Roger Federer: రోజర ఫెదరర్ సంచలన నిర్ణయం.. టెన్నిస్‌కు వీడ్కోలు

ABN , First Publish Date - 2022-09-16T01:29:17+05:30 IST

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ( Roger Federer) సంచలన ప్రకటన చేశాడు. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు

Roger Federer: రోజర ఫెదరర్ సంచలన నిర్ణయం.. టెన్నిస్‌కు వీడ్కోలు

న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ( Roger Federer) సంచలన ప్రకటన చేశాడు. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 23 నుంచి లండన్‌లో జరగనున్న లావెర్ కప్ (Laver Cup) తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నాడు. 20 గ్రాండ్‌ స్లామ్‌లు సొంతం చేసుకున్న ఫెదరర్ దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. టెన్నిస్‌తో తన అనుబంధం కొనసాగుతుందన్న ఫెదరర్.. ఈ నెల 23న ప్రారంభం కానున్న లావెర్ కప్ తనకు చివరి టూర్ అని పేర్కొన్నాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లలో ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్, 8 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్ ఉన్నాయి.


వింబుల్డన్ 2021 క్వార్టర్ ఫైనల్‌లో కనిపించిన తర్వాత ఏ టూర్‌లోనూ ఆడనప్పటికీ పునరాగమనాన్ని మాత్రం కొట్టిపడేయలేదు. అయితే, ఈ స్విస్ దిగ్గజం ఇటీవల తరచూ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ విషయంలో తన శరీరం తనకు స్పష్టమైన సందేశం పంపిందని, అందుకే ఈ ప్రకటన అని పేర్కొన్నాడు. గత మూడేళ్లలో గాయాలు, సర్జరీలతో పలు సవాళ్లు ఎదుర్కొన్న విషయం మీలో చాలామందికి తెలుసన్న ఫెదరర్.. పూర్తిస్థాయిలో ఫామ్ సంతరించుకుని పునరాగమనం కోసం చాలా ప్రయత్నాలు చేశానన్నాడు. అయితే, తన శరీర సామర్థ్యం పరిమితమన్న విషయం కూడా తనకు తెలుసన్నాడు. ఆ సందేశం తనకు 41 ఏళ్ల వయసులో అందిందని చెప్పుకొచ్చాడు. 


24 ఏళ్లలో తాను 1500కుపైగా మ్యాచ్‌లు ఆడానన్న ఫెదరర్.. తాను కలలు కన్న దానికంటే టెన్నిస్ తనకు ఎక్కువే ఇచ్చిందన్నాడు. అయితే, తన పోరాట కెరియర్ ముగింపునకు వచ్చిన విషయాన్ని తాను తప్పకుండా గుర్తించాలని అన్నాడు. వచ్చే వారం లండన్‌లో జరగనున్న లావెర్ కప్ తన చివరి ఏటీపీ ఈవెంట్ అని ఫెదరర్ వివరించాడు. భవిష్యత్తులోనూ టెన్నిస్ ఆడతానని, అయితే గ్రాండ్‌స్లామ్‌లు, ఏటీపీల్లో మాత్రం కాదని స్పష్ట చేశాడు. 


ఫెదరర్ చివరిసారి 2018లో గ్రాండ్‌ స్లామ్ కిరీటం అందుకున్నాడు. 2019లో వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే, సెర్బియన్ స్టార్ నోవాక్ జొకోవిక్ (Novak Djokovic) చేతిలో ఓటమి పాలయ్యాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్.. రఫెల్ నాదల్ ఆల్‌టైమ్ రికార్డుకు రెండు ట్రోఫీల దూరంలో నిలిచిపోయాడు.  2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న పెదరర్.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ డబుల్స్ విభాగంలో స్వర్ణం అందుకున్నాడు.



Updated Date - 2022-09-16T01:29:17+05:30 IST