కన్నేస్తే దోచేస్తారు!

ABN , First Publish Date - 2022-08-13T07:20:55+05:30 IST

మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుని పరారవుతున్న అంతర జిల్లాల గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 9మంది ముఠా సభ్యులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితులనుంచి రూ.9లక్షల చోరీ సొత్తును రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు నిందితుల అరెస్ట్‌ వివరాలను వెల్లడించారు.

కన్నేస్తే దోచేస్తారు!
చోరీ సొత్తును పరిశీలిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

  • అంతర్‌ జిల్లాల గొలుసు దొంగల ముఠా అరెస్ట్‌ 
  • రూ.9 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
  • 19 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితులు
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు 

కాకినాడ క్రైం, ఆగస్టు 12: మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుని పరారవుతున్న అంతర జిల్లాల గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 9మంది ముఠా సభ్యులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితులనుంచి రూ.9లక్షల చోరీ సొత్తును రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు నిందితుల అరెస్ట్‌ వివరాలను వెల్లడించారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటుతో..

సామర్లకోట బోనాసుల వారివీధికి చెందిన బోడెం రామాంజినేయులు, ఉమ్మిడి ఆనంద్‌కుమార్‌, గోదావరివీధికి చెందిన గూడుపు సాయిరాం, వీకే రాయపురానికి ఏటిగట్టుకు చెందిన కామిరెడ్డి జోగారావు, బోనాసులవారివీధికి చెందిన బోనాసు శంకర్‌నారాయణ, రేలంగి నితిన్‌ దుర్గాప్రసాద్‌ ఒక గ్యాంగుగా ఏర్పడి అంతర్‌ జిల్లాల్లో మహిళల మెడలోని బంగారు వస్తువులను తెంచుకుని పరారవుతున్నారు. చోరీలకు పాల్పడడం, చోరీ సొత్తులతో డీల్‌ చేస్తూ వచ్చిన సొమ్ముతో మద్యం పార్టీలు, జల్సాలకు వీరు అలవాటుపడ్డారు. కాకినాడ జిల్లాలో 14 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుల ఆచూకీ కోసం ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. పిఠాపురంలో చైన్‌ స్నాచింగ్‌కి పాల్పడిన నేపథ్యంలో నిందితుల అరెస్ట్‌కోసం ప్రత్యేక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, ఎస్‌డీపీవో భీమారావు స్వీయ పర్యవేక్షణలో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, టౌన్‌ ఎస్‌ఐ బి.శంకరరావు, క్రైం పార్టీ, ఐటీ కోర్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నిందితులు పిఠాపురం రైల్వేస్టేషన్‌వద్ద ఉండగా గురువారం రాత్రి 11 గంటలకు సీఐ ఆధ్వర్యంలో దాడి చేసి ఆగురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 

ఎక్కడెక్కడ.. ఎన్ని.. ఎలా చేశారంటే..

ఈ 9మందిలో ఆరుగురు నిందితులు అంతర జిల్లాలో 19 గోల్డ్‌ చైన్‌ స్నాచింగ్‌లు, 9 సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. కాకినాడ జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో 2, విశాఖ 2 మొత్తంగా 19 గోల్డ్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారన్నారు. ఇందులో కాకినాడ జిల్లాలో 8, ఏఎస్‌ఆర్‌ 1 సెల్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారన్నారు. 9మంది ముఠాగా ఏర్పడి నేరం చేసేందుకు రెక్కీ నిర్వహించి నేరం ఎలా చేయాలి, ఏ ప్రాంతంలో చేయాలి, ఎలా తప్పించుకోవాలని అనేది నిర్ణయించుకుని పక్కా పథకం ప్రకారం చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవారన్నారు. చోరీలు చేయగా వచ్చిన డబ్బులతో పార్టీలు, మద్యం సేవించడం వంటి వ్యసనాలకు పాల్పడేవారన్నారు. 9మంది అంతర జిల్లాల నిందితుల్లో బోడెం రామాంజినేయులు, ఉమ్మిడి ఆనంద్‌కుమార్‌, గూడుపు సాయిరాంలు అనే 19 నుంచి 21 ఏళ్ల వయసు గల యువకులు గ్యాంగులో సభ్యులు కాదని, రెండు నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. అరెస్టు చేసిన వారిలో కామిరెడ్డి జోగారావు, బోనాసు శంకర్‌నారాయణ, రేలంగి నితిన్‌ దుర్గాప్రసాద్‌ అంతర జిల్లాల నిందితులుగా పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. మరో ముగ్గురు అంతర జిల్లాల నిందితుల అరెస్ట్‌కోసం గాలింపు చేస్తున్నామన్నారు. నిందితులనుంచి రూ.9లక్షల విలువైన ఏడు గోల్డ్‌చైన్లు, 9 సెల్‌ఫోన్లు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌బైక్‌, బజాజ్‌పల్సర్‌ బైక్‌, హీరో బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా మరో రూ.9లక్షల విలువ చేసే 11 గోల్డ్‌చైన్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. ముగ్గురు పరారీలో ఉన్నారని, వీరికోసం గాలింపు చర్యలు చేపడుతున్నాని తెలిపారు. అంతర జిల్లాల నిందితుల ముఠాను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. సమావేశంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, ఎస్‌డీపీవో భీమారావు, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-13T07:20:55+05:30 IST