దోపిడీ కేసులో వీడిన మిస్టరీ

ABN , First Publish Date - 2022-07-05T07:03:13+05:30 IST

నగరంలో సంచలనం రేకెత్తించిన రూ.33 లక్షల దోపిడీ కేసును సీసీఎస్‌ పోలీసులు ఛేదించారు.

దోపిడీ కేసులో వీడిన మిస్టరీ

అంతా వ్యాపారి నాటకమే

సులభంగా డబ్బు సంపాదించేందుకు స్నేహితులతో కలిసి వ్యూహం

బంగారం విక్రయిస్తానంటూ ఓ గోల్డ్‌ లోన్‌ కంపెనీ ఏజెంట్‌కు వల

అతను డబ్బు తీసుకుని రాగానే పథకం అమలు

ప్రధాన నిందితుడు ప్రసాద్‌తోపాటు మరో ముగ్గురు అరెస్టు

రూ.11.85 లక్షలు, కారు, బైక్‌ స్వాధీనం


విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నగరంలో సంచలనం రేకెత్తించిన రూ.33 లక్షల దోపిడీ కేసును సీసీఎస్‌ పోలీసులు ఛేదించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రసాద్‌ అనే వ్యాపారి తన స్నేహితులతో కలిసి ఈ దోపిడీ నాటకం ఆడినట్టు పోలీసులు తేల్చారు. దోపిడీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేయడంతోపాటు వారి నుంచి రూ.11.85 లక్షల నగదు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో క్రైమ్‌ ఏడీసీపీ గంగాధర్‌ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

షీలానగర్‌లోని తులసీ గార్డెన్స్‌లో గల సరస్వతి బ్లాక్‌లో నివాసముంటున్న భీశెట్టి విలియం ప్రసాద్‌ (32) దొండపర్తిలోని టీఎస్‌ఎన్‌ కాలనీలో బీడ్ల్యూ ఎంటర్‌ప్రైజెస్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ పేరుతో కార్యాలయం నడుపుతున్నాడు. ఇక్కడ కార్యాలయం ఏర్పాటుచేయకముందు హైదరాబాద్‌లో కొంతకాలం ఉన్నాడు. అక్కడ వ్యాపారం సరిగా సాగకపోవడంతో నగరానికి వచ్చేశాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలపై దృష్టిసారించాడు. నగరంలో తనకు బాగా పరిచయస్తుడైన అగ్‌మాంట్‌ గోల్డ్‌లోన్‌ కంపెనీలో రీజినల్‌ క్రెడిట్‌ హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి రాజునాయుడుకు బంగారం ఆశ చూపించి దోచుకోవాలని పథకం రచించాడు. అందుకోసం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో తనకు బాగా స్నేహితులైన దిల్‌షుఖ్‌నగర్‌ చైతన్యనగర్‌కు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ పెండ్ర నరేష్‌ అలియాస్‌ రిషి, ఖమ్మం జిల్లా వైరా మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన షేక్‌ యూసఫ్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుందరయ్య నగర్‌కు చెందిన షేక్‌ నజీర్‌లను నగరానికి పిలిపించాడు. గత నెల 29న రాజునాయుడుకు ప్రసాద్‌ ఫోన్‌ చేశాడు. బంగారం విక్రయించాలనుకుంటున్నానని...డబ్బులు పట్టుకుని దొండపర్తిలోని తన కార్యాలయానికి రావాలని కోరాడు. దీంతో రాజునాయుడు తనకు పరిచయస్తుడైన ఫైనాన్షియర్‌ ఆనంద్‌కుమార్‌ నుంచి రూ.16 లక్షలు తీసుకుని ప్రసాద్‌ కార్యాలయానికి వెళ్లాడు. ప్రసాద్‌తో రాజునాయుడు మాట్లాడుతుండగా అప్పటికే కార్యాలయంలో సిద్ధంగా వున్న ముగ్గురు (నరేష్‌, షేక్‌ యూసఫ్‌, షేక్‌ నజీర్‌) గదిలో నుంచి బయటకు వచ్చారు. ప్రసాద్‌, రాజునాయుడులను చేరొక గదిలోకి తీసుకువెళ్లారు. రాజునాయుడును తాళ్లు, గుడ్డలతో కట్టేశారు. అనంతరం ప్రసాద్‌తోపాటు మిగిలిన ముగ్గురు కలిసి బంగారం, డబ్బుతో ఉడాయించారు. అయితే రాజునాయుడు ఎలాగో తప్పించుకుని ఫైనాన్సియర్‌ ఆనంద్‌కుమార్‌ ఇంటికి వెళ్లాడు. ప్రసాద్‌ 700 గ్రాముల బంగారం విక్రయిస్తున్నాడంటూ అదనంగా రూ.18 లక్షలు కావాలని తీసుకున్నాడు. ఆ డబ్బును తన ఇంట్లో పెట్టుకుని, సాయంత్రం ఆనంద్‌కు ఫోన్‌ చేసి ప్రసాద్‌కు డబ్బులు ఇస్తుండగా గుర్తుతెలియని కొంతమంది దాడి చేసి బంగారం, డబ్బు దోచుకుపోయారని  చెప్పాడు. ఆనంద్‌కుమార్‌ సూచన మేరకు రాజునాయుడు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మరుసటిరోజు ఉదయం ఆనంద్‌కుమార్‌ను రాజునాయుడు కలిసి రూ.33 లక్షలు దోచుకున్నారని తాను అబద్ధం చెప్పానని, వాస్తవంగా మొదట తీసుకువెళ్లిన రూ.16 లక్షలు మాత్రమే దోచుకున్నారని చెప్పి మిగిలిన మొత్తాన్ని ఆయనకు తిరిగి ఇచ్చేశాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన రాజునాయుడిపై కూడా చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఏడీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్‌ సీఐ రామచంద్రరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-05T07:03:13+05:30 IST