తస్మాత్‌ జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-11-25T03:50:24+05:30 IST

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పారిశుధ్యం క్షీణించి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా నీరు కలుషితం కావడం వల్ల అతిసార పొంచి ఉంది.

తస్మాత్‌ జాగ్రత్త!
డాక్టర్‌ రమణయ్య

అశ్రద్ధ చేస్తే అనారోగ్యమే 

ఇప్పటికే వ్యాధులతో జిల్లా కటకట 

ఇలా జాగ్రత్తలు పాటిస్తే ఉపయోగం 

నెల్లూరు (వైద్యం), నవంబరు 24 : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పారిశుధ్యం క్షీణించి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా నీరు కలుషితం కావడం వల్ల అతిసార పొంచి ఉంది. అలాగే డెంగ్యూ, మలేరియా వ్యాఽధులతోపాటు వైరస్‌ ప్రభావానికి ఇదే సీజన్‌ కావడంతో కరోనా వంటి మహమ్మారి బారిన పడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 ఆహార నియమాలు...

కాచి చల్లార్చిన నీటినే తాగాలి. 

వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. నూనెతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువ తింటే అనారోగ్యానికి గురవుతారు. వీటికి దూరంగా ఉండాలి. 

ఉలవలను ఆహార రూపంలోనూ, సూపు రూపంలోనూ తీసుకుంటే శరీరానికి అవసరమైన వేడిని ఇస్తుంది. 

వర్షాకాలంలో జీర్ణశక్తి బాగా తగ్గుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కూరలను, వేయించిన ఆహార పదార్థాలను తగ్గించండి. ప్రత్యేకించి బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. 

మాంసాహారం తినడం మంచిది కాదు. ఇందులో ఉండే ప్రొటీన్లు త్వరగా జీర్ణం కావు. పైగా జంతువులు కలుషిత నీరు తాగడం వల్ల ఆ ప్రభావం తిన్న వారిపై ఉండే అవకాశం ఉంది. 

పాలలో సొంఠి, అల్లం ముక్కలు, మిరియాల పొడి ఇలా ఏదో ఒకటి వేసి తాగడం వల్ల శరీరానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. 


క్రిమి సంహారక మందులు ఉంచుకోవాలి 

వర్షాకాలంలో నివాస గృహాల్లోకి సూక్ష్మజీవులు చేరకుండా క్రిమిసంహారక ఔషధాలు, కీటక నాశన పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలి. క్రిములు, సూక్ష్మజీవులను మోసుకువచ్చే దోమలు, ఈగలు వంటి వాటిని రానివ్వకుండా పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవాలి. కిటికీలకు జాలీలు అమర్చుకోవాలి. దుస్తులను, పాదరక్షలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతులకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా సబ్బుతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాల సంరక్షణ కోసం ఉదయం, సాయంత్రం గోరువెచ్చటి నీటితో కడిగి, పొడిగుడ్డతో తుడుచుకోవాలి. 


వర్షాలలో జాగ్రత్తలు తీసుకోవాలి

- డాక్టర్‌ ఎంవీ.రమణయ్య, పీపీసీ వైద్యులు

వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. గొడుగు, రెయిన్‌కోట్‌ లేకుండా వర్షంలో  బయటకు వెళ్లకూడదు.


Updated Date - 2020-11-25T03:50:24+05:30 IST