రాజకీయ ఉద్దండుడిని కోల్పోయాం..

ABN , First Publish Date - 2021-12-05T06:02:06+05:30 IST

ఉమ్మడి తెలుగు రాష్ర్టాల మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

రాజకీయ ఉద్దండుడిని కోల్పోయాం..

రోశయ్య మృతి పట్ల పలువురి సంతాపం

ఉమ్మడి తెలుగు రాష్ర్టాల మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌

 

రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిన రోశయ్య: హోమంత్రి సుచరిత

మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య రాజకీయాల్లో విలువలు పాటించి ఆదర్శంగా నిలిచారు. ఆయన మృతి దిగ్ర్భాంతి కలిగించింది. ఉమ్మడి ఏపీకి సీఎంగా, అనేక శాఖలకుమంత్రిత్వ పదవులు నిర్వహించిన ఆయన ఆ పదవులకే వన్నెతెచ్చారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.


తెలుగురాష్ట్రాలకు తీరనిలోటు:  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

రాజకీయ దురంధరుడు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మాకు లోటు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.


 దిగ్ర్భాంతికి గురిచేసింది:  రాయపాటి సోదరులు

రోశయ్య హఠాన్మరణం దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయన చక్కని రాజకీయ క్రమశిక్షణతో, పట్టుదలతో రాజకీయ అందలాలు అధిరోహించారు. రోశయ్య లాంటి గొప్పనేత మరణం ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.


 వేమూరు ముద్దుబిడ్డ: నక్కా ఆనందబాబు

రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్య మృతితో ఒక తరం రాజకీయాలు ముగిశాయి. వేమూరులో పుట్టి రాష్ట్రంలో ఉన్నత పదవులను అధిరోహించి వేమూరు ముద్దుబిడ్డ అయ్యారు. నాపై ప్రత్యేక అభిమానం చూపేవారు.  


రోశయ్య మృతి బాధాకరం: జీవీ ఆంజనేయులు

పరిపాలనాధ్యక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన  రోశయ్య మృతి బాధాకరం. రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్య పాత్ర ఎనలేనిది. అనేక పదవులు అధిరోహించిన ఆయన ఆ పదవులకే వన్నె తెచ్చారు.  


రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు: ధూళ్లిపాళ్ల నరేంద్ర 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనదైన ముద్య వేసిన రాజకీయ భీష్ముడు రోశయ్య మరణం బాధాకరం. పొన్నూరు నియోజకవర్గంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. పొన్నూరు వాసి అయిన రైతు నేత ఎన్జీరంగా శిష్యుడిగా ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు.  


పల్నాడును అభివృద్ధి చేశారు..: యరపతినేని శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా వాసిగా నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యుడిగా రోశయ్య పల్నాడులో అభివృద్ధికి చిరునామాగా నిలిచారు. ఆయన మృతి తీరని లోటు.

 

అపర చాణక్యుడు: ఎంపీ గల్లా జయదేవ్‌, అరుణకుమారి

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అరుదైన నేత రోశయ్య. ప్రత్యర్ధి పార్టీలను సైతం ఆకట్టుకున్న అజాత శత్రువు. అటువంటి మహానేత మరణం మమ్మల్ని కలిచివేసింది. ఏ పదవి చేపట్టినా ఆయన ప్రజాసేవే పరమావధిగా పనిచేశారు. 

  

రాజకీయ ఉద్దండుడిని కోల్పోయాం: ఎమ్మెల్యే అనగాని

రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ఎన్నో పదవులను పొంది రాజకీయ ఉద్దండుడిగా ఎదిగిన రోశయ్య మరణం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు తీరనిలోటు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఉనికి పుచ్చుకుని ముందుకు వెళ్ళాలి.  


ఆయనతో అనుబంధం మరచిపోలేనిది...:ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 

రోశయ్యతో అనుబంధం మరచిపోలేనిది. ఆయన కాంగ్రెస్‌, నేను తెలుగుదేశం పార్టీలైనా ఏనాడు పార్టీలు మా అనుబంధానికి అడ్డంకి కాలేదు. ఏం.. రాజా ఏంటి సంగతులంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన మరణం వ్యక్తిగతంగా చాలా బాధించింది.  


విలువలు కల్గిన నేత...: యడ్లపాటి వెంకట్రావు, మాజీ ఎంపీ

రాజకీయ విలువలు కల్గిన నేతను కోల్పోవడం బాధాకరం. నేను, రోశయ్య ఇరువురం ఆచార్య ఎన్జీ రంగా శిష్యులం. అనేక అంశాల్లో కలసి పనిచేసిన అనుభవాలు గుర్తు చేసుకుంటుంటే బాధ కలుగుతుంది. నాలాగానే మరికొంత కాలం జీవిస్తారని ఆశపడ్డాను. ఆయన లేని లోటు తీర్చలేనిది.

 

రైతుల ప్రయోజనాల కోసం పనిచేశారు..: మాజీ ఎంపీ శివాజి

చట్టసభల్లో రైతుల ప్రయోజనాల కోసం రోశయ్య పనిచేశారు. లోక్‌సభలో కూడా తనవాణిని వినిపించారు. ఆయన మరణం తీరని లోటు.


రోశయ్య మృతి తీరని లోటు... : నాందెడ్ల మనోహర్‌ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగానే కాకుండా ఆర్థిక మంత్రిగానూ ఆయన రాష్ర్టానికి అందించిన సేవలు నిరుపమానం. కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. అనుభవం ఉన్న రాజకీయ నేత చనిపోవడం రాష్ర్టానికి ఎంతో తీరని లోటు.


కన్న తండ్రిలా ఆప్యాయతను పంచేవారు..:  నన్నపనేని రాజకుమారి

రోశయ్య నాకు కన్న తండ్రి మాదిరి ఆప్యాయతను పంచేవారు. ఆయన నాకు ఎన్నో విధాలుగా సహకరించేవారు. అసెంబ్లీలో, శాసనమండలిలో ఎన్నో విషయాలను నేర్పారు. ఒక్కోసారి తండ్రిలా మందలించేవారు. కుటుంబ సభ్యురాలిగా ఇంట్లో భోజనం చేసేవాళ్లం.  ఒక పెద్ద దిక్కును కోల్పోయాను.

 

 అపార రాజకీయ అనుభవం ఆయన సొంతం..: డాక్టర్‌ గోగినేని ఉమ 

రాజకీయ అనుభవం కల్గిన రోశయ్యపై పోటీ చేయాలంటే నాకు భయం వేసింది. ఆయన కుటుంబంతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన అపార రాజకీయ అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడింది. 


మూడేళ్ల క్రితం వచ్చారు...: కొణిజేటి సుబ్బారావు, రోశయ్య సోదరుడు, తెనాలి

మా ఇంటికి వచ్చి మూడేళ్లవుతుంది. కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషించేవాడు. ఎవరికి ఏకష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునే వారం. వేమూరులో ఉమ్మడి కుటుంబంతో గడిపేవారం. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు.

Updated Date - 2021-12-05T06:02:06+05:30 IST