రొనాల్డో దెబ్బకు.. రూ.30వేల కోట్లు నష్టపోయిన కోకాకోలా

ABN , First Publish Date - 2021-06-16T19:46:44+05:30 IST

పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన పని.. కోకా కోలా బ్రాండ్‌ వాల్యూను భారీగా దెబ్బ తీసింది. ఒక్కసారిగా

రొనాల్డో దెబ్బకు.. రూ.30వేల కోట్లు నష్టపోయిన కోకాకోలా

బుడాపెస్ట్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన పని.. కోకా కోలా బ్రాండ్‌ వాల్యూను భారీగా దెబ్బ తీసింది. ఒక్కసారిగా 4 బిలియన్ డాలర్లను కంపెనీ నష్టపోయింది. డైలీ స్టార్ అనే పత్రికా కథనం ప్రకారం.. వాల్యూ 1.6శాతం దిగువకు పడిపోయింది. స్టాక్ మార్కెట్లో దాని విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 వేల కోట్లు. 


ఇంతకూ ఏం జరిగింది? 


‘యూరో 2020’ గేమ్స్‌లో మంగళవారం హంగేరితో మ్యాచ్‌కు ముందు కోచ్‌ ఫెర్నాండో సాంట్సోతో కలిసి కెప్టెన్‌ రొనాల్డో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టేబుల్‌పై రెండు కోకాకోలా బాటిళ్లు ఉండడాన్ని రొనాల్డో గమనించాడు. వాటిని పక్కనపెట్టేసిన రొనాల్డో శీతల పానీయాల బదులు అందరూ మంచి నీళ్లు తాగండంటూ వాటర్‌ బాటిల్‌ చూపిస్తూ సలహా ఇచ్చాడు. ఈ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. రొనాల్డో చర్య వివాదాస్పదమైంది. రొనాల్డో మాటల ప్రభావం దాని మార్కెట్ వాల్యూపై పడటంతో చర్చనీయాంశమైంది. సెలబ్రెటీల మాటలకు ఎంత వాల్యూ ఉంటుందో.. ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, యూరో గేమ్స్‌కు కోకాకోలా అధికారిక స్పాన్సర్‌ కావడం గమనార్హం. ఇప్పటికైతే రొనాల్డోపై నిర్వాహకులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. 

Updated Date - 2021-06-16T19:46:44+05:30 IST