దోచేస్తున్నారు..

ABN , First Publish Date - 2022-05-29T07:10:28+05:30 IST

రాష్ట్రంలో ఖనిజసంపదపై కన్నేసి పంచుకుంటున్న జగన్‌, ఆయన పార్టీనేతలు జిల్లాలోని గ్రానైట్‌ను దోపిడీ చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. అందులో వైసీపీ ఎమ్మెల్యే నుంచి జగన్‌ వరకు వాటాలు ఉన్నాయన్నారు. ఒంగోలులో రెండు రోజులపాటు జరిగిన టీడీపీ మహానాడు ముగింపు సందర్భంగా శనివారం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు.

దోచేస్తున్నారు..
మహానాడు బహిరంగసభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు గ్రానైట్‌లో వాటాలు 

తెచ్చిన పేపర్‌మిల్లును పెట్టలేకపోయారు

జిల్లాను పొట్టన పెట్టుకున్నారంటూ జగన్‌పై చంద్రబాబు ధ్వజం

అధికారంలోకి రాగానే వెలిగొండ పూర్తి, జిల్లాల విభజనపై సమీక్ష

మహానాడు విజయవంతంపై జిల్లా నేతలకు అభినందనలు 

ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖనిజసంపదపై కన్నేసి పంచుకుంటున్న జగన్‌, ఆయన పార్టీనేతలు జిల్లాలోని గ్రానైట్‌ను దోపిడీ చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. అందులో వైసీపీ ఎమ్మెల్యే నుంచి జగన్‌ వరకు వాటాలు ఉన్నాయన్నారు. ఒంగోలులో రెండు రోజులపాటు జరిగిన టీడీపీ మహానాడు ముగింపు సందర్భంగా శనివారం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. జిల్లాలోని గ్రానైట్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్‌లు వాటిలో భాగస్వామ్యం, వాటాలతో దోపిడీ చేస్తున్నారన్నారు. గూగుల్‌ మ్యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయని, అఽధికారంలోకి వచ్చాక వాటి వివరాలను బయటకు తీస్తానని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని చంద్రబాబు, వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసినట్టు గుర్తుచేశారు. 2014-19 కాలంలో రూ.1,500కోట్లు వ్యయం చేయడమే కాక తొలిటన్నెల్‌ను 90శాతం పూర్తిచేశామన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్న వెలిగొండ పూర్తిచేయలేకపోయారని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండతోపాటు అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాల పెంపు, సుబాబుల్‌ రైతుల ప్రయోజనాల కోసం, రామాయపట్నం పోర్టు, దానికి అనుబంధంగా రూ.24వేలకోట్లతో పేపర్‌ పరిశ్రమకు ఎంవోయూ చేశామన్నారు. అలాంటి భారీప్రాజెక్టును తెస్తే దానిని జగన్‌ పోగొట్టి జిల్లాను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. దాంతో ఉపాధి పోవడమే కాక సుబాబుల్‌ టన్ను రూ.600కు అమ్ముకునే దుస్థితి రైతులకు వచ్చిందన్నారు. జిల్లాలో టీడీపీ ప్రభుత్వ కాలంలో 38వేల సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చినట్లు చెప్పారు. గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై జగన్‌ ప్రభుత్వం విపరీతంగా భారం మోపిన విషయం తన దృష్టికి వచ్చిందని, దానిపై స్టడీ చేసి వారికి అండగా ఉంటామన్నారు. మార్కాపురం ప్రాంతాన్ని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు జిల్లాలో ఉంచడంతో ప్రత్యేక జిల్లా డిమాండ్‌ ఆ ప్రాంత ప్రజల్లో ఉందన్నారు. అలాగే కందుకూరు, అద్దంకిలను ఇతర జిల్లాల్లో కలపడం అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా జిల్లా విభజనలపై సమీక్ష చేసి లోపాలు సవరిస్తామన్నారు. ఒంగోలులో జరిగిన మహనాడు కార్యక్రమం ఎన్నడూ లేనంతస్థాయిలో విజయవంతమైందని, ఇది టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహానాడు విజయవంతంపై జిల్లా నేతలను శభాష్‌ అంటూ నేతలను అభినందించారు. అలాగే మహానాడు కోసం పొలాలను ఇచ్చిన మండువారిపాలెం వాసులకు పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


Updated Date - 2022-05-29T07:10:28+05:30 IST