ఎమ్మెల్యే రోజాకు కుదుపులు.. కారణం ఎవరూ?

ABN , First Publish Date - 2022-02-25T00:14:02+05:30 IST

ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరడం వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల నగరిలో జరుగుతున్న పరిణామాలు రోజాకు మింగుడుపడడం లేదు.

ఎమ్మెల్యే రోజాకు కుదుపులు.. కారణం ఎవరూ?

అమరావతి: ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరడం వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల నగరిలో జరుగుతున్న పరిణామాలు రోజాకు మింగుడుపడడం లేదు. మరోవైపు జిల్లాల విభజనపైనా ఆమె అసంతృప్తిగా ఉన్నారు. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల విభజనపై మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రజలతో కలిసి ఆందోళన బాట పట్టారు. రోజా కూడా తన నియోజకవర్గ పరిస్థితులను బహిరంగంగానే చెబుతున్నారు. నగరిని తిరుపతిలో కలపాలని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అపాయింట్‌మెంట్ కోరడంపై చర్చ జరుగుతోంది. సీఎం దగ్గర ఆమె నియోజకవర్గ సమస్యలు చర్చిస్తారా? లేక రాజకీయంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను చెబుతారా? అని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 


త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో తన చోటు గురించి ఖరారు చేసుకోవడం కోసమే సీఎంను కలుస్తున్నారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తొలిసారే మంత్రి పదవి దక్కుతుందని ఆమె గట్టిగా నమ్మారు. అప్పట్లో ఈమె పేరు ప్రముఖంగా వినిపించింది. మంత్రి పదవి పక్కా అంటూ ప్రచారం కూడ జరిగింది. కానీ ఆమె ఆశ నెరవేరలేదు. నగరి నియోజకవర్గం నుంచి రోజా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మొదటిసారి సాఫీగా జరిగిన ఆమె ప్రయాణం... రెండో సారి గెలిచినప్పటి నుంచి కుదుపులకు గురవుతున్నారు. జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ మంత్రి అండదండలతో ఆమె వ్యతిరేకవర్గం రెచ్చిపోతోంది. ఈ సారి రోజాకు టికెట్ రాకుండా చేస్తామంటూ బహిరంగంగా ప్రకటించే స్థాయికి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో రోజా ఆగ్రహంగా ఉన్నారని, సీఎం దగ్గరే పంచాయతీ తేల్సుకోవాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Updated Date - 2022-02-25T00:14:02+05:30 IST