మోకాలిలోతు నీళ్లలో నడుచు కుంటూ రావలసిన పరిస్థితి. నగరంలోని 21వ డివిజన్‌ మాణిక్యనగర్‌లో ఇదే పరిస్థితి. ఇళ్లముందు నీళ్లు నిలిచి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లీపురం రోడ్డులో భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.

41వ డివిజన్‌కు ముంచుకొస్తున్న ముప్పు

41వ డివిజన్‌కు వరద ముంపు ముంచుకొస్తోంది. డివిజన్‌లోని చెరువుబజార్‌, తుమ్మలగడ్డ ప్రాంతాల్లో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో సుమారు 200 నివాసాలు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. నగరంలోని 11 డివిజన్లనుండి వచ్చే మురుగునీరు, లకారం చెరువు అలుగునీరు కలిసి ప్రవహించటంతో ఇక్కడ ముంపు ప్రమాదం ఏర్పడింది. మేయర్‌ నీరజ. కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ, రెవెన్యూ, ఇరిగేషన్‌ పోలీస్‌ అధికారులతో కలిసి సదరు ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరం అయితే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 

Follow Us on: