ఆ జోరు సాగాలి..

ABN , First Publish Date - 2022-07-01T09:53:10+05:30 IST

కొవిడ్‌ కల్లోలంతో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు కోసం భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఆ జోరు సాగాలి..

రోహిత్‌ అవుట్‌

బుమ్రాకు కెప్టెన్సీ

మధ్యాహ్నం 3 గంటల నుంచి సోనీ1లో..

నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు 

2-1తో భారత్‌ ఆధిక్యం 


ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ కు తొమ్మిది నెలల తర్వాత ముగింపు లభించబోతోంది. 2021, సెప్టెంబరులో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగగా.. భారత్‌ అద్వితీయ ఆటతీరుతో 151 పరుగుల తేడాతో నెగ్గింది. అదే ఊపులో చివరి టెస్టు జరిగితే సిరీస్‌ కూడా దక్కేదే. కానీ ఆ తర్వాత వచ్చిన గ్యాప్‌లో ఇంగ్లండ్‌ జట్టు పరిస్థితి చాలా మారింది. ఇటీవలే వరల్డ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌పై 3-1తో సిరీస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు.. భారత్‌తో ఆ రీషెడ్యూల్‌ (ఐదో) టెస్టునూ నెగ్గాలని సై అంటోంది. అటు రెగ్యులర్‌ కెప్టెన్‌ లేని టీమిండియా ఈ మ్యాచ్‌ గెలిస్తే 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై సిరీస్‌ అందుకోనుంది.


బర్మింగ్‌హామ్‌లో భారత్‌ ఆడిన ఏడు టెస్టుల్లో ఒక్కసారీ గెలువలేకపోయింది. ఆరుసార్లు ఓటమిపాలైంది.. ఒక మ్యాచ్‌ డ్రా అయ్యింది.


ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ 1971, 1986, 2007లలో మాత్రమే టెస్టు సిరీ్‌సలు గెలిచింది. 

బర్మింగ్‌హామ్‌: కొవిడ్‌ కల్లోలంతో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు కోసం భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో శుక్రవారం నుంచి ఈ ఆసక్తికర పోరుకు తెర లేవనుంది. ప్రస్తు తం ఈ సిరీ్‌సలో భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. కానీ బరిలోకి దిగడానికి ముందే జట్టుకు భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ కరోనాతో దూరమయ్యాడు. గురువారం ఉదయం పరీక్షలో కూడా అతను పాజిటివ్‌గా తేలడంతో వైస్‌కెప్టెన్‌ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వైస్‌ కెప్టెన్‌గా పంత్‌ వ్యవహరిస్తాడు. ఇక కొత్త కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, కోచ్‌ మెకల్లమ్‌ ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌ అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ కీలక పోరులోనూ ఆ జట్టు సరికొత్త తరహా ఆటతో చెలరేగి 2-2తో సిరీ్‌సను సమం చేయాలనుకుంటోంది.


రాణించగలరా..?

గతేడాది కోహ్లీ ఆధ్వర్యంలో జరిగిన నాలుగు టెస్టుల్లో రోహిత్‌ శర్మ ఓ శతకం, నాలుగు అర్ధసెంచరీలతో 368 పరుగులు సాధించాడు. అటు రాహుల్‌ 315 పరుగులతో ఆకట్టుకున్నాడు. సీమింగ్‌ పిచ్‌లపై వీరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కానీ ఈ ఇద్దరూ లేకుండానే ఈసారి బరిలోకి దిగడం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బే. అటు బ్యాటింగ్‌ లైన్‌పపై మేనేజ్‌మెంట్‌ మల్లగుల్లాలు పడుతోంది. గిల్‌కు జతగా విహారి, భరత్‌, మయాంక్‌లలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. కోహ్లీ తన పరుగుల కొరతను తీర్చుకోవాల్సి ఉంది. శ్రేయాస్‌ అయ్యర్‌, పంత్‌ మిడిలార్డర్‌లో రానున్నారు. బౌలింగ్‌ విభాగంలో కెప్టెన్‌ బుమ్రా, షమి పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సిరీ్‌సలో బుమ్రా 18 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ ఆడే అవకాశముంది. మూడో సీమర్‌గా సిరాజ్‌, ఉమేశ్‌ మధ్య పోటీ ఉంది. ఏకైక స్పిన్నర్‌గా జడేజా వైపు మొగ్గు చూపవచ్చు.


 సూపర్‌ ఫామ్‌లో..

ఇటీవలి న్యూజిలాండ్‌తో సిరీ్‌సలో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్లు రూట్‌ (2 సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ), బెయిర్‌స్టో (2 సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ), ఒల్లీ పోప్‌ (1 సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ) చూపిన ఫామ్‌ ప్రత్యర్థికి భయంగొలిపేలా ఉంది. ముఖ్యంగా బెయిర్‌స్టో అయితే టెస్టుల్లోనూ బాదుడు రుచి చూపిస్తున్నాడు. ఈత్రయాన్ని భారత బౌలర్లు ఏమేరకు నిలువరించగలరనే దానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది. కెప్టెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ క్యారీ ఫామ్‌లో ఉన్నారు. ఇక గాయం నుంచి కోలుకున్న వెటరన్‌ జేమ్స్‌ అండర్సన్‌ జట్టులో చేరాడు. కొత్త బౌలర్లు మ్యాటీ పాట్స్‌, ఒవర్టన్‌ సత్తా నిరూపించుకున్నారు. లీడ్స్‌ టెస్టులో కివీ్‌సపై స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ పది వికెట్లతో మెరిశాడు. కొవిడ్‌తో కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా బిల్లింగ్‌ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్లు శుభారంభం అందించాల్సి ఉంది. 


జట్లు

భారత్‌ (అంచనా):

గిల్‌, విహారి/భరత్‌, పుజార, కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, పంత్‌, జడేజా, శార్దూల్‌, షమి, బుమ్రా, సిరాజ్‌/ఉమేశ్‌.


ఇంగ్లండ్‌ (తుది జట్టు):

అలెక్స్‌ లీస్‌, జాక్‌ క్రాలే, జో రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ (కెప్టెన్‌), సామ్‌ బిల్లింగ్స్‌, ఒల్లీ పోప్‌, మాథ్యూ పాట్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, జాక్‌ లీచ్‌.

Updated Date - 2022-07-01T09:53:10+05:30 IST